logo

తొమ్మిదేళ్లలో 1,030 వన్యప్రాణుల మృతి

మదురై అటవీ డివిజన్‌లో తొమ్మిదేళ్లలో 1030 వన్యప్రాణులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. రాష్ట్రంలో పలు ప్రత్యేకతలు కలిగిన మదురై జిల్లాలో సుమారు 37 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది.

Published : 18 Jun 2024 01:37 IST

ప్యారిస్, న్యూస్‌టుడే: మదురై అటవీ డివిజన్‌లో తొమ్మిదేళ్లలో 1030 వన్యప్రాణులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. రాష్ట్రంలో పలు ప్రత్యేకతలు కలిగిన మదురై జిల్లాలో సుమారు 37 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడి మదురై ఫారెస్ట్‌ డివిజన్‌లో మదురై, చోళవందన్, ఉసిలంపట్టి అటవీరేంజ్‌లు ఏర్పాటు చేశారు. అళగర్‌మలై, నాగమలై, యానైమలై, కొట్టాంపట్టి, చోళవందన్, పాలమేడు, అళగర్‌మలై తదితర చిన్నచిన్న కొండలు ఉన్నాయి. ఇక్కడున్న దట్టమైన అడవుల్లో జింక, అడవి పంది, కోతులు, నెమలి తదితర వన్యప్రాణులు, పక్షులు అధిక సంఖ్యలో ఉన్నాయి. 2022 సర్వే ప్రకారం  ఉసిలంపట్టి, చోళవందన్‌ ప్రాంతాల్లో వెయ్యికి పైగా వన్య ప్రాణులు, పక్షులు ఉన్నట్లు గుర్తించారు. 

అత్యధికంగా 435 నెమళ్లు..

నెమళ్లు మదురైలో అధిక సంఖ్యలో ఉన్నాయి. కొద్దిరోజులుగా అవి అనుమానాస్పదంగా మృతి చెందుతుండటం దిగ్భ్రాంతి కలిగించింది. మదురై అటవీ డివిజన్‌లో 2015 నుంచి 2024 వరకు ఎన్ని జంతువులు మృతిచెందాయి? రోడ్డు ప్రమాదాల్లో ఎన్ని ప్రాణాలు కోల్పోయాయి? విషం పెట్టడటంతో ఎన్ని చనిపోయాయనే వివరాలను సమాచారహక్కు చట్టం కింద మదురై ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయానికి దరఖాస్తు అందింది. ఇందుకు సంబంధించి ఇచ్చిన జవాబులో.. 1030 వన్యప్రాణులు మృతిచెందినట్లు పేర్కొన్నారు. మదురై ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలో నెమలి, అడవి పంది, అడవి దున్న, జింక, కోతి తదితర 28 రకాల అరుదైన జంతువులు, పక్షులు మృతి చెందాయి. వాటిలో అధికంగా 435 నెమళ్లు, 258 జింకలు, అడవిదున్న 71, అడవి పంది 43, కోతులు 40 ఉన్నాయి. అటవీ జంతువులకు విషం పెట్టినందుకు మూడు కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. విషం పెట్టడం, అక్రమంగా ఏర్పాటు చేసే విద్యుత్తు కంచెల్లో చిక్కుకుని నెమళ్లు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై అటవీశాఖ అధికారి మాట్లాడుతూ.. వన్యప్రాణులను వేటాడి, వాటి మాంసాన్ని విక్రయించడం తదితర వాటిని పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు ప్రమదాల్లో వన్యప్రాణులు మృతిచెందకుండా వాటికి అడవిలోనే ఆహారం, తాగునీరు ఏర్పాటు చేసి, రోడ్డు దాటే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు అమర్చినట్లు పేర్కొన్నారు. కఠిన చర్యలు చేపడుతుండటంతో వన్యప్రాణుల వేట క్రమంగా తగ్గిందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని