logo

మురిసిన సైరిగాం..!

జలుమూరు మండలం సైరిగాం గ్రామానికి చెందిన రైతు ముద్దాడ భాస్కరరావు, లక్ష్మి దంపతుల రెండో కుమారుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రవిచంద్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా అమరావతిలో గురువారం బాధ్యతలు చేపట్టడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, యువత హర్షం వ్యక్తం చేశారు.

Updated : 14 Jun 2024 04:51 IST

ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా రవిచంద్ర బాధ్యతల స్వీకరణ 
హర్షం వ్యక్తం
చేసిన గ్రామస్థులు

రవిచంద్ర సహకారంతో నిర్మించిన ఆసుపత్రి 

న్యూస్‌టుడే, జలుమూరు: జలుమూరు మండలం సైరిగాం గ్రామానికి చెందిన రైతు ముద్దాడ భాస్కరరావు, లక్ష్మి దంపతుల రెండో కుమారుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రవిచంద్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా అమరావతిలో గురువారం బాధ్యతలు చేపట్టడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, యువత హర్షం వ్యక్తం చేశారు. 1996 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన 2014లో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు కలెక్టర్‌గా సేవలందించారు. ఆరోగ్య శాఖలో పని చేస్తున్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతం, నరసన్నపేట, సారవకోట ఆసుపత్రుల  అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు.   

  • గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు
  • తెదేపా (2014-19) హయాంలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పీహెచ్‌సీ నిర్మాణానికి సొంత భూమి కేటాయించారు. ప్రభుత్వ నిధులు మంజూరు చేసి అధునాతన వసతులతో భవనం నిర్మించారు. 
  • పశువుల ఆసుపత్రి నిర్మాణానికి సొంత భూమి కేటాయించారు.
  • బీ గ్రామంలో చెరువుల ఆక్రమణలు తొలగించి పూర్వవైభవం తీసుకొచ్చారు. 
  • రహదారులు అభివృద్ధి చేశారు. 
  • భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.
  • ఇంటింటికీ తాగునీటి సౌకర్యం కల్పించారు.
  • స్టేట్‌బ్యాంకు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
  • గ్రామ పంచాయతీ భవనం నిర్మించారు. 
  • పంచాయతీ పరిధిలో యువకులకు ఉపాధి కల్పించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడంతో జిల్లా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తారని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ముద్దాడ రవిచంద్ర

చాలా ఆనందంగా ఉంది..

మా సోదరుడు రవిచంద్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ సహకారంతో గ్రామంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించాం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నదే ఆయన ఆకాంక్ష. 

- ముద్దాడ శ్రీనివాసరావు, రవిచంద్ర సోదరుడు 

ఆయనే ఆదర్శం..

జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన పేద యువకులను ఉపాధి కల్పించారు. మా గ్రామంలో సొంత ఆస్తులు ఇచ్చి పాఠశాల సముదాయం, పశువుల ఆసుపత్రి, పీహెచ్‌సీ భవనాల నిర్మాణానికి కృషి చేశారు. విద్యాభివృద్ధికి సూచనలు చేస్తుంటారు. ఆయనను యువత ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నతంగా స్థిరపడటానికి కృషి చేస్తోంది. 

- ముద్దాడ రవివర్మ, యువకుడు, సైరిగాం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని