logo

చెన్నై - తిరుత్తణి హైరోడ్డులో రెండు పైవంతెనల నిర్మాణం

చెన్నై - తిరుత్తణి హైరోడ్డులో వాహనాల రద్దీ ఎక్కువైంది. దీంతో ఈ రోడ్డులో రెండు పైవంతెనల నిర్మాణానికి స్థల సేకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.

Published : 18 Jun 2024 01:34 IST

హైవేస్‌ విభాగం సన్నాహాలు

చెన్నై - తిరుత్తణి హైరోడ్డు  

న్యూస్‌టుడే, వడపళని: చెన్నై - తిరుత్తణి హైరోడ్డులో వాహనాల రద్దీ ఎక్కువైంది. దీంతో ఈ రోడ్డులో రెండు పైవంతెనల నిర్మాణానికి స్థల సేకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఏడాదిలోనే రెండు వంతెనల నిర్మాణానికి హైవేస్‌ విభాగం సిద్ధమవుతోంది. వానగరం - అంబత్తూరు రోడ్డులోని కూడలి, సీటీహెచ్‌ రోడ్డు, పాడిలోని కొరట్టూరు కూడలి వద్ద రెండు వంతెనల నిర్మాణం జరుగుతుందని హైవేస్‌ విభాగం పేర్కొంది. వీటిని నాలుగు వరుసలతో నిర్మించనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత 60 నుంచి 70శాతం మేరకు వాహనాలు పయనిస్తాయి. వ్యయ అంచనా రూ.110 కోట్లు కాగలదని ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీరు పేర్కొన్నారు.

రోడ్ల విస్తరణ

పూనమల్లి - ఆవడి రోడ్డు, టీఐ సైకిల్‌ సంస్థ ఉన్న చోట రోడ్డు పైవంతెన వెడల్పు చేయనున్నారు. వంతెన పక్కన ఉన్న రోడ్డు ఆరు లేన్లతో ఉండగా, రోడ్డుపై వంతెన రెండు లేన్లతో ఉంది. టీఐ సైకిల్స్‌ సంస్థ వద్ద రోడ్డు పైవంతెన వెడల్పు పనులకు రైల్వే, హైవేస్‌ విభాగం నుంచి అనుమతులు కూడా దక్కాయి. రైల్వే విభాగం చేయాల్సిన పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక పనులు ప్రారంభించనున్నారు. వ్యయ అంచనా రూ.22 కోట్లు. ఈ ప్రాజెక్టుతో పశ్చిమ శివారు ప్రాంతవాసులకు ఉపయోగకరం కాగలదు. సీటీహెచ్‌ రోడ్డు కూడా వెడల్పు చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు. పాడి - తిరునిండ్రవూరు వరకు జరగాల్సిన పనులు ఆలస్యమవుతున్నాయి. అంతటా ఒకే రకంగా రోడ్డు వెడల్పు లేదని, భారీ వాహనాలకోసం ప్రత్యేక దారి కూడా లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని కొందరు పేర్కొంటున్నారు.

రెండు గ్రేడ్‌ సెపరేటర్లు

చెన్నై నుంచి అంబత్తూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్ మీదుగా తిరువళ్లూరు వరకు నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. ఈ ప్రాంతంలో వేలాది గృహాలున్నాయి. కావున అదనంగా రెండు గ్రేడ్‌ సెపరేటర్లతో పాటు ఇప్పటికే ఉన్న రెండు వంతెనలను వెడల్పు చేయనున్నారు. పలు రకాల పరిశ్రమలతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో రోజురోజుకీ ట్రాఫిక్‌ కూడా పెరుగుతోంది. వాహనాలు ఎక్కువసేపు వేచి ఉండకుండా కూడళ్లలో గ్రేడ్‌ సెపరేటర్ల అవసరం చాలా ఉందని ఆ విభాగ విశ్రాంత ఇంజినీరు ఒకరన్నారు. అంబత్తూరు ఎస్టేట్ బస్టాండు, ఆవడి కూడలిలో పైవంతెనల నిర్మాణం రెండో దశలో ప్రారంభించనున్నారు. ప్రాజెక్టుకు కావలసిన డిజైన్‌ పనులు జరుగుతున్నాయి. స్థల సేకరణ పనులు పూర్తయిన తర్వాత నిధుల కోసం ప్రభుత్వానికి తెలియజేస్తామని ఇంజినీరు ఒకరన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు