logo

సారా రక్కసికి బలైన భార్యాభర్తలు

కళ్లకురిచ్చి సమీపం కరుణాపురానికి చెందిన సురేష్‌ (35) దివ్యాంగుడు. ఇతను పెయింటర్‌. ఇతనికి భార్య వడివుక్కరసి (28), కుమార్తె కోకిల (16), కుమారులు హరీష్‌ (15), రాఘవన్‌ (14) ఉన్నారు

Updated : 23 Jun 2024 01:17 IST

అనాథలైన ముగ్గురు పిల్లలు

తల్లిదండ్రుల ఫొటో చూపుతున్న పిల్లలు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి సమీపం కరుణాపురానికి చెందిన సురేష్‌ (35) దివ్యాంగుడు. ఇతను పెయింటర్‌. ఇతనికి భార్య వడివుక్కరసి (28), కుమార్తె కోకిల (16), కుమారులు హరీష్‌ (15), రాఘవన్‌ (14) ఉన్నారు. భార్యాభర్తలు కూలీ పనులకు వెళ్తూ మద్యానికి బానిసలయ్యారు. నాలుగు రోజుల క్రితం కరుణాపురంలో విక్రయించిన కల్తీ సారా తాగి ఇద్దరూ మృతి చెందారు. ప్రస్తుతం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఏం చేయాలో తెలియక కన్నీళ్లతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా కోకిలా మాట్లాడుతూ... ‘నాన్న నా చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో కుడి చేయి కోల్పోయాడు. తర్వాత పెయింటింగ్‌ పనిచేస్తూ మమ్మల్ని పోషించసాగాడు. క్రమంగా మద్యానికి బానిసయ్యాడు. అమ్మకు మద్యం అలవాటు లేదు. కానీ పనికి వెళ్లొచ్చి ఒళ్లునొప్పులు భరించలేక ఇంట్లో నాన్న ఉంచిన సారాను వామ్‌ వాటర్‌ అనుకుని తాగింది. ఇద్దరూ అనారోగ్యం పాలై మృతిచెందారు. రోజూ కూలీకి వెళ్లి నాన్న రూ.500, అమ్మ రూ.200 తెచ్చేవారు. ఆ డబ్బులతో అప్పులకు వడ్డీలు కడుతూ ఉన్నాము. ఇకపై నేను, నా తమ్ముళ్లు ఎలా బతకాలో తెలియడం లేదు. కరుణాపురంలో మాలాగా అనేక మంది పిల్లలున్నారు. ఈ సందర్భంగా మా తరఫున ప్రభుత్వాన్ని కోరేది ఒకటే.. ఇంతమంది ప్రాణాలను హరించిన కల్తీ సారా విక్రేతలను ఉరి తీయాలని కోరుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని