logo

కల్తీసారా మరణాలపై అన్నాడీఎంకే రభస

కల్తీసారా మరణాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేసేందుకు ప్రధాన ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిసామి ప్రయత్నించగా అనుమతి లభించకపోవడంతో వాకౌట్‌ చేశారు. శాసనసభ మూడోరోజు శనివారం సమావేశమకాగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టనున్నట్లు సభాపతి అప్పావు ప్రకటించారు.

Published : 23 Jun 2024 01:35 IST

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌
శాసనసభ నుంచి వాకౌట్‌

సభ వెలుపల నినాదాలు చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులు

చెన్నై, న్యూస్‌టుడే: కల్తీసారా మరణాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేసేందుకు ప్రధాన ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిసామి ప్రయత్నించగా అనుమతి లభించకపోవడంతో వాకౌట్‌ చేశారు. శాసనసభ మూడోరోజు శనివారం సమావేశమకాగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టనున్నట్లు సభాపతి అప్పావు ప్రకటించారు. కల్తీసారా వ్యవహారంపై చర్చించాలని ఎడప్పాడి పళనిస్వామి కోరారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే అనుమతి ఇవ్వనున్నట్లు సభాపతి తెలిపారు. ముఖ్యమంత్రిగా పని చేసిన మీకు ఈ విషయం తెలియదా అంటూ ఈపీఎస్‌ను ప్రశ్నించారు. ప్రతిపక్షనేత మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలంటూ అన్నాడీఎంకే సభ్యులు పట్టుబట్టి సభలో రభస సృష్టించారు. సభాపతి అసంతృప్తి వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. అన్నాడీఎంకే సభ్యులు సభను వాకౌట్‌ చేశారు. శనివారం కూడా వారు నల్లచొక్కాలు ధరించి రావడం గమనార్హం.

పాఠశాలలకు సకల సౌకర్యాలు

ఒట్టపిడారం ఎమ్మెల్యే షణ్ముగయ్య లేవనెత్తిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి సమాధానమిచ్చారు. తూత్తుకుడి జిల్లా ఒట్టపిడారంలో బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీస్‌కు భవనం నిర్మించడానికి గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. అన్బళగన్‌ పాఠశాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలోని అన్ని బడులకు అవసరమైన వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రూ.7,500 కోట్లతో 16వేల తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించి రూ.2,487 కోట్లతో స్మార్ట్‌ తరగతి గదులు, పాఠశాల ప్రహరీ, ప్రయోగశాల సహా 3,603 తరగతి గదులను నిర్మించినట్టు తెలిపారు. 3,601 తరగతి గదులు నిర్మించే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్లను కేటాయించి పాఠశాల అభివృద్ధి పనులను చేపట్టనున్నారని వెల్లడించారు.


వాస్తవాలు దాచడంలేదు..

మాట్లాడుతున్న న్యాయశాఖ మంత్రి రఘుపతి

న్యాయశాఖ మంత్రి రఘుపతి మాట్లాడుతూ.. శాసనసభను స్తంభింపచేయాలని ఎడప్పాడి పళనిసామి భావిస్తున్నారన్నారు. కల్తీసారా వ్యవహారంపై మాట్లాడేందుకు అవకాశం నిరాకరించానడంలో వాస్తవం లేదన్నారు. ఎవరు తప్పు చేసినా, వారు ఏ పదవిలో ఉన్నా చర్యలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. కల్తీసారా వ్యవహారంలో ప్రభుత్వం వాస్తవాలను దాయడంలేదని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తునకు అవసరం ఏర్పడలేదన్నారు. కల్లు దుకాణాలను తెరవాల్సిన అవసరం కూడా ప్రస్తుతం లేదన్నారు.


చెన్నై వార్డుల సంఖ్య పెంపు

స్థానిక స్వపరిపాలనశాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ మాట్లాడుతూ... చెన్నైలో వార్డు సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 200 ఉన్నాయని, వార్డుకు 40వేల మంది అదనంగా నివసిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ పంచాయతీల సంఖ్య 700కు, మున్సిపాలిటీల సంఖ్య 159కు పెంచనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో 20 రోజుల్లో మరో 4 కార్పొరేషన్లు ఆవిర్భవించనున్నాయని తెలిపారు. స్థానిక స్వపరిపాలనశాఖలో 3వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలో ప్రకటనను విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. వీధికుక్కల బారి నుంచి ప్రజలను కాపాడే చర్యలను ప్రభుత్వం చేపట్టనుందని, కు.ని శస్త్రచికిత్సల ద్వారా వాటి సంఖ్యను నియంత్రించనున్నట్లు తెలిపారు. నగరాల్లో రోడ్లపై పశువులు తిరగడాన్ని అడ్డుకునేందుకు చట్టం తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. కరుణానిధి శతజయంతి వేడుకల్లో భాగంగా చెన్నై రిప్పన్‌ బిల్డింగ్‌ ప్రాంగణంలో రూ.75 కోట్లతో కౌన్సిల్‌ హాల్‌ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.


వార్షిక ఆదాయ గరిష్ఠ పరిమితి పెంపు

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి గీతాజీవన్‌ తన శాఖకు సంబంధించి 32 ప్రకటనలు చేశారు. అందులో ప్రధానంగా.. చెన్నైలో మహిళల భద్రతకు భరోసా కల్పించేలా, స్వయం ఉపాధి కల్పించేలా 200 మంది మహిళా ఆటో చోదకులకు రూ.లక్ష చొప్పున సబ్సిడీ అందించనున్నారు. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా మహిళలు, బాలికల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందడానికి ఉన్న కుటుంబ వార్షిక ఆదాయ గరిష్ఠ పరిమితిని రూ.72వేలు నుంచి రూ.1.20 లక్షకు పెంచారు. వితంతువు, భర్త విడిచిపెట్టిన మహిళలు, నిరాదరణకు గురైనవారు, దారిద్య్రరేఖకు దిగువనున్న 200 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం రూ.50వేలు చొప్పున రాయితీ ఇవ్వనున్నారు. తిరువళ్లూర్, కోయంబత్తూర్, పుదుకోట్టై, తూత్తుకుడి, మదురై జిల్లాల్లోని 6 ప్రభుత్వ వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లను రూ.కోటితో పునరుద్ధరించనున్నారు.


కోయంబేడు మార్కెట్‌ అభివృద్ధి..

సీఎండీఏ పద్దులపై చర్చ తర్వాత మంత్రి పీకే శేఖర్‌బాబు శాఖా సంబంధిత ప్రకటనలు చేశారు. చెన్నై మహానగర ప్రాంతంలోని 10 పబ్లిక్‌ లైబ్రరీలను హైస్పీడ్‌ ఇంటర్నెట్, పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులతో రూ.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. రూ.10 కోట్లతో కోయంబేడు మార్కెట్‌ అభివృద్ధి, రూ.15 కోట్లతో వాననీటి పారుదల కాలువలు ఏర్పాటు చేయనున్నారు. చెట్‌పేట్‌ ఎకో పార్కు రూ.10 కోట్ల వ్యయంతో, చెన్నై మహానగరంలోని 10 సబ్‌వేలు రూ.8 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. రూ.5 కోట్లతో ట్రాఫిక్‌ సిగ్నళ్లను సౌరశక్తితో పనిచేసేలా చర్యలు చేపట్టనున్నారు.  


రామదాసు, అన్బుమణిపై పరువునష్టం దావా

శాసనసభ ప్రాంగణానికి బయట డీఎంకే ఎమ్మెల్యేలు ఉదయసూరియన్, వసంతం కార్తికేయన్‌ విలేకర్లతో మాట్లాడారు. కల్తీసారా వ్యవహారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి తక్షణ చర్యలు చేపట్టారన్నారు. ఇందుకు విరుద్ధంగా పీఎంకే నేతలు రామదాస్, అన్బుమణి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నారని విమర్శించారు. సారా వ్యాపారి కన్నుకుట్టి డీఎంకేకు చెందినవారు కాదన్నారు. ఆరోపణలను రామదాసు, అన్బుమణి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్‌ విసిరారు. లేదంటే వారిపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.


మేట్టూర్‌ నుంచి తిరుపతికి బస్సు సేవలు..

వెంకన్న దర్శనానికి మేట్టూర్‌ నుంచి తిరుపతికి బస్సులు నడపాలని ఎమ్మెల్యే సదాశివం కోరారు. రవాణాశాఖ మంత్రి శివశంకర్‌ మాట్లాడుతూ సేలం జిల్లా కేంద్రం నుంచి తిరుపతికి సరిపడా బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. మేట్టూర్‌ నుంచి నడిపిందేకు పరిశీలిస్తామన్నారు. మరో సభ్యుడి ప్రశ్నకు సమాధానమిస్తూ అరసు కేబుల్‌ టీవీ సంస్థలో నిర్వహణ లోపాలు సవరించి రెండు నెలల్లో హెచ్‌డీ బాక్సులు అందించనున్నట్లు తెలిపారు.


రాష్ట్ర పోలీసులతో నిజాలు రావు..

శాసనసభ ప్రాంగణంలో విలేకర్లతో ఎడప్పాడి పళనిసామి మాట్లాడారు. కల్తీసారా దుర్ఘటనను ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడేందుకు అనుమతి కోరగా నిరాకరించారని తెలిపారు. విష విరుగుడుకు మందు నిల్వలపై ప్రశ్నిస్తే కడుపుపుండు మందు గురించి మంత్రి సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. కల్తీసారా తాగిన పలువురు ఆస్పత్రికి ఆలస్యంగా వెళ్లడమే మరణాలకు కారణమని చెబుతున్నారని, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ దుర్ఘటనపై డీఎంకే ప్రభుత్వ పోలీసులు దర్యాప్తు జరిపితే నిజాలు బయటకు రావని, కచ్చితంగా సీబీఐ దర్యాప్తు అవసరమని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని