logo

తిరుచ్చి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ ప్రారంభం

తిరుచ్చి విమానాశ్రయంలో నిర్మించిన కొత్త ప్రయాణికుల టెర్మినల్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను రూ.1,112 కోట్ల వ్యయంతో 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు.

Published : 13 Jun 2024 01:00 IST

కొత్త టెర్మినల్‌ ముఖద్వారం 

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: తిరుచ్చి విమానాశ్రయంలో నిర్మించిన కొత్త ప్రయాణికుల టెర్మినల్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను రూ.1,112 కోట్ల వ్యయంతో 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం పనులు పూర్తయిన నేపథ్యంలో 75వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలోని కొత్త టెర్మినల్‌ ద్వారా ఏడాదికి 44.50 లక్షల మంది ప్రయాణికులు లబ్ధిపొందనున్నారు.

అధునాతన సౌకర్యాలు..

కొత్త టెర్మినల్‌లో 104 ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 10 ఏరో బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఐదు ఏరో బ్రిడ్జిలను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన ఐదు మరికొద్ది నెలల్లో ప్రారంభమవనున్నాయి. 750 కార్లు, 250 ట్యాక్సీలు, 10 బస్సులు నిలిపే సౌకర్యం ఉంది. వెళ్లేందుకు 10 మార్గాలు, వచ్చేందుకు 6 మార్గాలు, 60 చెక్‌-ఇన్‌ సెంటర్లు, 15 ఎక్స్‌రే మిషన్లు, మూడు ప్రదేశాల్లో వీఐపీ వెయిటింగ్‌ రూమ్‌లు ఉన్నాయి. 26చోట్ల లిఫ్ట్‌లు, ఎక్సలేటర్లు, ప్రయాణికులు వస్తువులను తీసుకెళ్లేందుకు ర్యాంప్‌ కన్వేయర్‌ బెల్ట్‌లను ఏర్పాటు చేశారు. కొత్త టెర్మినల్‌లో తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలకు సంబంధించి పెయింటింగ్‌లు గీశారు. శ్రీరంగం రాజగోపురం నమూనాను టెర్మినల్‌ ముందుభాగంలో ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. సౌరఫలకాలతో విమానాశ్రయం పైకప్పు ఏర్పాటుచేశారు. రూ.75 కోట్లతో 42.5మీటర్ల అబ్జర్వేషన్‌ టవర్‌తో కూడిన ఎయిర్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మించారు. రన్‌వేలో ఏదైనా భాగాన్ని 360 డిగ్రీల కోణంలో పర్యవేక్షించవచ్చు.

ఆనందంలో ప్రయాణికులు..

చెన్నై నుంచి వచ్చిన ఇండిగో విమానం తొలిసారిగా ఈ కొత్త టెర్మినల్‌లో ల్యాండ్‌ అయింది. విమానంపై నీళ్లు చిమ్మి ఆహ్వానం పలికారు. ప్రయాణికులకు రోజాపువ్వులు, స్వీట్లు ఇచ్చి స్వాగతించారు. కొత్త టెర్మినల్‌ అద్భుతంగా ఉందని పలువురు ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని