logo

రాష్ట్రంలో 6 కొత్త వైద్య కళాశాలలు

రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన జిల్లాల్లో ఆరు వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మొదటి విడతగా మయిలాడుతురై, తిరుపత్తూరు, తెన్‌కాశిలో, తర్వాత పెరంబలూరు, రాణిపేట, కాంచీపురం జిల్లాలో కళాశాలల నిర్మాణం జరగనుంది. 

Published : 13 Jun 2024 01:17 IST

కీల్పాక్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

వడపళని, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన జిల్లాల్లో ఆరు వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మొదటి విడతగా మయిలాడుతురై, తిరుపత్తూరు, తెన్‌కాశిలో, తర్వాత పెరంబలూరు, రాణిపేట, కాంచీపురం జిల్లాలో కళాశాలల నిర్మాణం జరగనుంది. 

ప్రధాన కార్యదర్శితో సమావేశం.. కళాశాలల నిర్మాణానికి 25 ఎకరాల స్థలాన్ని కలెక్టర్లతో కలిసి పరిశీలించాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనాను ఆరోగ్య విభాగ అధికారులు కోరారు. స్థలాన్వేషణ తర్వాత పరిసరాల్లో ఉన్న వనరులు, కావాల్సిన సామగ్రి, సిబ్బంది అవసరం వంటి వివరాలతో నివేదిక కూడా సమర్పించాలని కోరారు. మార్చిలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న జనాభాకు తగినట్లు సీట్లు, కళాశాలలను పరిమితం చేస్తూ మెడికల్‌ బోర్డు సూచించిన నిబంధనలను నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వాయిదా వేయాల్సిందిగా కోరింది. కేంద్ర సాయంతో ఆరు కళాశాలల నిర్మాణం జరుగుతుందని సమావేశంలో శివదాస్‌ మీనా ప్రకటించారు.

వనరులు పరిశీలించాక..

కొత్త కళాశాలల నిర్మాణానికి వనరులు కూడా పరిశీలించాలని వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ సంగుమణి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల స్థాపించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. రాష్ట్రంలో వైద్యసీట్లు పెంచుతూ, అన్ని జిల్లాల్లోనూ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి తేవాలనుకుంటున్నామని సంగుమణి చెప్పారు. అవసరాలకు వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో నూతన కళాశాలలు ఏర్పాటుపై అధికారులు మాట్లాడుతూ రాణిపేట జిల్లాలో స్థలం కుదరని పక్షంలో అరక్కోణంలో అన్వేషించాలని సూచించారు. కాంచీపురం జిల్లా కరపేట్టైలోని అరిజ్ఞర్‌ అన్నా క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రాంగణంలో వైద్య కళాశాల నిర్మించనున్నారు. కొత్తగా ఉన్న కళాశాల భవనాల్లో ఖాళీ ఉందని, నూతన స్పెషాలిటీ విభాగాలు ప్రారంభించడానికి వేచి ఉన్నామన్నారు. 

పనితీరు, వ్యయంపై నివేదిక..

జిల్లాకేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలతోపాటు కొత్తగా వచ్చిన 11 కళాశాలల్లో పనితీరు, ఖర్చుపై ఒకట్రెండు నెలల్లో నివేదిక అందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి గగన్‌దీప్‌సింగ్‌ బేడి కళాశాలలను అడిగారని ఉన్నతాధికారి అన్నారు. కొత్తగా వచ్చిన వైద్య కళాశాలలు 150 ఎంబీబీఎస్‌ సీట్లు, దశాబ్ద కాలం క్రితం నాటి కళాశాలల్లో 100 సీట్లున్నాయి. అన్నింట్లో 150 సీట్ల వరకు పెంచాలన్నదే ధ్యేయమని డాక్టర్‌ సంగుమణి అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని