logo

సాగర్‌ కాల్వల సర్వనాశనం

నాగార్జున సాగర్‌ కాలువలు అన్నదాతకు వరం. లక్షలాది లోగిళ్లలో వెలుగులు నింపుతూ..అమూల్యమైన జలం వృథా పోకుండా చివరి ఎకరాకు చేర్చుతున్నాయి. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు అందించిన రూ.680 కోట్ల నిధులతో 2008 నుంచి 2016 వరకు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన మేజరు, మైనరు కాలువలను ఆధునికీకరించారు.

Published : 26 Jun 2024 01:44 IST

నాడు రూ.680 కోట్లతో నవీకరణ
జగన్‌ జమానాలో చిల్లిగవ్వ రాలే..
అధ్వానంగా మేజర్, మైనర్లు
కూటమి ప్రభుత్వం రాకతో కొత్త ధీమా
న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం

నాడు నిండుకుండలా సాగర్‌ ప్రధాన కాలువ

నాగార్జున సాగర్‌ కాలువలు అన్నదాతకు వరం. లక్షలాది లోగిళ్లలో వెలుగులు నింపుతూ..అమూల్యమైన జలం వృథా పోకుండా చివరి ఎకరాకు చేర్చుతున్నాయి. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు అందించిన రూ.680 కోట్ల నిధులతో 2008 నుంచి 2016 వరకు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన మేజరు, మైనరు కాలువలను ఆధునికీకరించారు. 2019లో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక వాటి మరమ్మతులకు అయిదేళ్లలో చిల్లిగవ్వ కూడా మంజూరు చేయకపోవడంతో ఎక్కడికక్కడే శిథిలమై..చిల్లచెట్లతో నిండిపోయి నాటి పాలకుల నిర్వాకానికి అద్దం పడుతున్నాయి.

జిల్లాలోని సాగర్‌ ప్రధాన కాలువల పరిస్థితి దయనీయంగా మారింది. జగన్‌ హయాంలో ఇవన్నీ పిచ్చి మొక్కలతో అడవిని తలపించాయి. గండ్లు పడి అధ్వానంగా మారాయి. కొన్నిచోట్ల సిమెంటు కట్టడాలు పగిలిపోవడంతో నీరంతా వాగుల పాలైంది. మొత్తంగా పరిశీలిస్తే వైకాపా ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగం నిర్వీర్యం అయింది. ఫలితంగా దిగువ అన్నదాతకు నాలుగేళ్లపాటు కడగండ్లు మిగిలాయి. జిల్లాలో 97 మైళ్ల మేర ప్రధాన కుడి కాలువతో పాటు దర్శి, పమిడిపాడు, ఒంగోలు బ్రాంచి కాలువలు విస్తరించి ఉన్నాయి. మరో 585 మైళ్ల మేర మేజర్, మైనర్‌ కాలువలు ఉన్నాయి. 10 డీసీలు, 97 సాగునీటి సంఘాలున్నాయి. జిల్లాలో వాటి పరిధిలో 2,55,699 ఎకరాలుండగా అందులో మాగాణి 1,03,123, మెట్ట 1,52,576 ఎకరాల సాగర్‌ ఆయకట్టు ఉంది. ఆధునికీకరణ పనుల తర్వాత వైకాపా పాలనలో కాలువల నిర్వహణ మరిచారు. ఈ నేపథ్యంలో ప్రధాన కాలువతో పాటు బ్రాంచి కాలువలు, మేజర్, మైనర్‌ కాలువలు అధ్వానంగా మారాయి. విపరీతంగా పిచ్చి, కంప పెరిగి కాలువ కరకట్టలు అడవిని తలపిస్తున్నాయి. అనేకచోట్ల సిమెంటు కాంక్రీటు లైనింగ్‌ దెబ్బతినడంతో కాలువల ఛిద్రమయ్యాయి. దీంతో నీరంతా వృథాగా పోతుండటంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రధాన కాలువ లోపలి అంచుల వెంట లైనింగ్‌లో పెరిగిన కంప చెట్లు

మరమ్మతులు చేస్తేనే..

లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించే సాగర్‌ కాలువలకు గత అయిదేళ్ల వైకాపా పాలనలో మరమ్మతుల ఊసే మరిచారు. అంతకుముందు కాంగ్రెస్, తెదేపా హయాంలో రూ.680 కోట్లు వెచ్చించి ఆధునికీకరణ పనులు నిర్వహించినా.. ఆ తర్వాత మరమ్మతులు చేపట్టలేదు. దీంతో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. నీటి విడుదల సమయంలో కాలువకు గండ్లు పడి వృథాగా వాగుల పాలవుతోంది. పైగా అత్యవసర పనులకూ రూపాయి నిధులు మంజూరు చేయలేదు. ఈక్రమంలో చివరి భూములకు సాగు నీరు అందడం లేదు. పలుచోట్ల సిమెంటు కాంక్రీటు లైనింగ్‌ ధ్వంసమైంది. సాగర్‌ ప్రధాన కాలువ కరకట్ట లోపల ఇరు వైపులా అంచుల వెంట పిచ్చి చెట్లు పెరిగి వేర్లు సిమెంటు కట్టడాల్లోకి చొచ్చుకొని పోతుండటంతో లైనింగ్‌ నెర్రెలిచ్చి పగిలిపోతున్నాయి. ప్రధాన కాలువ కరకట్టల వెంట పిచ్చి చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. దీంతో నీటి సరఫరా పర్యవేక్షణకు రాకపోకలు సాగించే సిబ్బందికి తీవ్ర ఆటంకంగా మారింది. ఖరీఫ్‌ ఆరంభమైన వేళ కాలువలకు నీరొచ్చే సమయానికి నూతనంగా కొలువు తీరిన తెదేపా ప్రభుత్వం కాలువల గట్లపై పిచ్చి కంప తొలగింపుతో పాటు అత్యవసర పనులు చేపడతారని రైతులు ఆశిస్తున్నారు.

ముడివేముల మేజర్‌ డ్రాపు వద్ద సిమెంటు కాంక్రీటు లైనింగ్‌ ధ్వంసమై మొలిచిన గడ్డి


చివరి భూములు బీళ్లయ్యాయి

వైకాపా హయాంలో సాగునీటి రంగం నిర్లక్ష్యానికి గురైంది. ధ్వంసమైన  కట్టలతో పాటు అధ్వానంగా తయారైన కాలువలకు గత అయిదేళ్లలో నిధులు మంజూరు చేయకపోవడంతో చిన్నపాటి మరమ్మతులు కూడా చేయలేదు. దీంతో ఏటా సాగర్‌ నీరు వచ్చినప్పుడల్లా దిగువకు చేరకుండా వాగుల ద్వారా సముద్రం పాలైంది. ఫలితంగా నీరందక చివరి భూములు బీళ్లుగా మారాయి.

దేవినేని చలమయ్య, కె.ముడివేముల, త్రిపురాంతకం మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని