logo

ప్రైవేటు సేవలో ప్రభుత్వ వైద్యులు..!

టెక్కలి జిల్లా ఆసుపత్రిలోని కొంతమంది వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల సేవల్లో తరిస్తున్నారు.

Updated : 11 Jul 2024 06:18 IST

రోగులను రిఫర్‌ చేసేందుకు ఆసక్తి 
న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

ఆసుపత్రి వద్ద 108 వాహనాలు

టెక్కలి జిల్లా ఆసుపత్రిలోని కొంతమంది వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల సేవల్లో తరిస్తున్నారు. ఇక్కడ వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రిఫర్‌ చేయాల్సి వస్తే పనిగట్టుకుని ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 108 వాహనాలపై రోగుల్ని ప్రభుత్వ ఆసుపత్రులకే రిఫర్‌ చేయాల్సి ఉండగా, ఆ నిబంధనల్ని  తుంగలో తొక్కుతున్నారు.

ప్రతి నెలా ఇదేతంతు..

జిల్లా ఆసుపత్రి నుంచి ఈనెలలో ఇప్పటివరకు టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి 108 వాహనాల ద్వారా మొత్తంగా 131 కేసులు రిఫర్‌ చేయగా, అందులో 26 కేసుల్ని వివిధ ప్రైవేటు ఆసుపత్రులకే తరలించారు. ఇవికాక మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు, నరసన్నపేట, జలుమూరు మండలాల వాహనాలను సైతం ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్‌ చేసేందుకు వినియోగిస్తున్నారు. ఇక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి కేసుల్ని పంపించాల్సి ఉండగా, రిఫరల్‌ షీట్‌పై ‘హయ్యర్‌ సెంటర్‌’ అని పేర్కొంటూ రోగుల సహాయకులకు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లాలని సూచనలు ఇస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలతో అత్యవసర వైద్యం అందించాల్సినప్పుడు మాత్రమే రోగి తరఫు వారు కోరుకునే ఏ ఆసుపత్రికైనా తీసుకెళ్లగలమని, మిగిలిన కేసుల విషయంలో సైతం తమపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారని 108 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆసుపత్రుల పీఆర్వోలదే రాజ్యం..

జిల్లాలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే పీఆర్వోలు టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో నిత్యం తిరుగుతూ రోగుల వివరాలు సేకరిస్తున్నారు. వైద్యులు, కొంతమంది సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానంగా శస్త్రచికిత్స అవసరమైన రోగుల సమాచారం సేకరిస్తున్నారు. ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపంతో వారికి అడ్డుకట్ట వేసే చర్యలు లేకుండా పోయాయి.

అరికట్టేందుకు చర్యలు.. 108 వాహనాల ద్వారా రిఫరల్‌ కేసుల్ని ప్రైవేటు ఆసుపత్రులకు కాకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకే పంపాలని వైద్యులకు స్పష్టంగా ఆదేశాలు జారీచేస్తాం. గతంలో  ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే పీఆర్వోల సంచారం ఉండేది. ఇప్పుడు పెద్దగా లేదు. వారికి అడ్డుకట్ట వేసేందుకు సైతం చర్యలు చేపడతాం.

బి.సూర్యారావు, సూపరింటెండెంట్, టెక్కలి జిల్లా ఆసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు