logo

భార్యాభర్తల బలవన్మరణం

ఆవడి సమీప అన్నామలైనగర్‌ పిళ్లైయార్‌ ఆలయ వీధికి చెందిన ప్రకాష్‌ (40) హమాలీ. ఇతనికి భార్య సత్య (36), కుమారుడు దీపక్, కుమార్తె హరిణి ఉన్నారు.

Published : 14 Jun 2024 01:41 IST

సత్య, ప్రకాష్‌ (పాతచిత్రం)

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: ఆవడి సమీప అన్నామలైనగర్‌ పిళ్లైయార్‌ ఆలయ వీధికి చెందిన ప్రకాష్‌ (40) హమాలీ. ఇతనికి భార్య సత్య (36), కుమారుడు దీపక్, కుమార్తె హరిణి ఉన్నారు. ప్రకాష్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి మళ్లీ గొడవ జరిగింది. మనస్తాపంతో సత్య ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన ప్రకాష్‌ కూడా మరో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆవడి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


కుమారుడు సహా వివాహిత...

వేళచ్చేరి: మైలాడుదురై జిల్లా తరంగంపాడి సమీప మంగైనల్లూర్‌కు చెందిన విగ్నేష్‌ (30) హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సంగీత (25), 9 నెలల కుమారుడు ఆరియన్‌ ఉన్నారు. విగ్నేష్‌కు మద్యం తాగే అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో బుధవారం రాత్రి విగ్నేష్‌ ఇంట్లో లేని సమయంలో సంగీత తన కుమారుడికి ఉరి వేసి తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో శబ్దాలు విన్న స్థానికులు వచ్చి చూడగా ఇద్దరు ఉరికి వేలాడుతూ కనిపించారు. వారిని కిందికి దించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


అనుమానాస్పదంగా బాలుడి మృతి

విల్లివాక్కం: ధర్మపురి జిల్లా పెన్నాగరం సమీపం దాసంపట్టి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందు ముఖం ఛిద్రమైన స్థితిలో 16 ఏళ్ల బాలుడి మృతదేహం ఉన్నట్టు పెన్నాగరం పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. దర్యాప్తులో మృతుడు పెన్నాగరం సమీపంలోని తీపట్టికి చెందిన లారీ డ్రైవర్‌ పెరుమాల్, కుముద దంపతుల కుమారుడని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


బాలుడిపై మహిళ లైంగిక వేధింపులు

ప్యారిస్, న్యూస్‌టుడే: పదేళ్ల బాలుడిని లైంగిక వేధింపులకు గురి చేసిన 28 ఏళ్ల మహిళను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. తేని జిల్లా బోడియనాయకనూర్‌లోని ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ తరఫున నిర్వహిస్తున్న హోమ్‌లో మునీశ్వరి(28) పని చేస్తోంది. ఆమెకు వివాహమై భర్తతో విడిపోయింది. హోమ్‌లో ఆండిపట్టికి చెందిన ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిని ఆమె లైంగిక వేధింపులకు గురిచేసింది. బాలుడి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో విషయం తెలుసుకున్న హోమ్‌ యాజమాన్యం చైల్డ్‌లైన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్‌ అధికారులు బాలుడి వద్ద దర్యాప్తు చేయగా మునీశ్వరి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని మునీశ్వరిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.


లంచం తీసుకున్న అధికారి అరెస్టు

విజయకుమార్‌

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్ళూరు సమీప నేమంకు చెందిన సునీల్‌కుమార్‌ కైవండూరులో 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్‌ను కొనుగోలు చేశాడు. దీనికి ఎన్‌వోసీ కోసం పూండి బీడీవో కార్యాయంలోని అధికారి విజయకుమార్‌ను సంప్రదించాడు. ఆయన రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో సునీల్‌కుమార్‌ తిరువళ్ళూరులోని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకు గురువారం రసాయన పౌడర్‌ పూసిన నోట్లను అధికారికి అందజేస్తుండగా అనిశా అధికారులు అరెస్టు చేశారు.


చెరువులోకి దూసుకెళ్లిన కారు

ముగ్గురికి తప్పిన ప్రాణాపాయం

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: దిండిగల్లు జిల్లా కొడైక్కానల్‌కు పళంబుదూర్‌ గ్రామానికి చెందిన జయప్రకాశ్‌ గురువారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో చేరుకున్నాడు. అక్కడ పలు ప్రాంతాలను సందర్శించిన అనంతరం నక్షత్ర చెరువు గ్రీన్‌ ఏకర్‌ అనే వసతిగృహ ప్రాంతంలో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి నక్షత్ర చెరువులోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఇద్దరికి ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. జయప్రకాశ్‌కు ఈత రాకపోవడంతో కారులోనే ఉండిపోయాడు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తాడు సాయంతో అతన్ని రక్షించారు.

తాడు సాయంతో జయప్రకాశ్‌ని రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది


తితిదేలో మోసాలపై దర్యాప్తు జరిపించాలి

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

చెన్నై, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగిన మోసాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్యాప్తు జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. ఆయన తన ప్రకటనలో... మోసాలకు నెలవుగా తితిదే మారిందని, ఈ అన్యాయాలను నిలదీసే హక్కు భక్తులకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు సహ చట్టం పరిధిలో ఉండగా తితిదే మాత్రం దానికి మినహాయింపుగా ఉందని విమర్శించారు. తితిదేలో కొన్నేళ్లుగా భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. ఆర్జిత సేవా టికెట్లు బ్లాక్‌ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తున్నాయని, చెన్నై, ముంబయి, బెంగళూరు నగరాలకు చెందిన కొందరు దళారులు ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో పాలకమండలికి ఈ-కోటా విధానంలో జరిగిన మోసాలపై, కొండపై జరిగిన ఇంజినీరింగ్‌ విభాగం మోసాలపై చంద్రబాబు నాయుడు దర్యాప్తు జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తితిదే ఎన్నో కుంభకోణాలు, మోసాలకు, నిలువు దోపిడీలకు అడ్డాగా మారిందని, తిరుమలలో మద్యం, సిగరెట్లు, గంజాయి వంటి మత్తుపదార్థాలు దొరుకుతున్నాయని తెలిపారు.


మహిళలపై ఆలయ పూజారి లైంగిక వేధింపులు

బెయిల్‌ తిరస్కరించిన కోర్టు

ప్యారిస్, న్యూస్‌టుడే: ఆలయ పూజారి 25 మందికి పైగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, బెయిల్‌ ఇవ్వకూడదని పోలీసులు తెలిపారు. పూజారి కార్తిక్‌ మునుస్వామి తనను వివాహం చేసుకుంటాడని తెలిపి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు సాలిగ్రామానికి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేయడంతో విరుగంబాక్కం ఆల్‌ ఉమెన్‌ పోలీసులు మే 28న పూజారిని అరెస్టు చేశారు. బెయిల్‌ మంజూరు చేయాలని చెన్నై ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో  పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు వచ్చింది. పూజారి ఇంటికి వెళ్లిన ముఖ్య ప్రముఖుడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని సదరు యువతిని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను వేధించి అబార్షన్‌ చేయించినట్లు, అతని సెల్‌ఫోన్‌లో 25 మందికి పైగా మహిళలతో అసభ్యకర ఫొటోలు ఉన్నట్లు చెప్పారు. బెయిల్‌ ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్నారు. న్యాయమూర్తి జారీచేసిన ఉత్తర్వుల్లో.. పిటిషనర్‌ తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, అమాయకుడు కాదని, ఆలయానికి ప్రశాంతత వెతుక్కుంటూ వచ్చేవారిని తప్పుడు భావంతో చూశారన్నారు. బెయిల్‌ ఇవ్వడం కుదరదని తెలిపి పిటిషన్‌ కొట్టివేశారు.


నటుడు ప్రదీప్‌ కే విజయన్‌ అనుమానాస్పద మృతి

ప్యారిస్, న్యూస్‌టుడే: సినీ నటుడు ప్రదీప్‌ కే విజయన్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు... ‘తేగిడి, వట్టం, టెడ్డీ’ మొదలైన పలు సినిమాల్లో ప్రదీప్‌ కే విజయన్‌ (45) నటించారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన గత రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేదు. స్నేహితులు ఆయన సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేసినా కలవలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు తలుపులు లోపలి నుంచి మూసి ఉండటంతో పగులగొట్టి లోనికెళ్లి చూడగా ఆయన మృతిచెంది కనిపించారు. గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


ఊటుకూరు బద్రీనారాయణ కన్నుమూత

ప్యారిస్‌: ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ అధ్యక్షులు ఊటుకూరు బద్రీనారాయణ (74) గురువారం ఉదయం 7.30 గంటలకు పరమపదించారు. బేసంత్‌ నగర్‌లోని శ్మశాన వాటికలో సోదర సంగీత సభల నిర్వాహకులు, కళాకారులు అనేకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని