logo

ఎత్తిపోతలపై ఆశలు..!

వైకాపా పాలనలో చిన్నపాటి మరమ్మతులు చేపట్టకపోవడంతో జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకాలు మూలకు చేరాయి. రెండు పంటలు సహా ఏడాది పొడవునా కూరగాయల సాగుకు నీరు అందక రైతుల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Published : 14 Jun 2024 04:22 IST

పథకాల మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే సత్ఫలితాలు
ఖరీఫ్‌ సాగుకు రైతుల ఎదురుచూపులు

మోటార్ల మరమ్మతులతో మొరాయించిన రుషికుద్ద ఎత్తిపోతల పథకం

న్యూస్‌టుడే, సోంపేట: వైకాపా పాలనలో చిన్నపాటి మరమ్మతులు చేపట్టకపోవడంతో జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకాలు మూలకు చేరాయి. రెండు పంటలు సహా ఏడాది పొడవునా కూరగాయల సాగుకు నీరు అందక రైతుల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఐదేళ్లుగా అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. నీటి లభ్యత ఉన్నప్పటికీ పంట భూములకు అందే అవకాశం లేక అన్నదాతలు ఉసూరుమంటున్నారు. కొత్త ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ఖరీఫ్‌ సాగుకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

  • ఏడాది పొడవునా బీలబట్టిలో నీటి లభ్యత ఉండటంతో సోంపేట మండలం రుషికుద్ద, బెంకిలి, కంచిలి మండలం కుత్తుమలో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా  1,500 ఎకరాలకు సాగునీరు అందేది. ఖరీఫ్,   రబీలతో పాటు ఏడాది పొడవునా కూరగాయల పంటల సాగుతో ఆయకట్టు రైతులు ఉపాధి పొందేవారు. తిత్లీ తుపాను ప్రభావంతో అవి  దెబ్బతిన్నాయి. మరమ్మతులకు రూ.ఆరేడు లక్షలు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రూపాయి మంజూరు చేయకపోవడంతో పరికరాలు, పైపులైన్లు అధ్వానంగా మారాయి. ఫలితంగా రైతులు వర్షాధారంతో  ఖరీఫ్‌ సాగుకు పరిమితమయ్యారు.
  • బాహుదా నది ఆధారంగా ఇచ్ఛాపురం మండలం ఈదుపురం వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం నుంచి 1,500 ఎకరాలకు పైగా సాగునీరు అందేది. తిత్లీ తుపాను ప్రభావంతో మోటార్లు దెబ్బతిన్నాయి. ఇతర ఇబ్బందుల కారణంగా ఈ పథకం మూలనపడింది. రెండు పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో సాగుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. 
  • టెక్కలి మండలం చిన్నసేన, మదనగోపాలసాగరం, నందిగాం మండలం సుభద్రాపురం, కోటబొమ్మాళి మండలం నారాయణవలస, సారవకోట మండలం తొగిరి, జలుమూరు మండలం టెక్కలిపాడు తదితర పథకాలకు సంబంధించి రెండేళ్ల కిందట నియంత్రికల్లో రాగి తీగ, ఇతర పరికరాలు చోరీకి గురవడంతో  మూలకు చేరాయి.  
  • సోంపేట మండలం జగతికేశుపురం పథకానికి సంబంధించి రెండు మోటార్లకు ఒకటే పని చేస్తోంది. అది తరచూ మొరాయిస్తుండడంతో రైతులే మరమ్మతులు చేయించుకుంటున్నారు. జిల్లాలో పని చేస్తున్న పథకాల్లో సగం ఒకే మోటారుతో నడుస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నియంత్రికలు ఏర్పాటు చేస్తే ఏడు పథకాలు పని చేయడానికి అవకాశం ఉంది.  

తక్షణ చర్యలకు అచ్చెన్న ఆదేశాలు 

ఖరీఫ్‌ సాగుకు ఇబ్బంది లేకుండా జిల్లాలో ఎత్తిపోతల పథకాలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. నియంత్రికల ఏర్పాటు, మొరాయించిన పథకాలు పని చేయించడానికి తక్కువ నిధులే అవసరం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు సమాచారం.

పునరుద్ధరిస్తే మేలు

బీల ఆధారంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండటంతో రైతులకు ఉపయోగపడుతుంది. బెంకిలి, జింకిభద్ర గ్రామాల రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు, కూరగాయల సాగుతో ఉపాధి పొందుతారు. కొత్త ప్రభుత్వం పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. రైతులు సాగునీటికి ఇబ్బంది పడకుండా చూడాలి.

- సింహాచలం పాఢి, రైతు ప్రతినిధి, బెంకిలి

ప్రతిపాదనలు పంపాం..

జిల్లాలో మొరాయించిన ఎత్తిపోతల పథకాలు పని చేయించడానికి రూ.1.5 కోట్లు అవసరం. మోటార్లు, ఇతర మరమ్మతులు, నియంత్రికలు ఏర్పాటు చేయాలి. ఈదుపురం ఎత్తిపోతల పథకం శాశ్వత మరమ్మతులకు రూ.6.5 కోట్లతో ప్రతిపాదనలు పంపాం.

-కేవీవీ సుబ్రహ్మణ్యం, కార్యనిర్వాహక 

ఇంజినీరు, జిల్లా నీటిపారుదల అభివృద్ధి సంస్థ

జిల్లాలో ఎత్తిపోతల పథకాలు 42
మూలకు చేరినవి 18
అధికారిక ఆయకట్టు 35,385 ఎకరాలు
అనధికారికంగా 10 వేల ఎకరాలు
మరమ్మతులకు అవసరమైన మొత్తం సుమారు రూ.1.5 కోట్లు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని