logo

ఆపద్బాంధవులు

నిత్యం ఎంతో మంది రోడ్డు ప్రమాద బాధితులు, రోగులకు రక్తం అవసరమవుతూ ఉంటుంది. సాటి మనిషి ఆపదను గుర్తించి పలువురు మానవతాదృక్పథంతో వ్యవహరిస్తున్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసి కష్టంలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.

Published : 14 Jun 2024 04:04 IST

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

నిత్యం ఎంతో మంది రోడ్డు ప్రమాద బాధితులు, రోగులకు రక్తం అవసరమవుతూ ఉంటుంది. సాటి మనిషి ఆపదను గుర్తించి పలువురు మానవతాదృక్పథంతో వ్యవహరిస్తున్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసి కష్టంలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. పలువురు స్వచ్ఛంద సంస్థలు సైతం సేవాస్ఫూర్తిని చాటుకుంటున్నారు.  నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నవారిపై ‘న్యూస్‌టుడే’ కథనం..

న్యూస్‌టుడే, గుజరాతీపేట (శ్రీకాకుళం)

ఓపిక ఉన్నంత వరకు ఇస్తాను..

నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు బ్యాంకులో ఒకసారి రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానంపై అపోహలతో నేను భయపడ్డాను. అప్పుడు 55 ఏళ్ల వయసున్న మా బ్యాంకు మేనేజరు స్వచ్ఛందంగా రక్తమిచ్చారు. ఆయన ద్వారా రక్తదానం ఆవశ్యకత తెలుసుకుని నేను కూడా 2006 నుంచి రక్తమివ్వడం మొదలుపెట్టాను. ప్రతి మూడు నెలలకోసారి ఏడాదికి నాలుగు సార్లు రక్తదానం చేసేవాణ్ని. ఏడాదిన్నర కిందట ఒడిశాలో రైలు ప్రమాదం జరిగినప్పుడు 68వ సారి రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో స్వచ్ఛంద రక్తదానం చేశాను. ఓపిక ఉన్నంత వరకు దీన్ని కొనసాగిస్తాను. 

- చల్లా రమణ మూర్తి, విశ్రాంత ఎస్‌బీఐ ఉద్యోగి, శ్రీకాకుళం

యువత ముందుకు రావాలి...

నేను ఇప్పటికీ 30 సార్లు రక్తదానం చేశాను. ఎటువంటి దుష్ప్రభావాలు కలగలేదు. ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేస్తే శరీరంలో ఎర్ర రక్తకణాలు వృద్ధి చెంది.. మరింత ఆరోగ్యంగా ఉంటాం. క్రమం తప్పకుండా రక్తం ఇవ్వడంతోనే నేను ఉత్సాహంగా పని చేయగలుగుతున్నాను. యువత ఈ దిశగా ఆలోచించి ముందుకు వస్తే రక్తం కొరతను అధిగమించవచ్చు.

- మాదారపు డేవిడ్, మోక్షజ్ఞ తారకరామ సేవా సంఘ జిల్లా అధ్యక్షుడు 

15 వేల మందిని ఆదుకున్నాం..

చిరంజీవి స్ఫూర్తితోనే నేను 2005 నుంచి రక్తదానం చేయడం ప్రారంభించాను. ఇప్పటి వరకు 62 సార్లు రక్తమివ్వడంతో పాటు ఇతరులనూ ప్రోత్సహిస్తున్నాను. మెగా ఫ్యామిలీ హీరోల జన్మదిన వేడుకల సమయంలో తప్పనిసరిగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 15 వేలమందికిపైగా రక్తం అందించాం. 

- తైక్వాండోశ్రీను, చిరంజీవి రక్తనిధి సభ్యుడు

ఎప్పుడైనా రక్తం ఇవ్వవచ్చు.. 

జిల్లాలో ఏడాదికి సుమారు 35 వేల యూనిట్ల రక్తం అవసరమవుతుంటుంది. అందులో రెడ్‌క్రాస్‌ ద్వారా 20 వేల యూనిట్లు అందిస్తున్నాం. రక్తదాన ప్రేరేపకుడు పెంకి చైతన్యకుమార్‌ 2006 నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించి లక్ష యూనిట్ల రక్తం సేకరించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం ఆవశ్యతను తెలుసుకోవాలి. రక్తదానం చేస్తే ఎలాంటి వ్యాధులు రావు. మరింత ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా యువత నిర్భయంగా ఏ కాలంలోనైనా రక్తదానం చేయవచ్చు.  

- పి.జగన్మోహనరావు, జిల్లా అధ్యక్షుడు రెడ్‌క్రాస్‌ సంస్థ

కుటుంబ సంప్రదాయం కావాలి..

నేను ఇప్పటికీ 49 సార్లు రక్తదానం చేశాను. ఆపదలో ఉన్నవారు రక్తనిధికి వచ్చి అవసరమైన గ్రూపు అడుగుతారు. కొన్నిసార్లు కొరత కారణంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. రక్తదానాన్ని కుటుంబ సంప్రదాయంగా మార్చి.. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా ఒకరు రక్తదానం చేయాలి. అలా చేస్తే నిల్వలు పుష్కలంగా ఉండటంతో పాటు ఆపదలో ఉన్నవారి ప్రాణాలు రక్షించడానికి వీలుపడుతుంది. 

- కేవీవీ పురుషోత్తమరావు(కళ్యాణ్‌) ప్రజారోగ్య వేదిక కన్వీనర్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని