logo

బాబాయ్‌, అబ్బాయ్‌లకు సిక్కోలు నీరాజనం

Published : 18 Jun 2024 04:13 IST

అమాత్యులకు అపూర్వ స్వాగతం

అడుగడుగునా వెల్లివిరిసిన అభిమానం

గజమాలతో స్వాగతం 

చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి జిల్లాకు తొలిసారి వచ్చిన  కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఆయన బాబాయి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడులకు సిక్కోలు వాసులు అడుగడుగునా నీరాజనం పలికారు. విశాఖవిమానాశ్రయం నుంచి స్వగ్రామం నిమ్మాడ వరకు పూలవర్షం కురిపించారు. అభిమానులు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ర్యాలీ సాగింది.

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే గుజరాతీపేట (శ్రీకాకుళం)


జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా. సిక్కోలు వాసుల ఆశీర్వాదంతో చిన్న వయసులోనే కేంద్ర మంత్రినయ్యా. ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటా. పరిశ్రమల్ని తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు చూపుతాం. రైల్వే వ్యవస్థ అభివృద్ధికి చొరవ చూపుతా. సాగునీటి ప్రాజెక్టుల పరిష్కారానికి కృషి చేస్తా. 
- కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి


సాగునీటి వ్యవస్థను గాడిలో పెడతా..

అన్ని శాఖల మంత్రుల సహకారంతో జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. సాగునీటి పారుదల వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం. మత్స్యకారులు వలస వెళ్లకుండా జెట్టీలు నిర్మిస్తాం. చంద్రబాబు సహకారంతో ఇచ్ఛాపురం నుంచి విశాఖ వరకు కోస్టల్‌ కారిడార్‌ కింద నాలుగు వరుసల రహదారి నిర్మిస్తాం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ సభాపతి తమ్మినేని సీతారాం శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం.. కోడి రామ్మూర్తి స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. రామ్మోహన్‌నాయుడి ద్వారా కేంద్రం నుంచి జిల్లాకు ఎక్కువగా నిధులు రప్పిస్తాం. ఒకే కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు ఇవ్వడం సాధారణ విషయం కాదు. పెద్దల నమ్మకాన్ని కచ్చితంగా కాపాడుకుంటాం.  
- అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి 


ఆత్మీయ సత్కారం.. 

జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మైదానంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆధ్వర్యంలో మంత్రులను  ఘనంగా సత్కరించారు. విజయనగరం ఎంపీ  కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకటరమణ, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి (నరసన్నపేట), ఎన్‌.ఈశ్వరరావు (ఎచ్చెర్ల), జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, భాజపా నేతలు   పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని