logo

రెవెన్యూ తంత్రం.. వైకాపా నేతల కుతంత్రం..

..టెక్కలి పట్టణం కబ్జాదారుల కబంధహస్తాల్లోకి వెళ్లిపోతోంది. కనిపించిన ప్రతి స్థలాన్ని వైకాపా అండతో  ఐదేళ్లలో అక్రమార్కులు స్వాధీనపర్చుకున్నారు. గత ఆరునెలల్లో వీటి తీవ్రత మరింత వేగంగా పెరిగింది.

Updated : 20 Jun 2024 04:13 IST

అడ్డగోలుగా అక్రమాలకు దారిచూపిన అధికారులు
ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు
న్యూస్‌టుడే, టెక్కలి, టెక్కలి పట్టణం  

  • కచేరివీధిలో ఓ స్థల వివాదంలో రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. కొన్నేళ్లుగా ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యవహారంలో ఓ వ్యక్తి న్యాయస్థానంలో గెలుపొందగా, మరోవ్యక్తి పొజిషన్‌లో ఉన్నట్లు రెవెన్యూ యంత్రాంగం పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంపై అంతా ఆశ్చర్యపోయారు. ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన అధికారులు ఇటువంటి వ్యవహారాల్లో అర్ధరాత్రి ఆదేశాలు ఎందుకు ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం చేశారు. 
  • టెక్కలి సమీపంలో జగతిమెట్ట వద్ద ఏర్పాటు చేసిన కాలనీలో పట్టాల పంపిణీ వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ విమర్శలు వస్తున్నాయి. ఖాళీస్థలాల్లో వైకాపా నేతలు నిర్మాణాలు జరపడం, ఆపై రెవెన్యూ యంత్రాంగం వారికి సహకరించడంతో ఎన్నికల సమయంలో తంతు జరిగింది. అంతకుముందు సబ్‌కలెక్టర్‌ విచారణ జరపగా, వందకు పైగా అనర్హులకు పట్టాలున్నాయని గుర్తించినప్పటికీ చర్యలు లేకపోయాయి. తాజాగా ఎన్నికల కోడ్‌ సమయంలోనే ముందు తేదీతోలతో పట్టాలిచ్చారంటూ ఆరోపణలు వస్తున్నాయి. పట్టాలిచ్చినా లేకున్నా నిర్మాణాలు మాత్రం ఎన్నికల కోడ్‌ సమయంలో జరిగాయి. 
  • టెక్కలి పట్టణంలో తహసీల్దారు కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఓ గోర్జిపోరంబోకు ఇటీవల ఆక్రమణకు గురైంది. ఈ అడ్డగోలు వ్యవహారం రెవెన్యూ యంత్రాంగానికి తెలిసే జరిగిందని విమర్శలున్నాయి. చేసిన సహకారానికి తగినంత సాయం ముట్టిందన్న ఆరోపణలూ ఉన్నాయి. మరోవైపు అయ్యప్పనగర్, వెంకటేశ్వర కాలనీల్లోని గోర్జిపోరంబోకుల్లో ఆక్రమణలు మళ్లీ పెరిగిపోయాయి.

..టెక్కలి పట్టణం కబ్జాదారుల కబంధహస్తాల్లోకి వెళ్లిపోతోంది. కనిపించిన ప్రతి స్థలాన్ని వైకాపా అండతో  ఐదేళ్లలో అక్రమార్కులు స్వాధీనపర్చుకున్నారు. గత ఆరునెలల్లో వీటి తీవ్రత మరింత వేగంగా పెరిగింది. తెలిసినట్లు కొంత, తెలియనట్లు నటిస్తూ సహకరిస్తూ మరికొంత అక్రమాలన్నీ రెవెన్యూ యంత్రాంగం కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలు వినిపస్తున్నాయి. ఆక్రమణల కుతంత్రమంతా రెవెన్యూ యంత్రాంగం తంత్రాంగమేనని విమర్శలు గుప్పుమంటున్నాయి. 

జిల్లా ఆసుపత్రిని ఆనుకుని ప్రభుత్వస్థలం ఆక్రమణ జరుగుతున్నా  అధికారులు కన్నెత్తి చూడటంలేదు. ఎంతమంది ఫిర్యాదుచేసినా ఆక్రమణల తొలగింపు జరగడంలేదు. మరోవైపు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు జరిగాయని, వాటిని తొలగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ యంత్రాంగంలో చలనంలేదు. జగతిమెట్టవద్ద జాతీయ రహదారినుంచి టెక్కలి లోకి ప్రవేశించే కూడలిలో భూసేకరణ జరిగిన భూమి ఆక్రమణకు గురైంది. దీనికి సంబంధించిన దస్త్రాలే కార్యాలయంలో లేవంటూ రెవెన్యూయంత్రాంగం చెప్పడం గమనార్హం. 


తొలగింపు సాధ్యమేనా..

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఇందిరాకూడలిలో స్థానికులను ఉద్దేశిస్తూ కింజరాపు అచ్చెన్నాయుడు కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన వారంతా బేషరతుగా వాటిని విడిచిపెట్టి వెళ్లిపోవాలని, లేదంటే జైల్లో పెట్టయినా ఖాళీచేయిస్తానంటూ హెచ్చరించారు. ఇటీవల టెక్కలిలో పెద్దఎత్తున జరిగిన ఆక్రమణలను తొలగించడం, వాటికి వంతపాడిన రెవెన్యూ యంత్రాంగంపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుందో వేచిచూడాలి. 


స్థానిక సంతోషిమాత గుడి ఎదురుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కోసం స్థలం ఉంది. ఇది గత ఐదేళ్లలో ఆక్రమణలకు గురవతూవస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినరోజు వైకాపాకు చెందిన ఓ నేత రాత్రికిరాత్రే అడ్డగోలుగా గోడ నిర్మించాడు. ఇందుకు రెవెన్యూ యంత్రాంగం సహకారం అందించినట్లు కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు పనిచేసిన  ఓ అధికారి ఓ వ్యక్తికి అడ్డగోలుగా పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం విమర్శలకు దారితీసింది. ఆనాటి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఈ తంతు జరిగినట్లు విమర్శలున్నాయి.


నాకేం సంబంధం లేదు. నన్ను అడగొద్దు

- బాలమురళీకృష్ణ, తహసీల్దార్, టెక్కలి

టెక్కలిలో ఇళ్లపట్టాలకు సంబంధించి నా దగ్గర వివరాల్లేవు. నాకు సంబంధం లేదు. నన్ను అడగొద్దు. ఎన్నికల విధులపై ఇక్కడికి వచ్చాం. మరో పదిరోజుల్లో వెళ్లిపోతాం. అంతకుమించి చెప్పలేం.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని