logo

విక్రవాండిలో డీఎంకేకు గుణపాఠం నేర్పాలి : అన్నామలై

కళ్లకురిచ్చి దుర్ఘటన ముఖ్యమంత్రి స్టాలిన్‌ అసమర్థ పాలనకు నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. కళ్లకురిచ్చి కల్తీ సారా ఘటనకు నిరసనగా కోవైలో ఆదివారం భాజపా తరఫున ఆందోళన జరిగింది.

Updated : 24 Jun 2024 02:30 IST

 

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి దుర్ఘటన ముఖ్యమంత్రి స్టాలిన్‌ అసమర్థ పాలనకు నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. కళ్లకురిచ్చి కల్తీ సారా ఘటనకు నిరసనగా కోవైలో ఆదివారం భాజపా తరఫున ఆందోళన జరిగింది. కార్యకర్తలు సారా ప్యాకెట్ల నమూనాలను మాలగా ధరించి, పాడె కట్టి శవంలా పడుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దీనికి అన్నామలై అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 4661 గ్రంథాలయాలు, 2027 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, కానీ 5 వేలకు పైగా టాస్మాక్‌ మద్యం దుకాణాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇది మందు తాగేవారి సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆరోపించారు. కళ్లకుర్చి ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండు చేశారు. డీఎంకే నేతలు విచ్చలవిడిగా కల్తీసారా విక్రయిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని, ఫలితంగా సుమారు 55 మంది ప్రాణాలు పోయాయని ఆరోపించారు. మృతుల కుటుంబీకులకు పరిహారం మొత్తం ప్రకటించడంతో సరిపోదని, వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండు చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన డీఎంకేకు ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలని కోరారు.


విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు చేతులు కలుపుదాం

సీఎం స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు చేతులు కలుపుదామంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. పీజీ నీట్‌ పరీక్షలు వాయిదా పడటంపై ముఖ్యమంత్రి తన ‘ఎక్స్‌’ పేజీలో స్పందించారు. యూజీసీ నెట్‌ పరీక్ష రద్దు నేపథ్యంలో ఎన్‌టీఏ నిర్వహించే పీజీ నీట్‌ పరీక్షను వాయిదా వేయడం వేలాది మంది వైద్యుల నమ్మకాన్ని కోల్పోయేలా చేసిందన్నారు. ఇవి ఎప్పుడో జరిగే అరుదైన ఘటనలు కాకుండా కేంద్రీకృతమైన పరీక్షా విధాన విచ్ఛిన్నమైన వ్యవస్థ శవపేటికపై కొట్టే చివరి మేకులుగా ఉన్నాయని తెలిపారు. ఈ అవినీతి బయటకు వస్తున్న సమయంలో వృత్తివిద్య కోర్సులకు నియామక, సమానత్వం కలిగిన ఎంపిక విధానాన్ని ఏర్పరచి, పాఠశాల విద్య ప్రాధాన్యతను ధ్రువీకరించి, వృత్తివిద్య కోర్సులకు ఎంపిక విధానాన్ని తీర్మానించడంలో రాష్ట్ర హక్కులను తిరిగి పొందాలని పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల కుటుంబాలకు మళ్లీ నమ్మకాన్ని కల్పించి విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తును రూపొందించడానికి చేతులు కలుపుదామంటూ పిలుపునిచ్చారు.

మృతుల కుటుంబాలకు సాయం ప్రకటన

చెన్నై: తూత్తుకుడి జిల్లా ముక్కాణి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రభుత్వ సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి రూ.లక్ష చొప్పున సీఎం పబ్లిక్‌ రిలీఫ్‌ ఫండ్‌ నుంచి అందించాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే అరుళ్‌ తండ్రి మృతికి సంతాపం

చెన్నై: సేలం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అరుళ్‌ తండ్రి రామదాస్‌ మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ విచారం వ్యక్తం చేశారు. అరుళ్, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని