logo

అందరూ విజయ్‌ మార్గంలో పయనించాలి

నటుడు విజయ్‌ 50వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తమిళగ వెట్రి కళగం తరఫున సంక్షేమ సాయం అందజేత కార్యక్రమం చెన్నైలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు సౌందరరాజ విలేకర్లతో మాట్లాడారు.

Updated : 24 Jun 2024 02:32 IST

నటుడు సౌందరరాజ

విలేకర్లతో మాట్లాడుతున్న సౌందరరాజ

చెన్నై: నటుడు విజయ్‌ 50వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తమిళగ వెట్రి కళగం తరఫున సంక్షేమ సాయం అందజేత కార్యక్రమం చెన్నైలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు సౌందరరాజ విలేకర్లతో మాట్లాడారు. విజయ్‌ రూ.200 కోట్ల పారితోషికాన్ని కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఇప్పటివరకు తాను సంపాదించిన డబ్బు, కీర్తి, విజయాలకు కారణమైన ప్రజలకు సేవ చేసేందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఆయన ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాకున్నా ఉత్తమ వక్త అని, దానిని త్వరలో అందరూ చూస్తారని పేర్కొన్నారు. కళ్లకురిచ్చి జిల్లాలోని కల్తీసారా దుర్ఘటన మృతులకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విజయ్‌ మార్గంలోనే అందరూ పయనించి నిరుపేదలు, నిర్భాగ్యులకు సేవా కార్యక్రమాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో నటులు రోబో శంకర్, శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


జులై 5న 7/బి విడుదల

చిత్రంలోని ఓ సన్నివేశం

చెన్నై, న్యూస్‌టుడే: డ్రీమ్‌ హౌస్‌ పతాకంపై దర్శకుడు హారూన్‌ కథ రాసి నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన చిత్రం ×7/బి×. సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్‌ తదితరులు నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. అందులోని సన్నివేశాలు ఈ చిత్రం సస్పెన్షన్, థ్రిల్లర్, హారర్‌గా ఉండొచ్చనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ఈ నేపథ్యంలో చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో జులై 5న విడుదల కానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. హారర్‌ అంటేనే కామెడీ అనే తమిళ సినిమా రంగం అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ ఓ పూర్తి థ్రిల్లింగ్‌ అనుభవాన్ని ఇచ్చేలా ఫీల్‌ గుడ్‌ హారర్‌గా చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు హారూన్‌ తెలిపారు.


ఆగస్టులో డీఎన్‌ఏ...

డబ్బింగ్‌ చెబుతున్న అధర్వ

చెన్నై: నెల్సన్‌ దర్శకత్వంలో అధర్వ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డీఎన్‌ఏ’. నిమిషా సజయన్, దర్శకుడు బాలాజీ శక్తివేల్, రమేశ్‌ తిలక్‌ తదితరులు ఇతర తారాగణం. చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో డబ్బింగ్‌ పనులను చిత్రబృందం ప్రారంభించింది. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది.


రజనీ ఆశీస్సులు పొందిన లారెన్స్‌

చెన్నై: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకనటుడు రాఘవ లారెన్స్‌ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కొంత కాలం క్రితం ‘మాట్రం’ పేరిట ఫౌండేషన్‌ను ప్రారంభించారు. దీని ద్వారా పలువురికి సాయం అందిస్తున్నారు. ఇందులో కొందరు నటీనటులూ చేరి ప్రజలకు తమవంతు సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను లారెన్స్‌ నేరుగా కలిశారు. ‘మాట్రం ఫౌండేషన్‌ కోసం సూపర్‌స్టార్‌ను కలిసి ఆశీస్సులు పొందినట్టు తన ‘ఎక్స్‌’ పేజీలో లారెన్స్‌ వెల్లడించారు. ఈ కలయిక అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని, గురువే శరణం అంటూ వ్యాఖ్యానించారు.


భావోద్వేగాన్ని మాటల్లో వివరించలేను

యువన్‌ శంకర్‌రాజా

యువన్‌ శంకర్‌రాజా, భవతారణి

చెన్నై: వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న ‘గోట్‌’ చిత్రం రెండో పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పాటను విజయ్, ఏఐ సాయంతో గాయని భవతారణి స్వరాన్ని ఉపయోగించారు. దీని గురించి ఆమె అన్న, సంగీత దర్శకుడైన యువన్‌ శంకర్‌రాజా ‘ఎక్స్‌’ పేజీలో.. ‘గోట్‌’ రెండో పాట తనకు అత్యంత ప్రత్యేకమన్నారు. ఈ భావోద్వేగాన్ని మాటలతో వివరించడం అసాధ్యమని తెలిపారు. బెంగళూరులో ఈ పాటకు తాను సంగీతాన్ని సమకూర్చినప్పుడు భవతారణి పాడితే బాగుంటుందని భావించామని, అప్పటికే ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉందని, డిశ్చార్జి అయిన తర్వాత పాడించాలని అనుకున్నట్లు తెలిపారు. అలా అనుకున్న గంట తర్వాత ఆమె మరణవార్త అందిందన్నారు. దీంతో ఏఐ సాయంతో ఆమె స్వరంతో పాటను రికార్డు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని