logo

విక్రవాండి ఉప ఎన్నికనేటి నుంచి నామినేషన్ల దాఖలు

విళుపురం జిల్లా విక్రవాండి నియోజకవర్గం ఉప ఎన్నిక జులై 10న జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమై 21న ముగియనుంది. 24న పరిశీలన, 26న ఉపసంహరణ ఉంటాయి.

Published : 14 Jun 2024 01:48 IST

ఎన్నికల కంట్రోల్‌రూమ్‌ను పరిశీలిస్తున్న కలెక్టరు పళణి

వేళచ్చేరి, న్యూస్‌టుడే: విళుపురం జిల్లా విక్రవాండి నియోజకవర్గం ఉప ఎన్నిక జులై 10న జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమై 21న ముగియనుంది. 24న పరిశీలన, 26న ఉపసంహరణ ఉంటాయి. నియోజకవర్గ ఎన్నికల అధికారిగా జిల్లా పౌర సరఫరాలు, భద్రతాశాఖ అధికారి చంద్రశేఖర్‌ను నియమించారు. అభ్యర్థులు విక్రవాండి తాలూకా కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి వద్ద నామినేషన్లు దాఖలు చేయొచ్చని కలెక్టరు పళణి తెలిపారు. ఎన్నికల్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఆయన పరిశీలించారు. తాలూకా కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు అమర్చారు.

వర్కింగ్‌ కమిటీ ప్రకటించిన డీఎంకే

చెన్నై, న్యూస్‌టుడే: విక్రవాండి శాసనసభ నియోజవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వర్కింగ్‌ కమిటీని డీఎంకే అధిష్ఠానం ప్రకటించింది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, మంత్రి పొన్ముడి, పార్టీ ప్రచార కార్యదర్శి ఎంపీ జగద్రక్షకన్, పార్టీ ముఖ్యకార్యదర్శి, మంత్రి కేఎన్‌ నెహ్రూ, మంత్రులు వేలు, ఎమ్మార్కే పన్నీర్‌సెల్వం, చక్రపాణి, అన్బరసన్, శివశంకర్, గణేశన్, అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి, ఎమ్మెల్యే లక్ష్మణన్‌తో ఈ కమిటీ ఏర్పాటైంది. విక్రవాండిలో శుక్రవారం సాయంత్రం జరిగే నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కమిటీ సభ్యులు, కూటమి పార్టీ నేతలు పాల్గొననున్నారని ప్రకటనలో డీఎంకే అధిష్ఠానం వెల్లడించింది.

అన్నాడీఎంకే అభ్యర్థి ఎంపికలో ప్రతిష్టంభన

సైదాపేట, న్యూస్‌టుడే: విక్రవాండి ఉపఎన్నికకు అన్నాడీఎంకే అభ్యర్థిని ఎంపిక చేయడంలో ప్రతిష్టంభన నెలకొంది. మొదటిగా అధికార డీఎంకే అన్నియూరు శివను అభ్యర్థిగా ప్రకటించింది. శివకు పోటీగా అన్నాడీఎంకే, పీఎంకేలు అభ్యర్థులను రంగంలోకి దించనున్నాయి. నామ్‌ తమిళర్‌ కట్చి కూడా పోటీ చేయనుంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఎంపిక పనుల్లో తలమునకలైంది. ఇందుకు సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి సీనియర్‌ నేతలతో ఆలోచనలు జరుపుతున్నారు. 2019లో విక్రవాండి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తుమిళ్‌సెల్వన్‌ పోటీకి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. కావున ఆయనకే అవకాశం దక్కొచ్చని సమాచారం.


బరిలో నిలుద్దామా?

చర్చిస్తున్న రామదాసు, అన్బుమణి 

వేళచ్చేరి, న్యూస్‌టుడే: విళుపురం జిల్లా విక్రవాండి నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే పుహళేంది మృతి చెందడంతో వచ్చేనెల 10న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. డీఎంకే అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థి ఎంపికపై అన్నాడీఎంకే కసరత్తు చేస్తోంది. ఎన్టీకే ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. నియోజకవర్గంలో వన్నియర్లు ఎక్కువగా ఉన్నందున బరిలో నిలించేందుకు పీఎంకే సన్నాహాలు చేస్తోంది. ఎన్డీయే తరఫున భాజపా కూడా పోటీకి ప్రయత్నాలు చేస్తోంది. సీటు కోసం ఒకే కూటమిలోని మిత్రపక్షాల మధ్య పోటీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో విళుపురం జిల్లా దిండివనం సమీపాన తైలావరం తోటలో గురువారం ఉదయం పీఎంకే వ్యవస్థాపకుడు రామదాసు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పోటీపై నిర్వాహకులతో చర్చించారు. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాసు, గౌరవాధ్యక్షుడు జీకే మణి సహా పలువురు రాష్ట్రస్థాయి నిర్వాహకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీకి నిర్ణయిస్తే అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని