logo

బానిసలుగా మార్చి.. విక్రయాలు పెంచుకుని

పుదుచ్చేరిలోని జిప్మర్‌ ఆస్పత్రిలో పలువరు కల్తీసారా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో పెరియస్వామి(40) అనే వ్యక్తి జీవన్మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Published : 23 Jun 2024 01:24 IST

కరుణాపురంలో విక్రేతలు, దళారుల దారుణం
పట్టించుకోని యంత్రాంగం

కళ్లకురిచ్చి కరుణాపురం ప్రాంతాన్ని సారా విక్రేతలు అడ్డాగా మార్చుకున్నారు. ప్రజల్ని ప్రలోభాలకు గురిచేసి, తమ దారికి తెప్పించుకుని విక్రయాలు పెంచుకున్నారు. వేలాలు వేసి మరీ ప్రాంతాలు పంచుకున్న దారుణం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈనాడు-చెన్నై

కరుణాపురంలో 24 గంటలూ సారా సరఫరాకు విక్రయదారులు తెరతీశారు. రాజకీయ అండదండలతో, అధికారుల దన్నుతో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. సారా అలవాటు చేసేందుకు తొలుత తక్కువ ధరతో ప్యాకెట్లను విక్రయించేవారు. బానిసలయ్యాక.. ధరలు పెంచడంలాంటివి చేసేవారు. స్థానికులను ఎంతలా బానిసలుగా మార్చారంటే.. పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ సారా తాగేలా నేర్పించారు. చాలా ఇళ్లలోని పురుషులు ఎక్కువగా ఈ తరహాగా మారడంతో కుటుంబాల్లో వివాదాలు మొదలై జీవితాలు పాడయ్యాయి. విక్రయదారులు తమ వ్యాపార విస్తరణలో భాగంగా తెల్లవారుజామున 3 నుంచే ప్యాకెట్లను అందుబాటులో ఉంచేవారు. కూలీలు పనికి వెళ్లే ముందే వాటిని తాగేవారు. ఉదయం నుంచే మత్తులో మునిపోయేవారని స్థానికులు చెబుతున్నారు.

కల్వరాయన్‌మలైలో మొదలై..

కరుణాపురంలో కల్తీసారా ప్రబలడానికి ప్రధాన మూలాలు ఇక్కడి నుంచి 55 కి.మీ. దూరంలోని కల్వరాయన్‌మలై ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడే పలువురు దళారులు సారాను కాచడం మొదలుపెట్టారు. ఇక్కడినుంచి ఈ సంస్కృతి పరిసర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు కరుణాపురం సమీపంలో సైతం సారా తయారీ స్థావరాలున్నట్లు వెల్లడిస్తున్నారు. అక్కడినుంచి మిథనాల్‌ కలిపి కరుణాపురంలో పరిసరాల్లో అమ్మడం లాంటివి చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యాపారానికి పోలీసులు, రాజకీయనేతల అండదండలున్నాయని వారంటున్నారు. ఇలా విస్తరించిన కల్తీసారా మాఫియాలో రాటుతేలిన వ్యక్తులే ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. సారా విక్రేతలు తమ వ్యాపారం కోసం గ్రామాల్ని, ప్రాంతాల్ని వేలంలో కొనడం మరో ఆనవాయితీగా ఉంది. అలా వేలంలో వారు సొంతం చేసుకున్న ప్రాంతంలో మరొకరు వ్యాపారం చేసేందుకు వీల్లేదన్నమాట. ప్రత్యేక సిబ్బందిని పెట్టి మరీ వ్యాపారాన్ని అడ్డుఅదుపూ లేకుండా పెంచుకున్నట్లుగా సమాచారం వస్తోంది. ఇలా తమ వ్యాపారాన్ని నడిపేవారు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు. సారా సామ్రాజ్య మూలాలు తెలిసినా, విక్రేతలు, దళారుల వ్యవస్థపై పూర్తిగా అవగాహన ఉన్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కరుణాపురంలో మరణాలు పెరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

జిప్మర్‌ ఆసుపత్రిలో బాధితుడి జీవన్మృతి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలోని జిప్మర్‌ ఆస్పత్రిలో పలువరు కల్తీసారా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో పెరియస్వామి(40) అనే వ్యక్తి జీవన్మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిరంతర వైద్యం అందించినా ఎలాంటి మెరుగుదల లేదని పేర్కొన్నారు.


సగం డబ్బు తాగుడుకే..

మరణాలు 55కు చేరాయి. ఇదో పెద్ద విషాదంగా మారింది. కరుణాపురం చరిత్రలో ఇది మాయని మచ్చ. ఈ ప్రాంతంలో సుమారు 1500 ఇళ్లుండగా జనాభా 6వేల పైనే ఉంటుంది. ఎక్కువగా రోజువారీ కూలీలే. ఇతర ప్రాంతాలకు పనులకెళ్లి రోజుకు రూ.300 నుంచి రూ.500 సంపాదిస్తుటారు. ఇందులో కనీసం సగం డబ్బు సారాకే వెచ్చిస్తున్నారని స్థానికులు అంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్‌ దుకాణాల్లో ధరలు పెరగడం ఇక్కడి విక్రేతలకు కలిసొచ్చినట్లుగా భావించేవారు. రూ.50 నుంచి రూ.70 వరకు ప్యాకెట్‌ అమ్మడం మొదలుపెట్టారు. కూలీలంతా ఊరికొచ్చాక రాత్రి సమయాల్లో కూడా విరివిగా విక్రయాలు చేసేవారు.

మిథనాలే ఎందుకంటే..

కూలీల్లో మత్తు ఎక్కేందుకు, వారికుండే నొప్పులు, ఇతర బాధలు మరిచిపోయేలా కిక్‌ ఇచ్చే సారాను విక్రయించడం ఇక్కడి వ్యాపారులు పరిపాటిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ మత్తుకోసం మిథనాల్‌ను కలిపి అమ్మడం మొదలుపెట్టినట్లుగా చెబుతున్నారు. నిపుణులు చెప్పేదాన్నిబట్టి.. సారాలో 10మి.లీ. మిథనాల్‌ కలిపితే తాగినవారిలో అంధత్వం వస్తుందని, అదే 30 మి.లీ. తీసుకుంటే ఏకంగా మృతిచెందడం ఖాయమని అంటున్నారు. ఈ లెక్కన తాజా ఘటనలో సారా ప్యాకెట్లలో ఎంతేసి మిథనాల్‌ కలిపారనేది ఓ అంచనా వస్తుంది. ఎక్కువ మత్తుకోసం ఎక్కువ మోతాదు వాడి ఉంటారనే అంచనాకు నిపుణులు వస్తున్నారు. లోతైన విచారణ కొనసాగుతోంది.

కల్తీ సారా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని కరుణాపురంలో ఆందోళనకు దిగిన మహిళలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని