logo

సారా.. నిన్ను అరికట్టలేరా!

కళ్లకురిచ్చి మున్సిపాలిటీలో 7, 8, 9 వార్డుల పరిధిలో కరుణాపురం ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా పేదలుంటారు. ఇక్కడే సారా ఏరులై పారుతుంటుంది. అక్రమంగా తెచ్చిన మిథనాల్‌ను సారాలో కలపడం వల్లే పెద్ద ఎత్తున మరణాలు చోటుచేసుకున్నాయనేది తాజాగా నివేదికల్లో బయటపడింది.

Published : 24 Jun 2024 02:20 IST

రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మకాలు
హాట్స్పాట్లుగా పలు జిల్లాలు
యంత్రాంగం అలసత్వంతోనే మరణాలు పునరావృతం

కరుణాపురం ఘటన తమిళనాడు రాష్ట్రానికే కళంకం తెచ్చింది. ఎన్నో కుటుంబాలను అంధకారంలోకి నెట్టిన సారా.. కేవలం కరుణాపురానికి పరిమతం కాలేదు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో చాప కింద నీరులా వ్యాపించి గుప్పుమంటోంది. ఇప్పటికీ పలు జిల్లాలు ప్రమాదపుటంచున ఉన్నాయంటే ఆందోళనకు గురిచేసే అంశమే. తాజా ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత పడక్బందీగా చర్యలు చేపడుతుందనేది పెద్ద చర్చగా మారింది.

ఈనాడు-చెన్నై: కళ్లకురిచ్చి మున్సిపాలిటీలో 7, 8, 9 వార్డుల పరిధిలో కరుణాపురం ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా పేదలుంటారు. ఇక్కడే సారా ఏరులై పారుతుంటుంది. అక్రమంగా తెచ్చిన మిథనాల్‌ను సారాలో కలపడం వల్లే పెద్ద ఎత్తున మరణాలు చోటుచేసుకున్నాయనేది తాజాగా నివేదికల్లో బయటపడింది. వాస్తవానికి మిథనాల్‌పై ఎన్నో ఆంక్షలున్నా సరైన సమీక్ష, పర్యవేక్షణ లోపాలు బాగా కనిపిస్తున్నాయి. 2002 నుంచి కల్తీసారా మరణాల్లో మిథనాల్‌ కీలకపాత్ర పోషిస్తోందని ప్రభుత్వం గుర్తిస్తూ వస్తోంది. మిథనాల్‌పై ఆంక్షలు 1937 ప్రొహిబిషన్‌ చట్టంలో ఉన్నాయి. 1959లోనూ ఇందులో పలు సవరణలు తెచ్చారు. దీని ప్రకారంగా మిథనాల్‌ను అక్రమంగా తేవడం, అమ్మడం, నిల్వచేయడం నేరంగా పరిగణిస్తున్నారు. కానీ ఇప్పటికీ సారా దళారులకు, విక్రేతలకు అందబాటులో ఉంటోంది.

ఉత్తర ప్రాంతంలోనే బానిసలు

కల్తీసారా ప్రభావం ఉత్తర తమిళనాడు జిల్లాల్లో తీవ్రంగా ఉందనే చెప్పాలి. ప్రత్యేకించి విళుపురం, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ తరహా సారా తీసుకునేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. గతేడాది విళుపురం, చెంగల్పట్టులోనే 22 కల్తీసారా మరణాలు చోటుచేసుకున్నాయి. విళుపురం, కడలూరు జిల్లాల్లో చూస్తే రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోల్చితే అత్యధికంగా మద్యానికి బానిసైనవారున్నారు. 50ఏళ్ల పైబడిన పురుషులపరంగా చూస్తే.. విళుపురం జిల్లాలో 38శాతం మంది, కడలూరు జిల్లాలో 32.6శాతం మంది బానిసలయ్యారు. ఆ తర్వాత కాంచీపురం జిల్లాలో 28.9శాతం, అరియలూరు జిల్లాలో 28.1శాతం, తిరువణ్ణామలై జిల్లాలో 24.2శాతం మద్యం సేవించేవారున్నారు. ప్రభావిత జిల్లాల్లో పేదరికం కూడా ఎక్కువగా ఉండటం, తలసరి ఆదాయం కూడా తక్కువగా ఉండటం కనిపిస్తోంది. కానీ సారా, ఇతర మద్యం ఏరులై పారుతోంది. తలసరి ఆదాయం పరంగా చూస్తే తిరువణ్ణామలై 26వ స్థానంలో ఉంది. ఆ తర్వాత విళుపురం 29, అరియలూరు 32వ స్థానంలో ఉన్నాయి. విళుపురం, కడలూరు జిల్లాల్లోని గ్రామాల్లో పేదరికం బాగా ఎక్కువగా ఉందనే నివేదికలూ ఉన్నాయి.

సీఎం ఆదేశాలు ఏమయ్యాయి?

గతేడాది విళుపురం, చెంగల్పట్టులో కల్తీసారా మరణాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రత్యేకంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఇతర యంత్రాంగంతో సమావేశమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. శాంతిభద్రతలను అదుపుచేయడంతో పాటు కల్తీసారా, మిథనాల్‌మీద నిఘా ఉంచాలని ఆదేశించారు. తరచూ సమీక్షలు నిర్వహించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు ఇవ్వాలని కూడా చెప్పారు. తాజా ఘటనతో ఇవన్నీ జరగలేదని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంగానీ, జిల్లా యంత్రాంగాలన్నీ నిర్లక్ష్యంగా వ్యవహరించాయనేది స్పష్టంగా తెలుస్తోంది. వారే అప్రమత్తంగా ఉండుంటే ఇలాంటివి జరిగేది కాదని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా ఘటనతో మళ్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈసారైన పూర్తిగా కల్తీసారాకు అడ్డుకట్ట వేస్తారేమో చూడాలి.

భారీగా మద్యం అమ్మకాలు

రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.45,855.67 కోట్లు గడించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈసారి రూ.1734.54కోట్ల అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం అందుకుంది. తమిళనాడు నుంచి మద్యం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకూ వెళ్తోంది. వీటి ద్వారా తాజా ఆర్థిక సంవత్సరంలో 1.88కోట్ల ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు. ఇంపోర్టెడ్‌ ఫారెన్‌ మద్యం ద్వారా రూ.53.93కోట్ల ప్రత్యేక ఫీజుల్నీ అందుకున్నారు. టాస్మాక్‌ నిర్వహించే దుకాణాల పరంగా చూస్తే.. మద్యానికి బానిసలు ఎక్కువగా ఉన్న విళుపురం జిల్లాల్లో 209 ప్రభుత్వ దుకాణాలున్నాయి. దీనికన్నా ఎక్కువగా తిరువణ్ణామలైలో తెరిచారు.


9 జిల్లాల్లో తీవ్రం

రాష్ట్రంలో సారా అమ్మకాలు జోరుగా ఉన్నయనడానికి ఓ నివేదిక అద్దం పడుతుంది. 2021లో తమిళనాడు కేంద్ర జోన్‌ పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం 299 గ్రామాలు సారాకు బ్లాక్‌స్పాట్లుగా మారుతున్నాయి. అంటే.. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా అయ్యేంతగా ఉన్నాయి. తిరుచ్చి, పుదుక్కొట్టై, కరూర్, పెరంబలూర్, అరియలూర్, తంజావూర్‌ తిరువారూర్, నాగపట్టిణం, మైలాడుదురై జిల్లాల పరిధిలోనే ఈ గ్రామాలుండటం ఆందోళన కలిగించే విషయం. దీనిపై చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని