logo

కళ్లు మూసుకుంటాం.. కానిచ్చేయండి..!

నాగావళి నదిలో ఇసుకను అక్రమార్కులు పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారం నాటుబండ్లపై తరలించుకుపోతున్నారు. నది గర్భంలో ఉన్న మట్టి సైతం బయటపడేలా.. పెద్ద గోతులు ఏర్పడేలా తవ్వకాలు చేపడుతున్నారు.

Published : 20 Jun 2024 03:33 IST

నాటుబండ్లపై ఇసుక అక్రమ రవాణా
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం
న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

నాగావళి నదిలో ఇసుకను అక్రమార్కులు పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారం నాటుబండ్లపై తరలించుకుపోతున్నారు. నది గర్భంలో ఉన్న మట్టి సైతం బయటపడేలా.. పెద్ద గోతులు ఏర్పడేలా తవ్వకాలు చేపడుతున్నారు. వీరి నిర్వాకంతో ఏటా నదిలో స్నానాలకు వెళ్లి ఊబిలో చిక్కుకుని పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ఎవరికీ పట్టడం లేదు. శ్రీకాకుళం నగరంలోని బలగ నుంచి కలెక్టరేట్‌ వరకు సుమారు 3 కి.మీ. మేర నిత్యం దందా కొనసాగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడట్లేదు.  

గరంలోని ఆదివారంపేట, బలగ, శాంతినగర్‌ కాలనీ, కొత్తవంతెన, కలెక్టరేట్, పొన్నాడ వంతెన ఖాజీపేట, గుజరాతీపేట, ఫాజుల్‌బేగ్‌పేట, హయాతీనగరంలో నదికి ఇరువైపులా అనధికారిక ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేశారు. నదిలో నుంచి రోజూ వందలాది నాటుబండ్లతో ఇసుకను తరలించేస్తున్నారు. నిబంధనల ప్రకారం నదిలో ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించకూడదు. అనుమతి లేకుండా పొక్లెయిన్లతో తవ్వకూడదు. నాటుబండ్ల ద్వారా మాత్రం తరలించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారం చేస్తున్నారు. 

ఇది జగమెరిగిన సత్యం..

జిల్లా కేంద్రంలోని వందలాది ప్రైవేటు భవన నిర్మాణాలతో పాటు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సీసీ రహదారులు, కాలువలు, ఇతర నిర్మాణ పనులు నిత్యం జరుగుతుంటాయి. వాటన్నింటికీ నాటుబండ్ల ద్వారానే వేల క్యూబిక్‌ మీటర్లు ఇసుక సరఫరా జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. నగరంలో రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ఎక్కడికక్కడ పదుల సంఖ్యలో నాటుబండ్లతో ఇసుక తరలిపోతున్నా కట్టడి చేసే నాథుడే కరవయ్యాడు. హయాతీనగరం నుంచి తోటపాలెం వెళ్లే రహదారిలో, బలగ శాంతినగర్‌ కాలనీ, కలెక్టరేట్‌ వద్ద పొన్నాడ వంతెన వంటి ప్రాంతాల్లో రాత్రి వేళ నాటుబండ్లతో ఇసుకను ఒడ్డుకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

ఇష్టానుసారం.. దోపిడీ పర్వం..

  • చట్టం ప్రకారం నదీ గర్భంలో ఉన్న తాగునీటి ఊటబావులు, వంతెనలు, సర్ఫేజ్‌ డైక్‌లు, ఇతర నిర్మాణాలు ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుకను నాటుబండ్ల ద్వారా కూడా తరలించకూడదు. అందుకు విరుద్ధంగా కొత్త వంతెన, పాత వంతెన, బలగ, ఆదివారంపేట వద్ద నదిలో నగరపాలక సంస్థ రక్షిత మంచినీటి పథకాల ఊటబావుల వద్ద వాటి కాంక్రీటు పునాదులు సైతం బయటపడేలా.. వంతెనల పిల్లర్లు వద్ద గోతులు ఏర్పడేలా ఇసుకను తోడేస్తున్నారు. 
  • ఇసుకలో పచ్చగడ్డి మొలవదు. అలాంటిది చాలా చోట్ల నదిలో పచ్చగడ్డి కనిపిస్తుందంటే ఇసుకను ఏ స్థాయిలో దోచుకుపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. 
  • బలగ ప్రధాన నీటి సరఫరా కేంద్రం ఊటబావులు దెబ్బతినేలా ఇసుకను తరలించడంతో ఆ ప్రాంతంలో ప్రస్తుతం రూ.కోట్లు వెచ్చించి కొత్తగా ఊటబావులను నిర్మించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 

తప్పించుకుంటున్న అధికారులు..

నాటుబండ్లపై ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలు మాదిరిగా ఉండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. నాటుబండ్లను కొనుగోలు చేసి పశువుల సంరక్షణ, బండ్లతో ఇసుక తరలింపునకు కూలీలను ఏర్పాటు చేసుకుని అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసు, భూగర్భ గనులు, రెవెన్యూశాఖల అధికారులు ఆ బాధ్యత తమది కాదంటే తమది కాదంటూ తప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ఇసుక తవ్వకాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని