logo

ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తాం..

‘వైకాపా పాలనలో ఐదేళ్లూ వంశధార ప్రాజెక్టుకు తాళం వేశారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పలాస రైతులు వంశధార కాలువలో చుక్క నీరు చూసిన సందర్భం లేదు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 20 Jun 2024 04:14 IST

మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ

పలాస గ్రామీణం, న్యూస్‌టుడే: ‘వైకాపా పాలనలో ఐదేళ్లూ వంశధార ప్రాజెక్టుకు తాళం వేశారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పలాస రైతులు వంశధార కాలువలో చుక్క నీరు చూసిన సందర్భం లేదు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ ఉందా.. లేదా? అనే పరిస్థితికి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు తెదేపా నాయకులు చెప్పిన ప్రకారం ప్రతి ఎకరాకూ సకాలంలో సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. పలాస మండలం టెక్కలిపట్నం వద్ద వంశధార ఎడమ కాలువను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ప్రాజెక్టు ఎస్‌ఈ రాంబాబు, ఈఈ శేఖర్‌లతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘వంశధార కాలువ ఆధునికీకరణ పనులు వెంటనే చేపట్టాలి. పూడిక  తీయించాలి. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతూ సాగునీటికి ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. సకాలంలో శివారు ప్రాంతాలకూ సాగునీరిచ్చి  ఆదుకున్నాం. 

తంలో మంత్రిగా ఉన్నప్పుడు వంశధార ఎడమ కాలువ మొత్తాన్ని హిరమండలం నుంచి శివారు వరకు సిమెంట్తో లైనింగ్‌ చేయించడానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపాం. ప్రభుత్వం మారడంతో ఆ దస్త్రం ఎక్కడుందో తెలియని దుస్థితి నెలకొంది. త్వరలోనే ఆయా పనులు చేయించి సాగునీటికి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతాం. ఆఫ్‌షోర్‌ జలాశయ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలకు తాగునీరు, పలాస, నందిగాం తదితర మండలాల్లో వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. వైకాపా పాలనలో అన్ని వ్యవస్థలూ నాశనమయ్యాయి. వాటిని తిరిగి గాడిలో పెడతాం. రైతులకు మేలు చేయగలిగే వ్యవసాయ శాఖకు మంత్రిగా చంద్రబాబు నియమించి మంచి అవకాశమిచ్చారు. శక్తిని, తెలివిని ఉపయోగించి రోజుకు 18 గంటలు పని చేసి అన్నదాతలకు న్యాయం చేస్తాం. ఆరు మాసాల్లో వైకాపా ప్రభుత్వానికి, కూటమి పాలనకు తేడా స్పష్టంగా కనిపించేలా పని చేస్తాం’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెదేపా నేతలు వజ్జ బాబూరావు, పీరికట్ల విఠల్, కుత్తుం లక్ష్మణ్, దువ్వాడ సంతోష్, శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని