logo

ఉలికిపాటు

కువైట్‌లోని మంగాఫ్‌లో ఉన్న ఓ బహుళంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం తమిళనాడునూ ఉలికిపాటుకు గురిచేసింది. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే తమిళులు ఎవరైనా ఉన్నారో తెలుసుకోవాలంటూ ప్రవాస తమిళుల సంక్షేమం, పునరావాస కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు.

Published : 14 Jun 2024 01:49 IST

కువైట్‌ దుర్ఘటన మృతుల్లో రాష్ట్రవాసులు
ప్రాథమికంగా ఏడుగురి గుర్తింపు
తమిళ సంఘాల ద్వారా నిర్ధారణ
సహాయక చర్యల్లో యంత్రాంగం

విలేకర్లతో మాట్లాడుతున్న మంత్రి సెంజి మస్తాన్‌

చెన్నై, న్యూస్‌టుడే: కువైట్‌లోని మంగాఫ్‌లో ఉన్న ఓ బహుళంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం తమిళనాడునూ ఉలికిపాటుకు గురిచేసింది. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే తమిళులు ఎవరైనా ఉన్నారో తెలుసుకోవాలంటూ ప్రవాస తమిళుల సంక్షేమం, పునరావాస కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, కువైట్‌లోని భారత దౌత్యకార్యాలయం వంటివాటిని సంప్రదించింది. శరీరభాగాలు బాగా కాలిపోయి మృతులను గుర్తించడంలో కొనసాగుతున్న సందిగ్ధత దృష్ట్యా వారి నుంచి అధికారిక సమాచారం అందలేదు. దీంతో కువైట్‌లోని తమిళ సంఘాలతో సంప్రదింపులు చేపట్టింది. దుర్ఘటనలోని మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందినవారిని గుర్తించడానికి సహకారం అందించాలని కోరింది. ప్రమాద సమయంలో భవనంలో 15 మంది తమిళులు ఉన్నట్లు తెలిసింది. అందులో 25 మంది ఉండేవారని ఘటన జరిగిన రోజు 10 మంది విధులకు వెళ్లినట్లు సమాచారం. ముఖ్యమంత్రి.. క్యాంపు కార్యాలయంలో ప్రవాస తమిళుల సంక్షేమశాఖ మంత్రి సెంజిమస్తాన్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందినవారి గురించి, చేపట్టిన సహాయక చర్యలు అడిగి తెలుసుకున్నారు.

ప్రముఖుల సంతాపం..: దుర్ఘటనపై పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో సంతాపం ప్రకటించారు. అగ్నిప్రమాదంలో ప్రాణాలు బలికావడం అత్యంత బాధాకరమని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదనను కలిగించిందని మక్కళ్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్‌ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధిత భారతీయులకు తగిన సహాయాలు అందించడానికి, మృతదేహాలను మాతృదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రముఖ సినీ గేయ రచయిత, కవి వైరముత్తు తన ఎక్స్‌ పేజీలో... ‘కువైట్‌ అగ్ని ప్రమాదంలో మానవ కండలు కాలిన వాసన ప్రపంచ గాలిలో వీస్తోంది. మరణించిన తర్వాతే దహనం చేస్తారు. దహనం చేసి మరణాన్ని ఇచ్చింది నిప్పు. ప్రపంచం పుట్టినది మొదలుకొని విపత్తులు కొత్తేమీ కాదు. అవి కొనసాగడం భద్రత లోపాలను చూపిస్తున్నాయి. మానవ తప్పిదాలను సరిదిద్దుకోలేదని, పశ్చాత్తాపపడమని చెబుతున్నాయి’ అంటూ పోస్టు చేశారు. నటుడు, తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్‌ కూడా కువైట్‌ దుర్ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తూ..

మారియప్పన్

ప్యారిస్‌: అగ్నిప్రమాదంలో కోవిల్పట్టికి చెందిన వ్యక్తి మృతిచెందాడు. తూత్తుక్కుడి జిల్లా కోవిల్పట్టి సమీపం వానరముట్టి గ్రామానికి చెందిన మారియప్పన్‌ (41) 20 ఏళ్లుగా కువైట్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో పని చేస్తున్నాడు. ఆయన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈయనకు భార్య కర్బగవళ్లి, కుమార్తె విమల (11), కుమారుడు కదిర్‌ (7) ఉన్నారు. భర్త మరణ వార్త విని స్పృహకోల్పోయిన భార్య కర్బగవళ్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
- రామనాథపురం జిల్లా తెన్నవనూర్‌ గ్రామానికి చెందిన కరుప్పనన్‌ రాము కొన్నేళ్లుగా కువైట్‌లో ఉంటూ ఓ సూపర్‌ మార్కెట్‌లో పని చేస్తున్నాడు. అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సజీవదహనమయ్యాడు. మృతుడికి భార్య గురువమ్మాళ్, కుమారుడు శరవణకుమార్‌ ఉన్నారు. వీసా గడువు మరో వారంలో ముగిసి ఇంటికి వస్తాడనుకునే లోపు ఈ దుర్ఘటన జరగడం కుటుంబీకులను కలచివేసింది.

కరుప్పనన్‌ రాము (పాతచిత్రాలు)

సొంతూళ్లకు తరలించడానికి ఏర్పాట్లు..

చెన్నైలో మంత్రి సెంజి మస్తాన్‌ విలేకర్లతో మాట్లాడారు. కువైట్‌ అగ్నిప్రమాదంలోని మృతుల్లో తమిళుల గురించి దౌత్యకార్యాలయం తరఫున ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదన్నారు. అక్కడి తమిళ సంఘాలను సంప్రదించగా ఏడుగురు మరణించినట్లు తెలిసిందని పేర్కొన్నారు. మృతులను కడలూరు, తూత్తుక్కుడి, విళుపురం, తంజావూర్, రామనాథపురం జిల్లాలకు చెందినవారిగా గుర్తించారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మృతదేహాలను సొంతూళ్లకు తరలించడానికి, క్షతగాత్రులకు అవసరమైన వైద్యసహాయాలు అందించడానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాల కోసం ప్రవాస తమిళుల సంక్షేమశాఖను సంప్రదించాలన్నారు. ఈ మేరకు భారతదేశం లోపల: +91 1800 309 3793, విదేశంలో: +91 80 6900 9900, +91 80 6900 9901 నంబర్లను విడుదల చేసింది.

చిన్నదురై (పాతచిత్రం)

వేళచ్చేరి: కడలూర్‌జిల్లా కాట్టుమన్నార్‌ కోవిల్‌కు సమీప ముట్టం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి కుమారుడు చిన్నదురై(45) పదేళ్లుగా కువైట్‌లో పని చేస్తున్నాడు. సత్యతో ఐదేళ్ల కిందట వివాహమైంది. 6 నెలల కిందట సెలవుపై వచ్చిన ఆయన అనంతరం కువైట్‌ వెళ్లాడు. రెండు వారాల్లో సొంతూరికి వస్తానన్నాడని, ఇంతలోనే విషాదం చోటుచేసుకుందని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని