logo

ఏడాదిలోనే రైలు భాగ్యం

వైకాపా అయిదేళ్ల పాలనలో నత్తనడకన సాగిన రైల్వే లైన్‌ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. అప్పటి వైకాపా పాలకుల వైఖరితో కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్‌పై ఆసక్తి చూపలేదు.

Updated : 11 Jul 2024 06:34 IST

చురుగ్గా నడికుడి-శ్రీకాళహస్తి పనులు
80 శాతం పూర్తయిన వంతెనలు

సిద్ధంగావున్న సిమెంట్‌ దిమ్మెలు

వైకాపా అయిదేళ్ల పాలనలో నత్తనడకన సాగిన రైల్వే లైన్‌ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. అప్పటి వైకాపా పాలకుల వైఖరితో కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్‌పై ఆసక్తి చూపలేదు. ఇటీవలే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ మళ్లీ చురుగ్గా పట్టాలెక్కుతోంది. ఇటీవల కనిగిరి ప్రాంతంలో పనులు పునః ప్రారంభమయ్యాయి. ఇవి ఏడాదిలోగానే పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతుండటంతో స్థానికులకు రైల్లో ప్రయాణ భాగ్యం అందుబాటులోకి రానుంది. 

న్యూస్‌టుడే, కనిగిరి :  జిల్లా పరిధిలో నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో చురుగ్గా సాగినా.. వైకాపా కొలువుదీరాక మందగించాయి. అయితే అప్పటికే భూ సేకరణ, నిధుల మంజూరు, రైతులకు నష్టపరిహారం చెల్లింపు, రైల్వే వంతెనల నిర్మాణం, ట్రాక్‌ మట్టి పనులు, విద్యుత్తు లైన్‌ ఏర్పాటు వంటివి ఎన్నో అవాంతరాల మధ్య పూర్తయ్యాయి. ప్రస్తుతం మట్టి పనులు, వంతెనల నిర్మాణం వంటివి కొంతమేర జరిగి నిలిచిపోగా..ప్రస్తుతం మళ్లీ అక్కడి నుంచే మొదలుపెడుతున్నారు. 

కనిగిరి మండలం పేరంగుడిపల్లి వద్ద రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు  

పొదిలి - పామూరు మధ్య ప్రారంభం

పల్నాడు జిల్లా శావల్యాపురం నుంచి జిల్లాలోని గుండ్లకమ్మ, కురిచేడు మీదుగా దర్శి వరకు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయింది. అధికారులు రైలు ద్వారా ట్రయిల్‌ రన్‌ పూర్తిచేశారు. వివిధ కారణాలతో నిర్మాణం నిలిచిన పొదిలి, కనిగిరి, యడవల్లి, పునుగోడు శంకవరం, పేరంగుడిపల్లి, చినఇర్లపాడు, విజయగోపాలపురం, బల్లిపల్లి, బాల వెంకటాపురం, రావిగుంటపల్లి, వగ్గంపల్లి, చిలంకూరు, పామూరు, తిరగలదిన్నె ప్రాంతాల్లో మళ్లీ నిర్మాణం పునఃప్రారంభించారు. అందుకు సంబంధించి సామగ్రిని రైల్వే లైన్‌ వద్దకు చేర్చారు.

వంతెనలు దాదాపుగా పూర్తి

కనిగిరి, దర్శి, కురిచేడు, పొదిలి, పామూరు, ముండ్లమూరు, మర్రిపూడి, కొనకనమిట్ల మండలాల పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల్లో భూ సేకరణ పూర్తి కావడంతో పాటు, రైతులకు పరిహారం చెల్లించారు. ప్రధానంగా దర్శి నుంచి పామూరు మండలం తిరగలదిన్నె వరకు 32 గ్రామాల పరిధిలో సుమారు నలభైకు పైగా వంతెనలు పూర్తి చేశారు. మరో ఇరవై నిర్మాణంలో ఉన్నాయి. 107 కిలోమీటర్ల పరిధిలో మట్టి పనులు కూడా అయిపోయాయి. మండలంలోని పేరంగుడిపల్లి, పోలవరం వద్ద రైల్వే స్టేషన్‌ నిర్మాణం జరుగుతోంది. దర్శి వరకు ఇప్పటికే పనులు అయిపోగా.. ఈ ఏడాది లోపు పొదిలి, కనిగిరి, పామూరు మండలాల్లో పూర్తి స్థాయిలో ట్రాక్‌ పూర్తయ్యే పరిస్థితి ఉంది. దీంతో ఏడాది లోపు ఇవి పూర్తవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాము త్వరలోనే రైలెక్కే అవకాశముందని కనిగిరి ప్రాంతప్రజలు ఎదురుచూస్తున్నారు.


రూ. 350 కోట్ల పనులు...

చింతలపాలెం వద్ద నిర్మాణంలో వంతెన  

జిల్లాలో 107 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రైలు మార్గం సగానికి పైగా నిర్మాణం జరిగింది. వాస్తవంగా 2023 సంవత్సరం లోపే పూర్తి కావాల్సి ఉండగా, రైతులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం కావడంతో ఇబ్బంది ఎదురైంది. ఈ లైన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు కేటాయించగా, అందులో జిల్లాలో నిర్మాణ పనులకు రూ. 500 కోట్లు తొలి దశలో మంజూరుచేయగా..ఇంతవరకు రూ.350 కోట్ల మేర పనులు జరిగాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్‌ లో కొంతమేర నిధులు కేటాయించడంతో తిరిగి వేగవంతమయ్యాయి. 


త్వరలో కనిగిరికి రైల్వే సౌకర్యం
- ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఎమ్మెల్యే, కనిగిరి

దర్శి వరకు ట్రాక్‌ నిర్మాణం పూర్తయింది. కనిగిరి, పామూరు మండలాల పరిధిలో వంతెనల నిర్మాణం జరిగింది. ట్రాక్‌ క్రింద వేసే పెద్ద బారు దిమ్మలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశారు. ఈ ఏడాదిలోనే రైలు కనిగిరికి రానుంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి త్వరగా పూర్తయ్యేలా చేస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని