logo

కువైట్‌ అగ్ని ప్రమాదంలో సోంపేట వాసి మృతి

కువైట్‌లో బుధవారం తెల్లవారుజామున ఎన్‌బీటీసీ కంపెనీ అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో జిల్లాకు చెందిన యువకుడు మృత్యువాత పడ్డాడు.

Updated : 14 Jun 2024 04:49 IST

లోకనాథం (పాత చిత్రం)

సోంపేట, న్యూస్‌టుడే: కువైట్‌లో బుధవారం తెల్లవారుజామున ఎన్‌బీటీసీ కంపెనీ అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో జిల్లాకు చెందిన యువకుడు మృత్యువాత పడ్డాడు. జీవనోపాధి కోసం కువైట్‌ వెళ్లిన సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31) ప్రమాదం జరిగిన రోజున అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకోవడంతో ఆయన పేరు నమోదు కాలేదు. తెల్లవారితే పేరు నమోదు చేసి విధుల్లో చేరే అవకాశం ఉండగా ఈలోగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన వారికి సంబంధించి నమోదైన పేర్లు మాత్రమే ప్రకటించడంతో లోకనాథం గురించి ఎటువంటి సమాచారం అందలేదు. మృతుల్లో రాష్ట్రానికి చెందిన వారెవరూ లేరనే వార్తలు చూసి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఆయన చరవాణికి ఫోన్‌ చేయగా స్విచ్ఛాప్‌ రావడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో ఆయన కువైట్‌ వెళ్లిన విమానం టికెట్, ఇతర వివరాలతో సంబంధిత కంపెనీలో వాకబు చేయడంతో మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడిన వారిలో లోకనాథం ఉన్నట్లు తెలిసింది. నెల రోజుల కిందట ఇంటికి వచ్చిన ఆయన ఈనెల 8న జింకిభద్ర నుంచి హైదరాబాద్‌ వెళ్లి అక్కడ నుంచి 11న విమానంలో కువైట్‌ వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి అక్కడికి చేరుకోవడంతో భద్రతా సిబ్బంది ఆయన పేరు ఉదయం నమోదు చేస్తామని చెప్పారు. ఇంతలో ప్రమాదం చోటుచేసుకుంది.

నెల కిందట స్వగ్రామానికి..

నాలుగేళ్లుగా కువైట్‌లోని ఎన్‌బీటీసీ సంస్థలో పని చేస్తున్న లోకనాథం తల్లిదండ్రులు చిరంజీవి, నారాయణమ్మ పిలుపు మేరకు వివాహ సంబంధాల కోసం నెల రోజుల కిందట స్వగ్రామం జింకిభద్ర వచ్చాడు. కొన్ని సంబంధాలు చూసిన తరువాత ముహూర్తాలు లేకపోవడంతో మళ్లీ రావాలని నిర్ణయించుకొని ఈ నెల 8న బయలు దేరాడు. తండ్రి బెంగళూరులో కర్రల మిల్లులో పనిచేస్తుండగా, తల్లి గ్రామంలో ఉంటున్నారు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేయడంతో పాటు కుటుంబ బాధ్యతలు చూసే లోకనాథం మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరుతుందని అధికారులు సమాచారమిచ్చారని సర్పంచి టి.పద్మావతి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని