logo

మత్తుపై ఉక్కుపాదం

చెన్నై, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్‌ ముఠాల వ్యాప్తి రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చగా మారుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ప్రచారం సాగింది. ప్రజలు డీఎంకేవైపే ఉండటంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.

Published : 13 Jun 2024 01:10 IST

ముఠాల్ని పట్టేందుకు నిఘా బృందాల ఏర్పాటు
ప్రక్షాళన దిశగా ప్రభుత్వ అడుగులు

చెన్నై, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్‌ ముఠాల వ్యాప్తి రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చగా మారుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ప్రచారం సాగింది. ప్రజలు డీఎంకేవైపే ఉండటంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి జరిపిన సమీక్షలో అధికార యంత్రాంగానికి పలు కీలక ఆదేశాలు జారీచేశారు.

ఈనాడు-చెన్నై: రాష్ట్రంలో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా వినియోగిస్తుండటం, పట్టుబడుతుండటం ప్రభుత్వానికి తీవ్ర ఆటంకంగా మారింది. ప్రతిపక్షాలు సైతం అధికార పార్టీపై పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఎన్డీయే, అన్నాడీఎంకే కూటములు తాజాగా ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రచారాస్త్రంగా సంధించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా తన ప్రచార సభల్లో రాష్ట్రంలో మత్తు విస్తరణ, బానిసవుతున్న విద్యార్థుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. పాఠశాలల్లో సైతం గంజాయి, ఇతర మత్తుపదార్థాలు అందుబాటులో ఉంటున్నాయని, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు. డీఎంకే హయాంలో మత్తు పదార్థాల లభ్యత బాగా పెరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయాన్ని భాజపా పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది. మరోవైపు అన్నాడీఎంకే సైతం ‘సే నో టు డ్రగ్స్, సే నో టు డీఎంకే (మత్తుపదార్థాలు వద్దు, డీఎంకే వద్దు)’ అనే నినాదాన్ని అందుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ అంశం ఈ ఎన్నికల్లో డీఎంకేకు కొంత నష్టాన్నే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఎలాగైనా మత్తు విస్తరణను అడ్డుకట్ట వేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

జిల్లాలవారీ నిఘా..

అన్ని జిల్లాల్లో డ్రగ్స్‌పై గట్టి నిఘా పెట్టాలనే ఆదేశాలు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ నుంచి యంత్రాంగానికి వెళ్లాయి. ఇందులో పోలీసులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఆరోగ్యశాఖ, మున్సిపల్, విద్యాశాఖ అధికారులు సైతం పాల్గొనేలా ప్రణాళికలు వేశారు. ఎలాగైనా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు అధికారులకు స్వేచ్ఛనిచ్చేలా చర్యలు జరుగుతున్నాయి. ఎక్కడైతే మత్తు పదార్థాల జాడ ఉందో.. ముందు వాటిని గుర్తించే ప్రణాళికలు నడుస్తున్నాయి. వాటి మూలాల్లోకి వెళ్లేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేక కార్యాచరణతో ఒక్కో జిల్లానూ మత్తురహిత ప్రాంతంగా మార్చి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. వచ్చే రెండేళ్లలో సమూల మార్పును చూపించాలని ఆరాటపడుతున్నారు.

ఆకస్మిక దాడులు..

మరోవైపు పోలీసులు, ప్రభుత్వానికి సవాలు చేసేలా మత్తు పదార్థాల విక్రయాలు రాజ్యమేలుతున్నాయి. ఆన్‌లైన్‌లో సైతం రహస్యంగా విక్రయిస్తూ యువతకు చేరేలా పలు చర్యలకు పాల్పడుతున్న దాఖలాలు బయటపడుతున్నాయి. తాజాగా చెన్నైలో దాడులు నిర్వహించారు. పలువురిని అరెస్టు చేశారు. ‘మత్తు’ విక్రయాల గుట్టు విప్పేందుకు రాష్ట్ర పోలీసుశాఖ ప్రత్యేక బృందాల్ని ఏర్పాటుచేసింది. వారు జిల్లాల్లో రహస్య ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఇకనుంచి ఆకస్మిక దాడులు చేయడంతో పాటు ముఠాల్ని అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే తాము మత్తుపదార్థాల్ని రాష్ట్రంలో బాగా నియంత్రించామని ప్రభుత్వం పేర్కొంటోంది. మరింతగా నిఘాపెట్టి నియంత్రించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారు గుర్తించారు.

చూస్తూ ఊరుకోను

తమిళనాడులో బడిపిల్లల్ని డ్రగ్స్‌కు బానిసలు చేస్తున్నారు. ఈ సంస్కృతి ఇంతగా పెరిగేందుకు డీఎంకేనే కారణం. ఒక్క ‘మత్తు’ పదార్థాల వ్యాపారమే రూ.కోట్లలో ఉంది. ఇవన్నీ చూస్తూ నేను ఊరుకోను. అవినీతిపైనే కాదు, డ్రగ్స్‌ మాఫియా మీదా పోరాటం చేస్తాం. మా ప్రభుత్వం రాష్ట్రంలో కఠిన చర్యలు తీసుకుంటుంది. తమిళనాడును మత్తురహిత రాష్ట్రంగా మారుస్తాం.

- రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ 

కట్టడి చేస్తాం

మత్తు పదార్థాలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తెచ్చిపెడుతున్నాయి. సామాజిక సమస్యగా మారాయి. ఇప్పటికే మేం బాగా పనిచేశాం. అరికట్టడాన్ని మరింత బాధ్యతగా తీసుకుంటున్నాం. పెద్దఎత్తున యుద్ధం చేస్తాం. ప్రజల్లో అవగాహన పెంచుతాం. ఆదర్శనీయ చర్యలకు ప్రత్యేక పథకాన్ని రూపొందించే పనిలోనూ ఉన్నాం. అన్ని జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేశాం. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రజా ఉద్యమంగా ఈ సమస్యను తీసుకెళ్లాలని అనుకుంటున్నాం.

ఎం.కె.స్టాలిన్, ముఖ్యమంత్రి

బాధ్యత తీసుకోవాలి

రాష్ట్రంలో స్టాలిన్‌ ప్రభుత్వం పనిచేయడంలేదు. మత్తు పదార్థాల్ని అరికట్టలేకపోతున్నారు. చెన్నై విమానాశ్రయంలో, ఇతర ప్రాంతాల్లో పెద్దఎత్తున ఇవి పట్టుబడుతున్నాయి. వాటన్నింటికీ డీఎంకే బాధ్యత వహించాలి. రాష్ట్రాన్ని మత్తు కేంద్రంగా మారుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలి.

- ఎడప్పాడి పళనిసామి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి

చేసిందంతా రెండు పార్టీలే

గ్రామాల్లోకి సైతం మత్తు విస్తరిస్తోంది. డీఎంకే ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైంది. పైగా వారి పార్టీ సభ్యుల ప్రమేయం కూడా మత్తు వ్యాపారంలో బయటపడింది. ఈ పాపంలో అన్నాడీఎంకేకూ భాగముంది. రెండు పార్టీలూ గంజాయిని విక్రయించాయి.

- టి.టి.వి.దినకరన్, ఏఎంఎంకే అధినేత 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని