logo

ఉప ఎన్నిక బహిష్కరణ ఉపయోగకరమేనా?

విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గంలో జులై 10న జరిగే ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Published : 19 Jun 2024 01:04 IST

అన్నాడీఎంకే నిర్ణయంపై సర్వత్రా చర్చ
 - న్యూస్‌టుడే, సైదాపేట

విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గంలో జులై 10న జరిగే ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నెలకొంది. ముందే లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన ఈ సమయంలో ఎన్నికలను బహిష్కరించడం కార్యకర్తలను మరింత నిరుత్సాహానికి గురిచేస్తుందని కొందరు రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. అయితే గత అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను డీఎంకే కూడా బహిష్కరించిందని, కావున ఇది పెద్ద సమస్య కాదని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నాడీఎంకే వారు చెబుతున్నారు.

సమన్వయ లోపం

ప్రొఫెసర్‌ రాము మణివణ్ణన్‌ మాట్లాడుతూ... అధికార పార్టీ అవినీతి, అధికార దుర్వినియోగాన్ని చూసి ఓ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబుకాదన్నారు. పోటీ నుంచి అన్నాడీఎంకే తప్పుకోవడం ద్వారా భాజపా మరింత వృద్ధి చెందేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే బయట నుంచీ, అంతర్గతంగా అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, పార్టీలో సమన్వయం లేదనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. అందుకే ఈపీఎస్‌ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పారు. ఇదిలా ఉండగా ఎన్నికల నుంచి తప్పుకోవడం తప్పని, తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కార్యకర్తలను కలుస్తానని శశికళ ప్రకటించారు. దీన్ని అన్నాడీఎంకే సీనియర్‌ నిర్వాహకుడు ఒకరు ఖండించారు. పళనిసామి నిర్ణయం మంచిదే అనేది కార్యకర్తలకు అర్థం అవుతుందని చెప్పారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులువు కాదని, అనవసరంగా కార్యకర్తల శ్రమను వృథా చేయకూడదన్నారు. శశికళ కూడా ఏదేదో మాట్లాడుతున్నారని, అయితే ఎవరూ ఆమె వైపు వెళ్లడం లేదన్నారు. ఎంజీఆర్, జయలలిత తర్వాత అన్నాడీఎంకేకు నాయకుడు పళనిసామే అని కార్యకర్తలు భావిస్తున్నారని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం

రచయిత దురైకరుణ మాట్లాడుతూ... డీఎంకే అధికార దుర్వినియోగం ఉన్నా దాన్ని ఎదుర్కొని ధీటుగా బదులిస్తేనే పార్టీ బలపడుతుందన్నారు. ప్రజల నమ్మకాన్ని పొందుతుందన్నారు. అన్నాడీఎంకే ప్రచారకర్త సమరసం ఈ అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. ఈపీఎస్‌ తీసుకుంది సరైన నిర్ణయమని, పార్టీ లక్ష్యం 2026 అసెంబ్లీ ఎన్నికలేనని, ఉప ఎన్నిక కాదని తెలిపారు. తిరుమంగళం, ఈరోడు తూర్పు ఉప ఎన్నికలు ఎలా జరిగాయో కార్యకర్తలకు తెలుసని, అనవసర శ్రమను కార్యకర్తలు ఇష్టపడరన్నారు. ఇంకా కొందరు పార్టీ నిర్వాహకులు మాట్లాడుతూ... ఒక నియోజకవర్గ ఉప ఎన్నికలను బట్టి పార్టీ బలహీనపడుతుందని చెప్పలేమన్నారు. కార్యకర్తలకు సంబంధించినంత వరకు పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి మద్దతు ఇస్తారని తెలిపారు. ముఖ్యంగా డీఎంకేను ఓడించడం అన్నాడీఎంకేకు మాత్రమే సాధ్యమనే సంగతి పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా బాగా తెలుసన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని