logo

చితకబాది.. చిత్రహింస పెట్టి..

శ్రీకాకుళం నగరంలో అమానుష ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై కొందరు మహిళలు దాడికి పాల్పడ్డారు. చితకబాది.. ఒంటిపై కారం జల్లి చిత్రహింసకు గురి చేశారు.

Published : 20 Jun 2024 03:26 IST

మహిళపై దాడి
ఆరుగురిపై కేసు నమోదు

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలో అమానుష ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై కొందరు మహిళలు దాడికి పాల్పడ్డారు. చితకబాది.. ఒంటిపై కారం జల్లి చిత్రహింసకు గురి చేశారు. వీధంతా తిప్పుతూ నానా ఇబ్బంది పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ మహిళ.. కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది. కొన్ని నెలల నుంచి ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామం నవభారత్‌ కూడలి సమీపంలో ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో నివసిస్తోంది. స్థానికంగా చేపలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం శ్రీకాకుళం నగరం దమ్మలవీధికి చెందిన అల్లిబల్లి రాధ, కోడ భవాని, లక్ష్మి, కుందు జయలతో పాటు మరో ఇద్దరు ఆటోలో ఆమె ఇంటికి వచ్చారు. వ్యక్తిగత తగాదాలతో దాడి చేశారు. అనంతరం ఆటోలో ఎక్కించుకెళ్లి దమ్మలవీధి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను విచక్షణారహితంగా కొట్టారు. ఒంటిపై ఉన్న నైటీ సైతం చించేసి.. కారం జల్లి వీధిలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. స్థానికులు కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఊరుకోకుండా రాక్షసంగా వ్యవహరించారు. దీంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. రాత్రికి తేరుకున్న తరువాత ఆమె తనను చిత్రహింసకు గురిచేసిన మహిళల గురించి అవుట్‌ పోస్టు పోలీసులకు వివరాలు తెలియజేశారు. ఆ మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసుల సహకారంతో ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎస్‌.చిరంజీవి బుధవారం తెలిపారు. దాడికి పాల్పడిన ఆరుగురు మహిళలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో రాధ ఆచూకీ లభించకపోవడంతో మిగిలినవారిని బుధవారం రాత్రి ఎచ్చెర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని