logo

నిరుద్యోగులకు బాసట.. వృద్ధులు, రైతులకు భరోసా

ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు. అంతే స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా మొదటి రోజు గురువారం 5 దస్త్రాలపై సంతకాలు చేశారు. మెగా డీఎస్సీ, నైపుణ్య గణన, భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపై ముఖ్యమంత్రి సంతకాలు చేశారు.

Published : 14 Jun 2024 04:07 IST

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు
తొలిరోజు 5 దస్త్రాలపై సంతకాలతో హర్షాతిరేకాలు

న్యూస్‌టుడే, సోంపేట, పలాస: ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు. అంతే స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా మొదటి రోజు గురువారం 5 దస్త్రాలపై సంతకాలు చేశారు. మెగా డీఎస్సీ, నైపుణ్య గణన, భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపై ముఖ్యమంత్రి సంతకాలు చేశారు. అయిదేళ్లుగా వైకాపా హయాంలో ఎటువంటి డీఎస్సీ నిర్వహించక పోగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కుదించే ప్రక్రియ చేపట్టడంతో యువత తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీలో 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు మొదటి సంతకం చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. వివాదస్పదంగా మారిన భూ యాజమాన్య హక్కు చట్టం ఉపసంహరణకు సంబంధించి రెండో సంతకం చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మరో హామీ సామాజిక పింఛన్లను పెంచుతూ నిర్ణయం తీసుకొని సంతకం పెట్టడంతో బడుగు, బలహీన వర్గాలకు మరింత భరోసా దొరికినట్లయింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజునే ఈ నిర్ణయాలు తీసుకోవడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

అయిదేళ్లు వృథా అయ్యింది

వైకాపా ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం అయిదేళ్లుగా వేచి చూసి సమయం వృథా అయ్యింది. ఎన్నికల ముందు 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించినా శ్రీకాకుళం జిల్లాకు చాలా తక్కువ ఉన్నాయి. నిరుద్యోగ యువత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే పెట్టడం చాలా ఆనందంగా ఉంది. 

- డి.కిరణ్, డీఎస్సీ అభ్యర్థి, అంబుగాం బొడ్లూరు

యజమానులకు పూర్తి హక్కులు

భూ యాజమాన్య హక్కు చట్టం రద్దుతో భూమిపై యజమానులకు పూర్తి హక్కులు వస్తాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే వివాదస్పద చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు. దీంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చంద్రబాబుకి మాలాంటి ప్రజలంతా ఎంతో రుణపడి ఉంటారు. 

- పిండి.వెంకటరావు, కార్యదర్శి, బార్‌ అసోసియేషన్, పలాస 

పింఛను పెంపు ఎంతో ఉపయోగం

నేను మానసిక వికలాంగుడిని. గత ప్రభుత్వ హయాంలో రూ.3 వేల ఫించను వచ్చేది. తరచూ అనారోగ్యానికి గురవడంతో పని చేయలేక ఇంటి వద్దనే ఉంటున్నా. ప్రస్తుతం వస్తున్న ఫించను డబ్బులు మందులు కొనుగోలుకే సరిపోతున్నాయి. కొత్త ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని ప్రకటించటంతో ఎంతో ఆనందంగా ఉంది. మా లాంటి దివ్యాంగులకు పెంచిన ఫించను ఎంతగానో ఉపయోగపడుతుంది. 

- పి.బాలకృష్ణ, పింఛనుదారు, కాశీబుగ్గ

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి

అస్తవ్యస్త నిర్ణయాలతో జగన్‌ సర్కారు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసింది. గ్రామాల్లో బడి లేని పరిస్థితి కల్పించడంతో ప్రైవేటు పాఠశాలలకు లబ్ధి చేకూరింది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసి ఏటా డీఎస్సీ నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. నిరుద్యోగ యువతకు బాసటగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. 

- పి.లింగమ్మ, డీఎస్సీ అభ్యర్థిని, ధర్మపురం

చీకటి చట్టం రద్దుతో ఊపిరి పీల్చుకున్నాం

భూమిపై యజమానికి హక్కు లేని విధంగా తయారు చేసిన చీకటి చట్టం రద్దుతో ఊపిరి పీల్చుకున్నాం. వైకాపా ప్రభుత్వం భూమి ఆధారంగానే బతుకుతున్న వర్గాలకు తీరని అన్యాయం చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గం. తరతరాలుగా వస్తున్న హక్కులు కాల రాసేందుకు ప్రయత్నిస్తే రైతులు గట్టిగా సమాధానం చెబుతారని నిరూపితమైంది. 

- ఎస్‌.అప్పన్న, రైతు, బూర్జుపాడు

ఇతరులపై ఆధారపడకుండా జీవనం

వృద్ధులకు పింఛను పెంచడంతో ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండదు. పేద వర్గాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో చంద్రబాబు హయాంలోనే పింఛను రూ.2 వేలు ఇచ్చారు. ప్రస్తుతం అది రూ.4 వేలకు పెంచడంతో సంతోషకరం.

ఎస్‌.మోహన్‌రావు, పింఛనుదారు, సీమూరు  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని