logo

పోగొట్టాలి ముంపు భయం...!

Updated : 18 Jun 2024 05:51 IST

కలగా మిగిలిన కరకట్టల నిర్మాణం
కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నదాతల ఆశాభావం

కోతకు గురి కాకుండా గతంలో నిర్మించిన రాతిగట్టు    

వర్షాకాలం వచ్చిందంటే వంశధార తీర ప్రాంత గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.‘కరకట్టలు పటిష్ఠ పరుస్తాం..వరద ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపుతాం’ అని వైకాపా పెద్దలు ప్రగల్భాలు పలికినా కనీస చర్యలు తీసుకోలేదు. ఏటా వానలు పడే సమయంలో ఆందోళన తప్పడం లేదు. వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కరకట్టల పటిష్ఠతపై దృష్టిపెట్టి ముంపు బారి నుంచి కాపాడాలని నదీతీర గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. 
- న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం, నరసన్నపేట, జలుమూరు 


నష్టాలు.. కష్టాలు.. 

ఏటా వరదధాటికి గట్లు కోసుకుపోయి పొలాలు, గ్రామాలు నదీలో కలిసిపోతున్నాయి. 2010లో నరసన్నపేట-జలుమూరు మండలాలను కలిపే పర్లాం రహదారి సగం వరకు కోతకు గురైంది. అప్పట్లో అధికారులు పెద్ద బండరాళ్లు వేయించకుంటే రహదారి నదీ గర్భంలో కలసిపోయి నరసన్నపేట, జలుమూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయేవి. వంశధార నదికి ఎడమ, కుడి వైపున వరద ప్రభావిత ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణ పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. 2007లో రూ.177 కోట్లతో చేసిన అంచనా విలువను వైకాపా ప్రభుత్వం రూ.865 కోట్లకు పెంచింది తప్ప పనులు ముందుకు తీసుకెళ్లలేదు. 1, 2, 3 ప్యాకేజీల పనులకు అనుమతి ఇవ్వాలంటూ నీటిపారుదల శాఖ పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా పచ్చజెండా ఊపలేదు. మూడో ప్యాకేజీకి సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని సంబంధిత గుత్తేదారును నీటిపారుదల శాఖ తొలగించింది. ప్రభుత్వ నిర్వాకంతో నాలుగు ప్యాకేజీలు చతికిలపడ్డాయి.

నరసన్నపేట మండలంలో నదీ గర్భంలో కలిసిపోయిన రేవు

 • జలుమూరు మండలం కరకవలస నుంచి నరసన్నపేట మండలం మీదుగా పోలాకి మండలం పల్లిపేట వరకు 49.6 కిలోమీటర్ల మేర వంశధార నది కరకట్టల నిర్మాణానికి 2009లో అప్పటి ప్రభుత్వం రూ.56 కోట్లు మంజూరు చేసింది. జలుమూరు మండలంలో కొంతవరకు కాంక్రీట్‌ గోడలు, మట్టి గట్లు, నరసన్నపేట మండలం కొబగాం వద్ద వంద మీటర్లు, పోలాకి మండలంలో కొంతమేర కాంక్రీట్‌ గోడలు నిర్మించారు. అంబాజీపేట వద్ద వంద మీటర్లు, మడపాం-బుచ్చిపేట గ్రామాల మధ్య 500 మీటర్ల మేర కాంక్రీట్‌ గోడలు, 15 కిలోమీటర్ల వరకు మట్టితో కరకట్టలు పటిష్ఠం చేయాలి. 
 •  జలుమూరు మండలం అచ్యుతాపురం, నగరికటకం, యాతపేట కరకవలస తదితర గ్రామాల వద్ద 650 మీటర్ల మేర కాంక్రీట్‌ గోడ నిర్మించారు. కరకవలస నుంచి అచ్యుతాపురం, కొమనాపల్లి, నగరికటకం, మాకివలస గ్రామాల వద్ద సుమారు 6 కిలోమీటర్ల మేర మట్టితో కరకట్టలు నిర్మించారు. అచ్యుతాపురం-కొమనాపల్లి గ్రామాల మధ్య కరకట్టలు భారీ వర్షాలు, వరదలకు కరిగిపోతున్నాయి. ఇక్కడ 200 మీటర్ల మేర కాంక్రీట్‌ గోడలు, మూడు కిలోమీటర్ల వరకు మట్టితో కరకట్టలు నిర్మించాలి.

 • పోలాకి మండలం డోల, గోవిందపురం, పల్లిపేట, వనితమండలం గ్రామాల వద్ద కొంతమేర కాంక్రీట్‌ గోడలు నిర్మించారు. మట్టితో కరకట్టలు నిర్మించాలి. సిమెంట్‌ పనులు చేయాల్సి ఉంది. 

పంటలు నష్టపోతున్నాం..

వంశధారకు ఏటా వరద వస్తుండటంతో పొలాల్లోకి నీరు ప్రవహించి పంటలు నష్టపోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో వరద వచ్చినప్పుడు నాయకులు వచ్చి హడావుడి చేశారు. అక్కడక్కడ నదిలో నాలుగు రాళ్లు వేసి గ్రోయిన్లు అంటూ చేతులు దులుపుకొన్నారు. మా చిన్నప్పుడు నది గ్రామానికి చాలా దూరంలో ఉండేది. ఇప్పుడు గ్రామంలోకి వచ్చేసింది. వర్షాకాలం వచ్చిందంటే భయం భయంగా గడపాల్సిన పరిస్థితి. గతంలో కొన్ని కుటుంబాలు నదికి ఆనుకుని వీధుల్లో జీవనం సాగించేవి. ఇప్పుడు ఆ వీధులు నదీ గర్భంలో కలిసిపోయాయి. ఆయా కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో వంశధార నది గట్టు వెంట సిమెంటు రహదారి నిర్మించడంతో కొంత మేలు జరిగింది. 
- ముద్దాడ శ్యామలరావు, రైతు, గెడ్డవానిపేట 

పనుల తీరిది... 

 • నదికి కుడి వైపున ప్యాకేజీ-1 ద్వారా భామిని మండలం బత్తిలి నుంచి కేసరి గ్రామం వరకు కొత్తూరు మండలం శిరుసువాడ నుంచి ఆకులతంపర వరకు, నదికి ఎడమ వైపున కడుమ నుంచి హంస వరకు కరకట్టల నిర్మాణానికి రూ.316 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. 7.55 శాతం మాత్రమే పనులు జరిగాయి. 
 • ప్యాకేజీ-2లో హిరమండలం మండలం రుగడ నుంచి కరకవవలస వరకు నదికి ఎడమ వైపున, గులుమూరు నుంచి స్కాట్‌పేట వరకు కుడివైపు కరకట్టల నిర్మాణానికి రూ.193.6 కోట్లతో పనులు ప్రారంభించినా 6.7 శాతమే జరిగాయి. 
 • ప్యాకేజీ-3లో స్కాట్‌పేట నుంచి చవ్వాకులపేట వరకు శ్రీకాకుళం మండలం నవనంబాడు నుంచి కళింగపట్నం వరకు కరకట్టల నిర్మాణానికి రూ.298 కోట్లు మంజూరయ్యాయి. 2.4 శాతం మాత్రమే పనులు జరిగాయి. గుత్తేదారు అక్రమాల కారణంగా తొలగించారు. 
 • ప్యాకేజీ-4లో జలుమూరు మండలం కరకవలస నుంచి పోలాకి మండలం పల్లిపేట వరకు రూ.58.35 కోట్లతో పనులు మంజూరయ్యాయి. 21.32 శాతం పనులు జరిగినా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. నాలుగు ప్యాకేజీలపై ప్రభుత్వం కక్ష గట్టి పక్కన పెట్టింది 

  వేగవంతం చేస్తాం..

  కరకట్టల నిర్మాణ పనులను గుత్తేదారు సగంలో వదిలేశారు. ఫేజ్‌-4 పనులు నిలిపివేయాలని గత ప్రభుత్వం మూడేళ్ల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. కరకట్టల నిర్మాణానికి 85 శాతం భూసేకరణ జరిగింది. ఇందులో కొంత శాతం మాత్రమే పనులు చేయగలిగాం. వంశధార నదీ తీరం వెంట ఉన్న గెడ్డవానిపేట, ఇతర గ్రామాల వద్ద కరకట్టలను పటిష్ఠ పరచడానికి రూ.18 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం.
  - ఎస్‌.జనార్దన, హరీష్, డీఈఈ, ఏఈ (కరకట్టలు)  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని