logo

గుప్పుమంటున్న నాటుసారా..!

పలాస నియోజకవర్గం నాటుసారా వ్యాపారానికి అడ్డాగా మారింది. కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. మైదానం, ఉద్దానం, తీర గ్రామాల్లో విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఐదేళ్ల నుంచి వ్యాపారం జోరుగా సాగుతోంది.

Published : 14 Jun 2024 04:17 IST

ఉద్దానం, తీర గ్రామాల్లో యథేచ్ఛగా విక్రయం 

సింగుపురం వద్ద కొండ ప్రాంతంలో నాటుసారా తయారీ

హరిపురం (మందస), న్యూస్‌టుడే : పలాస నియోజకవర్గం నాటుసారా వ్యాపారానికి అడ్డాగా మారింది. కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. మైదానం, ఉద్దానం, తీర గ్రామాల్లో విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఐదేళ్ల నుంచి వ్యాపారం జోరుగా సాగుతోంది.

  • మందస మండలం రామరాయి, చాపరాయి, పట్టులోగాం, కొండలోగాం, టబ్బాగాం, బుడంబొ, చీపి, కుల్లాడి, గుడ్డికోల, డబార్శింగి, సింగుపురం, చొంపాపురం ప్రాంతాల్లో నాటుసారా ఉత్పత్తి చేస్తున్నారు. పలాస మండలం పెంటిపద్ర, సవర పెదంచల, లొత్తూరు, చినపలియా, పెద్దపలియా గ్రామాల్లో వండుతున్నారు. 
  • ఏజెన్సీ ప్రాంతాల్లోని తయారీ కేంద్రాల నుంచి కొందరు కొనుగోలు చేసి మైదానం, ఉద్దానం, తీర ప్రాంతాల్లోని పలు గ్రామాల వద్ద తోటల్లోని పొదల్లో నిల్వ చేసి విక్రయిస్తున్నారు. మందస మండలం నారాయణపురం, అల్లిమెరక, లొహరిబంద, రంగనాథపురం, అంబుగాం, లింబుగాం, నోతువార, రట్టి, బేతాళపురం, గంగువాడ, పిడిమందసకు చెందిన కొందరు ఇదే వ్యాపారంగా కాసులు సంపాదిస్తున్నారు. 
  • ఉత్పత్తి కేంద్రాల నుంచి కట్టిన మూటలను కాలేజీ బ్యాగుల్లో ఉంచి అధికారుల కళ్లు కప్పి ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్నారు. ఈ తంతు ప్రతిరోజు వేకువ జామున, సాయంత్రం చీకటి పడిన అనంతరం జరుగుతోంది. వజ్రపుకొత్తూరు మండలం కొండవూరు, అనకాపల్లి, యంపళ్లూరు, మరికొన్ని ప్రాంతాల్లో నాటుసారా వ్యాపారం జోరుగా సాగుతోంది. 
  • మందు బాబులు తక్కువ ధరకు లభించే నాటుసారాపై ఆధారపడుతున్నారు. ఉద్దానం గ్రామాల్లో వేడుకల సందర్భంగా పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు.  

మత్తు..చిత్తు 

గ్రామాల్లో కొందరు నిరుద్యోగులు అక్రమ మార్గంలో సంపాదించడానికి నాటుసారా వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు నాటుసారా మత్తుకు చిత్తవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఊరూరా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 

నిఘా పెంచుతాం..: నాటుసారా ఉత్పత్తి, రవాణా, వ్యాపారం చేయడం నేరం. ఇప్పటివరకు చాలా గ్రామాల్లో అమ్మకాలు చేస్తున్న వారిని పట్టుకుని కేసులు పెట్టాం. బట్టీలపై దాడులు చేశాం. నాటుసారా, బెల్లం ఊట నిల్వలను ధ్వంసం చేశాం. నిఘా మరింత పెంచుతాం. అక్రమ వ్యవహారానికి సంబంధించి సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆకస్మికంగా దాడులు చేస్తాం.

ఆర్‌.జైభీం, సీఐ, ఎస్‌ఈబీ, సోంపేట 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు