logo

Ts News: పిండి వంట.. ఆరోగ్యమే ఇంట..

సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది ముందుగా కరకరలాడే సకినాలు..అరిసెలు, అప్పాలు, తీయతియ్యని నువ్వుల లడ్డూలు అంటే ఇష్టపడని వారుండరు.. వీటిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలున్నాయి. కరోనా వంటి వైరస్‌ దాడి నుంచి తమను

Published : 15 Jan 2022 09:31 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది ముందుగా కరకరలాడే సకినాలు..అరిసెలు, అప్పాలు, తీయతియ్యని నువ్వుల లడ్డూలు అంటే ఇష్టపడని వారుండరు.. వీటిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలున్నాయి. కరోనా వంటి వైరస్‌ దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎన్నో పోషకాలు ఉండే ఈ పిండివంటలను తినడం ఎంతో మేలని వైద్యులు చెబుతున్నారు.


అరిసెలు.. బియ్యాన్ని ఒకరోజు ముందు రాత్రి కడిగి నానబెట్టి..ఉదయాన్నే పిండిలో బెల్లంపానకం, నువ్వులు వేసి తయారుచేస్తారు. ఇందులో మోనో అన్‌శాచురేటేడ్‌ ఫ్యాట్‌ ఉంటుంది. ఎముకల బలహీనత పోయి దృఢంగా మారుతారు. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మానసిక ఆందోళన దూరమై ప్రశాంతత లభిస్తుంది.  


సున్నుండలు.. నెయ్యి, బెల్లం, గోధుమలు, మినుములతో చేసే సున్నుండలు బలాన్నిస్తాయి. మినపప్పులో మంచి పోషకాలుంటాయి. గోధుమల్లో ఫైబర్‌ ఉంటుంది. సున్నుండలు  ఎక్కువ కాలం నిలువ ఉండే అవకాశం ఉంటుంది.


అప్పాలు.. బియ్యం, సెనగపిండి, ఉప్పు, కారం, వాము, నువ్వులు వేసి చేస్తారు. కరకరలాడే ఈ అప్పాల్లో కలిపే సెనగపిండి ఎంతో శక్తినిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది.  


నువ్వుల లడ్డూలు..   నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ లడ్డూలు శరీరానికి పూర్తిస్థాయిలో శక్తినిస్తాయి. బెల్లంలో ఐరన్‌ శాతం అధికంగా ఉంటుంది. రోజూ బెల్లం తింటే ఉత్సాహంగా ఉంటారు. రక్తహీనతతో బాధపడేవారికి ఈ లడ్డూలు  ఉపయోగకరంగా ఉంటాయి. శ్వాస ఇబ్బందులు తొలగిపోతాయి. కాలేయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. జీర్ణసంబంధ వ్యాధులు దరి చేరవు.


సకినాలు.. చలికాలంలో వచ్చే ఈ పండగకు సరిపోయేలా సకినాలు ఉంటాయి. వీటిని తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. బియ్యాన్ని నానబెట్టి దంచి పిండి చేసి సకినాలు చేస్తారు. కొందరు పండగకు వారం రోజుల ముందే చేయడం మొదలుపెడతారు. ఇందులో నువ్వులు, వాము(ఓమ) వేస్తారు. నువ్వుల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. మెగ్నీషియం, కాల్షియం వంటివి ఉన్నాయి. మహిళల్లో హార్మోన్‌ స్థాయులను సరిగ్గా ఉంచుతాయి. వాము జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.


పండగల్లో శాస్త్రీయత ఐశ్వర్య, పోషకాహార నిపుణులు,
ప్రకృతి వైద్యురాలు, నిజామాబాద్‌

మన సంస్కృతిలో పండగలకు ప్రముఖ స్థానం ఉంది. ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం..సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే అరుదైన ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభం.అంతటా చలిగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో కరోనా వంటి వైరస్‌ల ప్రభావం పెరుగుతుంది. దీని నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటూనే..శారీరక సమతుల్యత కోసం వేడిచేసేవి, శక్తినిచ్చేవి, సులభంగా జీర్ణమయ్యే పిండి వంటకాలను తీసుకోవాలి. ఈ పండగకు చేసుకునే అన్ని పిండి వంటలను బియ్యంతోనే చేయడం విశేషం. దీనిలో ఫైబర్‌, బి విటమిన్‌ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని