logo

సంక్షేమ సంతకం.. పూర్వ వైభవం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ప్రధానమైన మెగా డీఎస్సీ, భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు, పింఛను పెంపు దస్త్రాలపై సంతకాలు చేయడంతో సిక్కోలు వాసులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

Published : 14 Jun 2024 04:28 IST

నిరుద్యోగులు, పింఛను లబ్ధిదారుల్లో ఉత్సాహం
భూ యాజమాన్య హక్కు చట్టం రద్దుతో రైతుల్లో ఆనందం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ప్రధానమైన మెగా డీఎస్సీ, భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు, పింఛను పెంపు దస్త్రాలపై సంతకాలు చేయడంతో సిక్కోలు వాసులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేయడంతో యువత ఉత్సాహంగా ఉన్నారు. పింఛను పెంపుతో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేవు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారని వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే ప్రధాన హామీల దస్త్రాలపై సంతకాలు చేయడంతో జిల్లావ్యాప్తంగా తెదేపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. 

-ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం

అమల్లోకి అన్న క్యాంటీన్లు

పేదలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని రూ.5కే అందించాలనే ఉద్దేశంతో 2018లో తెదేపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. గతంలో నరసన్నపేట, టెక్కలి, కోటబొమ్మాళి, పలాస, పాతపట్నం, ఆమదాలవలసలో ఒక్కోటి చొప్పున క్యాంటీన్లు ఉండేవి. వైకాపా ప్రభుత్వం వాటిని మూసివేసింది. శ్రీకాకుళం నగరంలోని క్యాంటీన్‌ను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ నగరంలో 400 రోజులకు పైగా అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. 

శ్రీకాకుళం నగరంలో ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చిన అన్న క్యాంటీన్‌ భవనం

ఊపిరి పీల్చుకున్న డీఎస్సీ అభ్యర్థులు

వైకాపా పాలన నిరుద్యోగులకు శాపంగా మారింది. ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి ప్రకటనలు విడుదల చేయకపోగా ఎన్నికల ముందు డీఎస్సీ అంటూ నాటకానికి తెరలేపింది. అరకొర పోస్టులతో నోటిఫికేషన్‌ జారీ చేయడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. చంద్రబాబు చెప్పిన ప్రకారం మెగా డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం చేయడంతో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో సంతోషం నెలకొంది.  

వెలుగులు నింపనున్న నైపుణ్య గణన

యువతలో నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ, పీజీ చదివినా చిన్న పనులకు వెళ్తున్న యువత జీవితాల్లో వెలుగులు నింపనుంది. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 2019 నుంచి ఇప్పటి వరకు 12,244 మంది వివరాలు నమోదు చేసుకున్నారు. చాలా మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరికీ నైపుణ్య గణన వరం కానుంది.  

భద్రత వచ్చింది..

భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు దస్త్రంపై చంద్రబాబు రెండో సంతకం చేసి జిల్లాలోని రైతులు, భూ యాజమానుల్లో ధైర్యం నింపారు. తమ భూములు ఇకపై భద్రంగా ఉంటాయనే భరోసా దక్కిందని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. 2023 అక్టోబరు 31న వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య చట్టంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థిరాస్తుల భద్రతను ప్రశ్నార్థకంగా మారడం.. చట్టబద్ధమైన హక్కులను నిర్ణయించే అధికారాన్ని అధికారులకు అప్పగించి, యాజమాన్య హక్కుల కల్పన బాధ్యతల నుంచి సివిల్‌ కోర్టులను తప్పించడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. వివాదాస్పదమైన చట్టాన్ని చంద్రబాబు రద్దు చేయడంతో జిల్లాలోని భూ యజమానులు హర్షం వ్యక్తం చేశారు. 

పింఛను పెంపు..సంతోషం రెట్టింపు

పింఛన్ల పెంపుతో జిల్లాలోని లబ్ధిదారుల్లో సంతోషం రెట్టింపైంది. వైకాపా పాలన చివరలో రూ.మూడు వేలు అందజేశారు. కూటమి అధికారంలోకి వస్తే రూ.4 వేలు ఇస్తామని చెప్పిన ప్రకారం సంబంధిత దస్త్రంపై చంద్రబాబు మూడో సంతకం చేశారు. జిల్లాలో 732 సచివాలయాలు, 984 పంచాయతీల పరిధిలో 3,19,702 మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వారిలో వృద్ధులు 1,71,602 మంది, వితంతువులు 74,652 మంది, దివ్యాంగులు 32,135 మంది ఉన్నారు. ఈ నెలలో మొత్తం రూ.93.30 కోట్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా రూ.వెయ్యి పెంచడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

నిరీక్షణ ఫలించింది..

డీఎడ్‌ పూర్తి చేసి ఐదేళ్లవుతోంది. గతంలో జగన్‌ డీఎస్సీ ప్రకటన ఇస్తామని చెప్పడంతో అప్పు చేసి శిక్షణ కేంద్రంలో సిద్ధమవుతున్నా. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం చేయడంతో నిరీక్షణ ఫలించింది. నాతోటి వారు చెప్పలేనంత సంతోషంతో ఉన్నారు. ఉద్యోగం వస్తే మా జీవితాల్లో మార్పులు వస్తాయని ఎదురుచూస్తున్నాం. బాబు వస్తే జాబు వస్తుందనే నమ్మకంతో ముందుకు అడుగులు వేస్తున్నాం.

- కొర్ను తేజ, డీఎస్సీ అభ్యర్థి, నిమ్మాడ, కోటబొమ్మాళి మండలం

కొండంత అండ..

ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పింఛను రూ.వెయ్యి పెంచడం మాలాంటి వృద్ధులకు కొండంత అండ. కుటుంబంపై ఆధారపడకుండా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ధరలు పెరగడంతో ఖర్చులూ పెరిగాయి. దీనికి అనుగుణంగా పింఛను లబ్ధి పెంచడం సంతోషంగా ఉంది. 

- వి.పెంటమ్మ, నాగంపాలెం, లావేరు మండలం 

జీవితాంతం రుణపడి ఉంటాం..

ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు రూ.6 వేలు పింఛను ఇవ్వడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. మాలాంటి వారి బాధలు అర్థం చేసుకుని ఎవరిపై ఆధారపడే అవసరం లేకుండా మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. 

- ఎ.కల్పన, డోకులపాడు, వజ్రపుకొత్తూరు 

మండలం మా భూమి భద్రం..

భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేస్తూ దస్త్రంపై చంద్రబాబు సంతకం చేయడం శుభ పరిణామం. వైకాపా ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టంతో రైతులందరం చాలా భయపడ్డాం. కొందరి వద్ద భూమికి సంబంధించి అన్ని ఆధారాలు ఉండకపోవచ్చు ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే నష్టపోతారు. వివాదం తలెత్తితే కోర్టులోనూ పరిష్కరించుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలాంటి వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయడం భూమి కలిగిన మాలాంటి రైతుల్లో చాలా ఆనందంగా ఉంది. 

-మంత్రి సూర్యనారాయణ, రైతు లింగాలవలస 

ప్రజల ఆస్తులకు తప్పిన ప్రమాదం..

భూ యాజమాన్య హక్కు చట్టంతో ప్రజల స్థిరాస్తిపై చట్టబద్ధ హక్కుల నిర్ణయం అధికారులదే. అధికారుల ముసుగులో ప్రభుత్వ పెద్దలు పెత్తనం చేసే అవకాశం ఉండటం ప్రధానమైన లోపం. నీతి ఆయోగ్‌ ప్రకటించిన కీలక ఆంశాలను కాదని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. భూ యాజమాన్య హక్కులను తేల్చే అధికారాన్ని సివిల్‌ కోర్టు పరిధి నుంచి తప్పించి అధికారులకు అప్పగించడం ప్రమాదకరం. ఇలాంటి చట్టాన్ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం.

బగాది రామ్మోహన్‌రావు, సీనియర్‌ న్యాయవాది 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని