logo

పూల వర్షం.. ఆత్మీయ స్వాగతం

పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సిక్కోలు వాసులు ఘన స్వాగతం పలికారు.

Published : 18 Jun 2024 04:23 IST

నిమ్మాడకు చేరుకున్న నేతలు

పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సిక్కోలు వాసులు ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం ముఖద్వారం నుంచి కోటబొమ్మాళి మండలం నిమ్మాడ వరకు అడుగడుగునా తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఉత్సాహంగా ర్యాలీ వెంట సాగారు.

శ్రీకాకుళం ఎన్టీఆర్‌ మైదానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్, నాయకులు

శ్రీకాకుళం నగరం ఎన్టీఆర్‌ మైదానంలో నిర్వహించిన సభలో ‘రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ కలిసి త్రిమూర్తుల్లా శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అన్నపుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తొలుత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు, వేదిక పైకి రాగానే కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ప్రార్థన చేసి దీవించారు.

పౌర విమాయాన శాఖ మంత్రి, పూర్వ విద్యార్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సోమవారం రాత్రి గురజాడ విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి సత్కరించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ను అభినందించారు. గురజాడ విద్యాసంస్థల సంచాలకులు సంయుక్త, కరస్పాండెంట్‌ ఎ.రంగారావు, విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.  
- న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, గుజరాతీపేట(శ్రీకాకుళం)
 

రామ్మోహన్‌నాయుడు అనే నేను..

రామ్మోహన్‌నాయుడు అనే నేను అంటూ రామ్మోహన్‌నాయుడు ప్రమాణస్వీకారం చేసినప్పుడు సభకు హాజరైన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు చప్పట్లతో ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ప్రమాణం చేస్తున్నప్పుడు పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలు కనిపించారని.. ఈ కారణంగా మీ సమక్షంలో ప్రమాణం చేస్తున్నానని ఆయన తెలిపారు.
- న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)  
విశాఖ విమానాశ్రయంలో రామ్మోహన్‌నాయుడికి శ్రీకాకుళానికి చెందిన కళింగాంధ్ర విమాన ప్రయాణికుల సంఘ ప్రతినిధి నటుకుల మోహన్‌ తదితరులు స్వాగతం పలికి చొక్కాకు విమాన నమూనా తొడిగారు.    
-న్యూస్‌టుడే,  విశాఖపట్నం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు