logo

ఆర్‌ఎస్‌ భారతిపై అన్నామలై పరువునష్టం దావా

డీఎంకే ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పరువునష్టం దావా వేశారు. కళ్లకురిచ్చి కల్తీసారా వ్యవహారంలో అన్నామలైకి సంబంధం ఉందని ఆర్‌ఎస్‌ భారతి ఆరోపించడంతో బుధవారం సైదాపేట కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు.

Published : 11 Jul 2024 00:24 IST

సైదాపేట కోర్టు ప్రాంగణంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

ప్యారిస్, న్యూస్‌టుడే: డీఎంకే ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పరువునష్టం దావా వేశారు. కళ్లకురిచ్చి కల్తీసారా వ్యవహారంలో అన్నామలైకి సంబంధం ఉందని ఆర్‌ఎస్‌ భారతి ఆరోపించడంతో బుధవారం సైదాపేట కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. అనంతరం అన్నామలై విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ భారతి వ్యాఖ్యలు తనకు ఎంతో బాధ కలిగించాయన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం పోరాడుతున్నానని, మూడేళ్లలో ఎవరిపైనా ఎలాంటి కేసు దాఖలు చేయాలేదన్నారు. రూ.కోటి చెల్లించాలని పరువునష్టం దావా దాఖలు చేశానని, ఈ నగదుతో కళ్లకురిచ్చిలో కల్తీసారా బాధితుల కోసం శిబిరం ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. దావా విషయంలో ఆర్‌ఎస్‌భారతి, డీఎంకేను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కల్తీ సారా కేసు సీబీఐ దర్యాప్తు చేస్తే నిజాలు బయటకొస్తాయన్నారు.


ఎదుర్కోవడానికి సిద్ధం

ఆర్‌.ఎస్‌.భారతి

చెన్నై: అన్నామలై వేసిన పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్‌.ఎస్‌.భారతి తెలిపారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... కళ్లకురిచ్చి దుర్ఘటన విషయమై రూ.2 కోట్ల నష్టపరిహారం కోరుతూ అన్నామలైకు నోటీసు పంపగా ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఆయన తనపై పరువునష్టం దావాతో కోర్టుకు వెళ్లారన్నారు. అన్నామలైపై పలు ఆరోపణలు ఉన్నాయని, ఒక్కొక్కటిగా కోర్టులో నిరూపిస్తానని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయంలో రూ.167 కోట్ల విలువైన బంగారం పట్టుబడిన వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి ప్రస్తుతం ఆయన కోర్టుకెళ్లారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని