logo

57కు పెరిగిన కల్తీ సారా మరణాలు

కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం 57కు చేరింది. ఈ ఘటనకు సంబంధించి సీబీసీఐడీ పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు.

Published : 24 Jun 2024 01:58 IST

శక్తివేల్‌

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం 57కు చేరింది. ఈ ఘటనకు సంబంధించి సీబీసీఐడీ పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు. విళుపురం, కళ్లకురిచ్చి, సేలం, పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రులకు శనివారం వరకు 214 మంది బాధితులను తరలించారు. చికిత్స పొందుతూ శనివారం వరకు 55 మంది మృతి చెందగా శనివారం రాత్రి ట్రాన్స్‌జెండతో పాటు ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో 106 మంది, సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో 30 మంది, విళుపురం ముండియంబాక్కం ఆసుపత్రిలో నలుగురు, పుదుచ్చేరి జిప్మర్‌లో 17 మంది కలిపి మొత్తం 157 మంది చికిత్స పొందుతున్నారు. సేలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మందిలో 8 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

నలుగురి పరిస్థితి విషమం

సైదాపేట: పుదుచ్చేరి జిప్మర్‌లో 17 మంది చికిత్సకు చేరగా ఐదుగురు డిశ్ఛార్జయ్యారు. మిగిలిన 12 మందిలో 10 మంది ఐసీయూలో ఉన్నారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు, వారి అవయవాలు పని చేయకుండా పోతున్నాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

సరిహద్దులో నిఘా

కళ్లకురిచ్చిలో కల్తీ సారా తయారీకి మిథనాల్‌ను పుదుచ్చేరి మార్గంగా తరలించినట్లు తెలియడంతో పుదుచ్చేరి- తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో పోలీసులు నిఘా ఉంచారు. పుదుచ్చేరిలో కాలాప్పట్టు, గోరిమేడు తదితర చెక్‌పోస్టుల్లో సోదాలు తీవ్రతరం చేశారు.

ఇద్దరు నిందితుల అరెస్టు

ప్యారిస్‌: కళ్లకురిచ్చి కల్తీ సారా మరణాల కేసుని సీబీసీఐడీ దర్యాప్తు చేస్తోంది. కేసులో సంబంధమున్న చెన్నైకి చెందిన శివకుమార్‌ కోసం గాలించసాగారు. ఈ నేపథ్యంలో చెన్నై ఎంజీఆర్‌ నగర్‌లో దాగిఉన్న అతన్ని ఆదివారం ఉదయం ప్రొహిబిషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని సీబీసీఐడీ పోలీసులకు అప్పగించనున్నారు.

వేళచ్చేరి: ఈ కేసులో శనివారం వరకు 10 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారం మేరకు కడలూర్‌ జిల్లా బన్రుట్టిలో చిప్స్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్న శక్తివేల్‌ను సీబీసీఐడీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇతని జీఎస్టీ బిల్లును మాదేష్‌ అనే వ్యక్తి ఉపయోగించి మినరల్‌ టర్పంటైన్‌ ఆయిల్‌ కోనుగోలు చేసి నీళ్లలో కలిపి అనేక మందికి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది.

విక్రయాలపై ఫిర్యాదుకు ఫోన్‌ నెంబరు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి సమీపం కరుణాపురంలో కల్తీ సారా తాగి 57 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రజలు, పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు, సామాజిక కార్యకర్తలు సారాయి విక్రయాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సారా విక్రయాలపై ప్రజలు ఫిర్యాదు చేసే విధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 90807 31320 అనే ఫోన్‌ నెంబరును నోటీస్‌ బోర్డులో ఉంచినట్లు జిల్లా కలెక్టరు ఎంఎస్‌ ప్రశాంత్‌ తెలిపారు.

బాధిత కుటుంబాలకు భాజపా సాయం

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి కల్తీ సారా బాధితులను పరామర్శించడానికి కళ్లకురిచ్చికి వచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మృతుల కుటుంబాలకు భాజపా తరఫున తలా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేస్తామని, కేంద్ర ప్రభుత్వ పథకాలు త్వరగా అందేలా చూస్తామని ప్రకటించారు. ఆ మేరకు శనివారం సాయంత్రం భాజపా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్య, పార్టీ నిర్వాహకులు 29 బాధిత కుటుంబాలకు తలా రూ.లక్ష చొప్పున చెక్‌లు అందజేశారు. మిగలిన కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు.

మరణాలకు డీఎంకే ఎమ్మెల్యేలే కారణం

టీటీవీ దినకరన్‌

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి కల్తీ సారా మరణాలకు డీఎంకే ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులే కారణమని ఏఎంఎంకే అధ్యక్షుడు టీటీవీ దినకరన్‌ ఆరోపించారు. కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన ఆదివారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కళ్లకురిచ్చి పట్టణంలో పోలీసు స్టేషన్‌ వెనుకే సారాయి విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనకు ఆ ప్రాంతంలోని డీఎంకే ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులే ప్రధాన కారణమని విమర్శించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా సీఎం స్టాలిన్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి ముత్తుసామి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్‌ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.


అధికారుల సహకారంతో అమ్మకాలు

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ డైరెక్టర్‌

వేళచ్చేరి, న్యూస్‌టుడే: సారాయి విక్రయాలకు అధికారులు సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ డైరెక్టర్‌ రవివర్మన్‌ తెలిపారు. కళ్లకరిచ్చి కల్తీ సారా ఘటనపై విచారణ జరపడానికి వచ్చిన ఆయన బాధిత కుటుంబాలను కలిసి మాట్లాడారు. ఆయన శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను కమిషన్‌కు సమర్పిస్తానన్నారు. సారా విక్రయాలకు ఇక్కడి అధికారులు సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయలేదని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఈ ఘటనతో సంబంధం లేని వారిపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ఈ ప్రాంతంలో పనిచేసే వీఏవో, ఆర్‌ఐకు విక్రయాల గురించి తెలుసన్నారు.


పోస్టుమార్టం పూర్తవకుండానే అంత్యక్రియలు

పరిహారం కోసం ఇద్దరు మృతుల కుటుంబాల వేడుకోలు

జయమురుగన్‌ మృతదేహాన్ని వెలికితీసేందుకు చేసిన ఏర్పాట్లు

ఈనాడు-చెన్నై: కళ్లకురిచ్చి కరుణాపురం ఘటనలో రెండు మృతదేహాలకు సంబంధించి సందిగ్ధత నెలకొంది. మాధవచ్చేరి గ్రామానికి చెందిన ఇళయరాజా, జయమురుగన్‌ ఈనెల 18న మృతిచెందారు. తమకు పరిహారం ఇవ్వాలంటూ ఇరు కుటుంబీకులు కలెక్టర్‌ను సంప్రదించారు. కల్తీసారా ఘటనను ప్రభుత్వం గుర్తించకముందే వీరు చనిపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు. రెండు మృతదేహాలకు ఎలాంటి శవపరీక్షలు నిర్వహించకపోవడంతో పరిహారం సాధ్యమవుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అధికారులు సముదాయించినా కుటుంబీకులు వినడంలేదు. తమవాళ్లు కల్తీసారాతోనే చనిపోయారని చెప్పుకొచ్చారు. దీంతో స్పందించిన కలెక్టర్‌.. ఇరువురి మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. కానీ ఇళయరాజా మృతదేహాన్ని దహనం చేయడంతో శవపరీక్షకు అవకాశం లేకపోయింది. జయమురుగన్‌ మృతదేదహాన్ని మాత్రం ఆదివారం వెలికితీసి శవపరీక్షలకు పంపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని