logo

నిర్వహణ.. నీరుగార్చేశారు..!

వర్షాకాలం వచ్చేసింది.. అడపాదడపా వానలు కురుస్తూనే ఉన్నాయి.. ఇదే సమయంలో కాలానుగుణ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి.. ముఖ్యంగా కలుషిత తాగునీటి కారణంగా ప్రజలు రోగాలు బారినపడే పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 20 Jun 2024 03:52 IST

అపరిశుభ్రంగా తాగునీటి ట్యాంకులు
వానాకాలంలో కలుషిత జలాలే ప్రజలకు దిక్కు 
న్యూస్‌టుడే, పొందూరు, సరుబుజ్జిలి, బృందం

  • సరుబుజ్జిలి మండలం చిన్న వెంకటాపురంలో తాగునీటి పథకాన్ని నెలలు తరబడి శుభ్రం చేయకపోవడంతో స్థానికులు కలుషిత నీరే తాగాల్సి వస్తోంది. ట్యాంకు లోపల కనీసం పరిశుభ్రం చేయలేదు. దీనికితోడు పరిసరాల అపరిశుభ్రతతో నీరు కలుషితమవుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
  • జి.సిగడాం: ఆనందపురంలో తాగునీటి పథకాన్ని రెండేళ్లుగా శుభ్రం చేయలేదు. ట్యాంకు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. 
  • టెక్కలి: శ్యామసుందర కాలనీలో నీటి పథకం అధ్వానంగా మారింది. నాలుగు కాలనీల ప్రజలు ఇక్కడే నీటిని పట్టుకుంటారు. కొంతకాలంగా నిర్వహణ సరిగ్గా లేక నాచు చేరింది. కలుషిత నీరు తాగి రోగాలబారిన పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
  • ఇచ్ఛాపురం: ఈదుపురం నీటి పథకం, ఉద్దానం ప్రాజెక్టుకు సంబంధించి పలుచోట్ల పైపులైన్ల లీకులతో నీరు వృథాగా పోతోంది. ట్యాంకులు శుభ్రం చేయకపోవడంతో నీరు కలుషితమవుతోంది. 

వర్షాకాలం వచ్చేసింది.. అడపాదడపా వానలు కురుస్తూనే ఉన్నాయి.. ఇదే సమయంలో కాలానుగుణ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి.. ముఖ్యంగా కలుషిత తాగునీటి కారణంగా ప్రజలు రోగాలు బారినపడే పరిస్థితులు నెలకొన్నాయి.. సురక్షిత నీరందించే విషయంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఆయా పథకాల ట్యాంకులను శుభ్రపరచాలి. నీటి స్వచ్ఛతను పరీక్షించాలి. అవసరాన్ని బట్టి గొట్టాలను శుభ్రం చేయించాలి. క్రమం తప్పకుండా క్లోరినేషన్‌ చేయించాలి. కానీ ఇవేమీ గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా జరగడం లేదు. నిర్వహణ సైతం గాలికొదిలేశారు.. చాలాచోట్ల మరమ్మతులకు గురైనా పట్టించుకున్న నాథులే లేరు.   

కనిపించని నిబంధనలు..

నిబంధనల ప్రకారం రక్షిత పథకాలకు సంబంధించి ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను 15 రోజులకోసారి శుభ్రపరచాలి. అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ట్యాంకును శుభ్రం చేసిన తేదీలను నల్లబోర్డుపై రాయాలి.  ఇది కూడా అమలు కావడం లేదు. రోజూ తాగునీటిలో బ్లీచింగ్‌ కలిపి పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కనీసం నెలకు ఒక్కసారి కూడా క్లోరినేషన్‌ చేస్తున్న దాఖలాలు  కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

పరీక్షలు ఎక్కడ..? 

గ్రామాల్లో సచివాలయాల పరిధిలో ప్రతిఆరు నెలలకోసారి చెరువులు, బావులు, తాగునీటి బోర్లు నుంచి వచ్చే నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలి. దీనికి సంబంధించి సచివాలయాల ఇంజినీర్లకు రసాయనాలు కూడా అందించారు. సిబ్బంది నీటి పరీక్షలపై దృష్టి సారించకపోవడంతో పాటు రసాయనాల కాలపరిమితి దాటిపోవడంతో గ్రామాల్లో నీటి పరీక్షలు జరగని పరిస్థితి నెలకొంది. ప్రతి నియోజకవర్గంలో నీటి నమూనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్రమం తప్పకుండా నీటి పరీక్షలు చేసి ఫలితాలను సచివాలయ కార్యాలయాల వద్ద బహిరంగపరచాలి. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు.

పైపుల్లోకి మురుగు..

వర్షాలు పడుతున్న కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని కాలువల్లో ఉన్న నీటి పైపుల్లోకి మురుగు చేరుతోంది. పలుచోట్ల రంగు మారిన నీళ్లు సైతం సరఫరా అవుతున్నాయి. మరోపక్క పథకాల నిర్వహణ లేక కలుషిత నీరు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీల్లో నిర్వహణ నిధులు లేక పాలక వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. 


ఆదేశాలు ఇచ్చాంఔ

- జి.జాన్‌బెనహర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ, శ్రీకాకుళం  

గ్రామ పంచాయతీలు నీటి ట్యాంకులను శుభ్రపరచాలని ఆదేశాలిచ్చాం. సచివాలయాల్లో పని చేస్తున్న కార్యదర్శులు, ట్యాంకులను ఆపరేటింగ్‌ చేస్తున్న సిబ్బందికి సమావేశాలు నిర్వహించి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయించాలని ఎప్పటికప్పుడు సూచించాం. పరిశీలించి చర్యలు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని