logo

ఆదిత్యాలయంలో అవకతవకలపై విచారణ ప్రారంభం

అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో సీనియర్‌ సూపరింటెండెంట్‌గా పని చేసిన కృష్ణమాచార్యులుపై శ్రీకాకుళం నగరానికి చెందిన    డి.సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయశాఖ అధికారులు బుధవారం విచారణ ప్రారంభించారు.

Published : 20 Jun 2024 03:40 IST

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో సీనియర్‌ సూపరింటెండెంట్‌గా పని చేసిన కృష్ణమాచార్యులుపై శ్రీకాకుళం నగరానికి చెందిన    డి.సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయశాఖ అధికారులు బుధవారం విచారణ ప్రారంభించారు. ఆ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు విచారణ అధికారి డిప్యూటీ కమిషనర్‌(విశాఖపట్నం) ఎన్‌.సుజాత ఆలయానికి వచ్చారు. రోజువారీ కూలీలకు వేతనాల మంజూరుతో పాటు పొరుగు సేవల కింద చేర్చుకుంటామని వసూళ్లకు పాల్పడ్డారని, ఆలయంలో పలు ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన అభియోగాలపై ఆరా తీశారు. కృష్ణమాచార్యులు పని చేసిన కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. రోజువారీ కూలీల నుంచి డబ్బుల వసూలు విషయమై ఈవోకు వచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులను పరిశీలించారు. బాధితులను వేర్వేరుగా పిలిచి వారి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు.                 

ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ కృష్ణమాచార్యులుపై వచ్చిన అభియోగాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా ఆయనకు డబ్బులు ఇచ్చినట్లయితే విశాఖపట్నంలోని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కోరారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత నివేదికను తమ శాఖ కమిషనర్‌కు నివేదించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని