logo

పేదల్ని చిదిమేసిన కర్కశ చక్రాలు

వాహనాల కర్కశ చక్రాలు నిరుపేద కుటుంబాల్లో అశాంతి రేపాయి. జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన దుర్ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ నవ వరుడు ఉండటం విషాదం నింపింది.

Published : 26 Jun 2024 01:39 IST

వేర్వేరుచోట్ల ముగ్గురి దుర్మరణం
కారు ఢీకొని నవ వరుడి విషాదాంతం

వెంకట సాయికుమార్‌ (పాతచిత్రం)

దర్శి, న్యూస్‌టుడే: వాహనాల కర్కశ చక్రాలు నిరుపేద కుటుంబాల్లో అశాంతి రేపాయి. జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన దుర్ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ నవ వరుడు ఉండటం విషాదం నింపింది.
కారు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన దర్శిలోని కురిచేడు రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది. 108 సిబ్బంది నరేష్, గౌస్‌ బాషా, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శిలోని డీవీఎస్‌ నగర్‌కు చెందిన తిరువాయిపాటి వెంకటసాయి కుమార్‌ (23)కు కొంతకాలం క్రితమే ఉమా మహేశ్వరితో వివాహమైంది. ఆమె ప్రస్తుతం నిండు గర్భిణి. సాయి కుమార్‌ కూలి పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం పట్టణంలో పనులు పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళుతున్నారు. అదే సమయంలో కురిచేడు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.


వెల్లంపల్లి వంతెన వద్ద..

మద్దిపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మద్దిపాడు మండలం వెల్లంపల్లి బ్రిడ్జిపై చోటు చేసుకుంది..ఎస్సై మహేష్‌ కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం పెదపావనికి చెందిన నాయబ్‌ రసూల్‌ కుమారుడు షేక్‌ రహంతుల్లా (25) కారు చోదకుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన ఒంగోలు - గుంటూరు రహదారిలో బొలేరో వాహనంలో బయలుదేరారు. వెల్లంపల్లి వంతెనపై వాహనానికి పంక్చర్‌ పడింది. దీంతో రహదారి పక్కన టైరు మారుస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని,  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


మతిస్థిమితం లేని వ్యక్తి..

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గుర్తుతెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలోని నల్లమల అటవీప్రాంతంలో సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఓ గుర్తుతెలియని వ్యక్తి దిగువమెట్టలో భిక్షాటన చేస్తూ రహదారుల వెంట తిరిగేవాడు. సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళుతుండగా వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జాతీయ రహదారి పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అతనికి మతిస్థిమితం లేదని, దీనిపై కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ జింకా రంగయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని