logo

కల్తీ సారా మృతుల్లో ఉత్తరాది యువకుడు

కల్తీసారా మృతుల్లో ఇతర రాష్ట్రానికి యువకుడు కూడా ఉన్నాడు. కళ్లకురిచ్చి ప్రాంతంలో ఉత్తరాదికి చెందిన బిజేందర్‌ అనే వ్యకిత ఐదేళ్లుగా పానీపూరి వ్యాపారం చేస్తున్నాడు.

Published : 23 Jun 2024 00:51 IST

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కల్తీసారా మృతుల్లో ఇతర రాష్ట్రానికి యువకుడు కూడా ఉన్నాడు. కళ్లకురిచ్చి ప్రాంతంలో ఉత్తరాదికి చెందిన బిజేందర్‌ అనే వ్యకిత ఐదేళ్లుగా పానీపూరి వ్యాపారం చేస్తున్నాడు. బుధవారం కల్తీ సారా తెప్పించుకుని తాగి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో మృతి చెందాడు. అధహకారుల విచారణలో ఉత్తరాదికి చెందిన వాడని తెలియడంతో కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో ఆదివారం కళ్లకురిచ్చి చేరుకోనున్నారు.

చికిత్స పొందుతున్న చెన్నై కూలీ..

ఆర్కేనగర్‌:  చెన్నై ఎంజీఆర్‌నగర్‌ అన్నల్‌కాంతి వీధిలో నివాసం ఉంటున్న కృష్ణస్వామి(37) కూలీ. 17న లారీ లోడుతో విక్రవాండికి వెళ్లాడు. విళుపురం పాతబస్టాండ్‌ వద్ద సారా కొనుగోలు చేసి తాగి, మరో రెండు ప్యాకెట్ల చెన్నై తీసుకొచ్చాడు. వాటిని తాగడంతో శుక్రవారం విరేచనాలు కడుపునొప్పితో కేకేనగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చేరాడు. అనంతరం చెన్నై రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఇతనికి కల్తీసారా విక్రయించినవారు కళ్లకురిచ్చి నుంచి వాటిని తీసుకొచ్చారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇతర జిల్లాలకు పారిపోతున్న సారా వ్యాపారులు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ సారా మరణాలు ఎక్కువ కావడంతో కడలూర్‌ జిల్లాలో పోలీసులు సారా బట్టీలపై ఆకస్మిక దాడులు చేస్తున్నారు. దీంతో కడలూర్‌ జిల్లాలోని సారా వ్యాపారులు ఇతర జిల్లాలకు పారిపోతున్నారు. కడలూర్‌ జిల్లా ఎస్పీ రాజారాం ఉత్తర్వుల మేరకు ఎక్సైజ్‌ డీఎస్పీ సౌమ్య నేతృత్వంలో సిబ్బంది జిల్లాలోని కడలూర్, చిదంబరం, విరుదాచలం, నైవేలి, సేత్తియాతోపు, బన్రుట్టి మొదలైన ప్రాంతాల్లో సారా బట్టీలు, విక్రయాలపై ఆకస్మిక దాడులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 19వ తేదీ మద్యం అక్రమంగా నిల్వ ఉంచిన 45 మందిపై కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 11 లీటర్ల సారాయి, 70 పుదుచ్చేరి మద్యం సీసాలు, 263 టాస్మాక్‌ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా శుక్రవారం 74 కేసులు నమోదు చేసి 194 లీటర్ల నాటు సారా, 73 పుదుచ్చేరి మద్యం సీసాలు, 260 టాస్మాక్‌ మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని 20 మందిని అరెస్టు చేశారు. జిల్లాలో శాంతిభద్రతల విభాగ పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులు సంయుక్తంగా సారా వేట నిర్వహిస్తున్నందున బన్రుట్టి, కడలూర్‌ ప్రాంతాల సారా వ్యాపారులు పుదుచ్చేరికి, విరుదాచలం, తిట్టక్కుడి ప్రాంతాల వ్యాపారులు పెరంబలూర్‌ జిల్లాకు, పెరంబలూర్‌ జిల్లాకు చెందిన వ్యాపారులు తంజావూర్‌ జిల్లాకు పారిపోతున్నారు. కడలూర్‌ జిల్లా శాంతిభద్రతల విభాగం, ఎక్సైజ్‌ పోలీసులు ఆయా ప్రాంతాల్లో సారా వ్యాపారుల జాబితా సిద్ధం చేసి శుక్రవారం రాత్రి నుంచి శనివారం వేకువజాము వరకు వారి ఇళ్లలో తనిఖీలు చేపడుతుండగా అనేక మంది తమ ఇళ్లకు తాళాలు వేసి కుటుంబాలతో ఇతర జిల్లాలకు వెళ్లిపోతున్నారు.


వేళచ్చేరి: కళ్లకురిచ్చి కల్తీ సారా ఘటన నేపథ్యంలో తమిళనాడు డ్రగ్స్‌ డీలర్ల అసోసియేషన్‌ చేసిన హెచ్చరిక మేరకు శనివారం ఉదయం కళ్లకురిచ్చి ప్రాంతంలోని ఔషధ దుకాణాల్లో ఇథనాల్‌ ఆధారిత స్పిరిట్, శానిటైజర్ల విక్రయాలపై తనిఖీలు జరుపుతున్న కళ్లకురిచ్చి పోలీసులు.


లొంగిపోయిన నిందితుడు

వేళచ్చేరి: కళ్లకురిచ్చి సమీప మాధవచ్చేరి గ్రామానికి చెందిన రామర్‌ (36) ఇదే ప్రాంతంలో కొన్నేళ్లుగా సారా వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 18వ తేదీ ఇతను విక్రయించిన సారా తాగిన వారిలో 20 మందిలో ఆరుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన అనంతరం పారిపోయిన రామర్‌ కోసం పోలీసులు గాలించసాగారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కచ్చిరాంపాళ్యం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇతని వద్ద చెంగం డీఎస్పీ నేతృత్వంలో పోలీసు బృందం దర్యాప్తు జరుపుతోంది.


కర్మాగారాల్లో తనిఖీ

గుమ్మిడిపూండి, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి కల్తీ సారా ఘటన నేపథ్యంలో మిథనాల్‌ వినియోగించే పెయింట్, మందులు, వార్నిష్‌ తయారీ కర్మాగారాల్లో తనిఖీ చేపట్టాలని తిరువళ్లూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస పెరుమాల్‌ ఆదేశించారు. ఈ మేరకు గుమ్మిడిపూండి పారిశ్రామికవాడలోని కర్మాగారాల్లో పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మిథనాల్‌ నిల్వల వివరాలు సేకరించారు. కొత్తగా కొనుగోలు చేయాల్సి వస్తే పోలీసుల అనుమతి పొందాలని సూచించారు.


వేళచ్చేరి: కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం రాత్రి పరామర్శిస్తున్న మంత్రి మా.సుబ్రమణియన్‌. వెంట కలెక్టరు ఎం.ఎస్‌ ప్రశాంత్, శంకరాపురం ఎమ్మెల్యే ఉదయసూర్యన్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని