logo

భౌ..భౌ

చెన్నైలోని వీధికుక్కలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఎంతమంది బాధితులుగా మారినా, గాయాలతో వారి రక్తం చిందినా.. చెన్నై కార్పొరేషన్‌ పూర్తిస్థాయిలో వాటి నియంత్రణకు చర్యలు తీసుకోలేదని ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.

Updated : 11 Jul 2024 06:44 IST

చెన్నైలో తీవ్రమవుతున్న కుక్కకాట్లు
జనాల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు
అప్రమత్తమైన జీసీసీ యంత్రాంగం

ఈనాడు-చెన్నై: చెన్నైలోని వీధికుక్కలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఎంతమంది బాధితులుగా మారినా, గాయాలతో వారి రక్తం చిందినా.. చెన్నై కార్పొరేషన్‌ పూర్తిస్థాయిలో వాటి నియంత్రణకు చర్యలు తీసుకోలేదని ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. పెద్దఎత్తున వారి కార్యాలయానికి ఫిర్యాదులు అందడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆరోపణలకు బలం చేకూర్చేలా నగరంలో కుక్కకాట్ల ఘటనలూ అంతకంతకు పెరుగుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారమే.. గత ఆరుమాసాల్లో ఏకంగా 10వేలకు పైగా కుక్కకాటు ఘటనలు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. ఏటా 20వేల నుంచి 30వేల దాకా ఇలాంటివి చోటుచేసుకుంటూ వస్తున్నాయి. మూడేళ్లుగా పరిస్థితిలో మార్పులు రాలేదు.

ఎటుచూసినా భయం

కొద్దినెలలుగా చూస్తే.. చిన్నపిల్లలపైనే కుక్కలు విరుచుకుపడుతున్నాయి. వీధుల్లో తిరిగేందుకు పిల్లలు, వారి తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. నగరంలో ఎప్పుడు కుక్కలు విరుచుకుపడిన ఘటన వెలుగులోకి వచ్చినా.. పిల్లల్ని ఆడుకునేందుకు బయటికి పంపడానికి కన్నవారు పూర్తిగా నిరాకరిస్తున్నారు. కార్పొరేషన్‌ నుంచి ఆశించిన చర్యలు తమకు కనిపించడంలేదని వారంటున్నారు. కొరుక్కుపేట హెచ్‌4 పోలీస్‌స్టేషన్‌ సమీపంలో పలు కుక్కలు అనారోగ్యంబారినపడ్డాయని.. అవి జనాలను కరవడంతో చాలామందికి ఇన్‌ఫెక్షన్‌ సోకుతోందని స్థానికుడు నటరాజన్‌ తెలిపారు. ఇది విస్తరించకుండా క్యాంపులు నిర్వహించాలని, కుక్కలపై చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. పురసైవాక్కం శవరణ పెరుమాళ్‌ వీధిలో పెద్దఎత్తున కుక్కలున్నాయని స్థానికుడు కార్తీక్‌ తెలిపారు. వాటినుంచి పిల్లలు, వీధివాసులు భయపడుతున్నారని వివరించారు.

సర్వేలో యంత్రాంగం

2018 తర్వాత నగరంలో కుక్కల గణన జరగలేదు. అప్పట్లో 59వేలు నగరంలో ఉన్నట్లు తేలింది. ఇవిప్పుడు 2లక్షలకు మించి ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. ప్రజలనుంచి పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండటంతో బుధవారం నుంచి గణనను అధికారులు ప్రారంభించారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో సర్వే చేపడుతున్నారు. ఒక్కో ప్రాంతంలో మూడు దఫాలుగా తిరిగి కుక్కల వివరాలు సేకరించనున్నట్లు పేర్కొన్నారు. 4నెలల పాటు అన్ని వీధుల్లో తిరిగి సమగ్ర నివేదిక ఇస్తారని జీసీసీ అధికారులు తెలిపారు. ఫలితాలు వచ్చాక మరింత ప్రభావమంతంగా కార్పొరేషన్‌ కుక్కకాట్ల నియంత్రణకు పనిచేస్తుందని వివరిస్తున్నారు. ఎక్కడా లోపాలు జరగకుండా, ఏ కుక్కా కుటుంబ నియంత్రణ, వ్యాక్సినేషన్‌ నుంచి దూరం కాకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు.

అధికారుల తీరుతో అసంతృప్తి... నగరంలోని 15 జోన్లలోనూ కుక్కల్ని పట్టుకుంటున్నట్లు జీసీసీ వెల్లడిస్తోంది. 2023లో 19,540 కుక్కల్ని పట్టుకుని14,885 శునకాలకు స్టెరిలైజేషన్‌ చేసి ప్రమాదరహితంగా మార్చామని వివరిస్తోంది. ఈ ఏడాది ఆరునెలల్లో ఇలా 6,986 కుక్కలకు చేసినట్లు చెబుతోంది. అన్నిజోన్లలోనూ వాటికి కుటుంబనియంత్రణ ఆపరేషన్లతో పాటు యాంటీరేబిస్‌ వ్యాక్సిన్లు వేస్తున్నట్లు వివరిస్తోంది. అధికారుల మాటలతో నగరవాసులు సంతృప్తి చెందనట్లుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఫిర్యాదుల ద్వారా చెబుతున్నారు. స్థానికంగా తమతమ ప్రాంతాల్లో కుక్కలు భయానకంగా ఉంటున్నాయని, చాలా ఘటనలు ఇందుకు సాక్ష్యమని, ఎంతోమందిని కరుస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. రాజకీయంగానూ ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకోవడంతో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కదిలొచ్చింది.

నాలుగు జోన్లలో..

చెన్నై, న్యూస్‌టుడే: కార్పొరేషన్‌లోని నాలుగు జోన్లలో వీధికుక్కలను లెక్కిస్తున్నారు. ఇందుకోసం కార్పొరేషన్‌ సిబ్బంది, వాలంటీర్లకు శిక్షణ సైతం అందించారు. తొలి విడతగా నాలుగు జోన్లలో లెక్కింపును బుధవారం ప్రారంభించారు.

లెక్కింపు పనులు చేపడుతున్న సిబ్బంది


ఒళ్లంతా గాట్లు..

ఈ ఏడాది జూన్‌ 1 కొలత్తూరులో 12 ఏళ్ల బాలుడిపై నాలుగు కుక్కలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకోవాలని చూసినా వీలుకాలేదు. వెంటపడి ముఖం, వీపు, చెవి, చేయి, మోకాలు, నెత్తిమీద.. ఇలా ఎక్కడపడితే అక్కడ గాయాలు చేశాయి. కుటుంబసభ్యులు, కుక్కల యజమానులు సైతం కాపాడే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. రక్తగాయాలతో ఉన్న బాలుడ్ని ఆర్‌పీఎస్‌ ఆసుపత్రికి తరలించి కాపాడారు.


పార్కుకెళ్తే..

థౌజండ్‌లైట్స్‌ పార్కులో ఘోరం జరిగింది. ఈ ఏడాది మే 6న అక్కడ ఆడుకుంటున్న 5ఏళ్ల చిన్నారితో పాటు పాప తల్లిని సైతం కుక్కలు గాయపరిచాయి. తప్పించుకోవాలని చూసినా శునకాలు వెంబడించాయి. ఈ ఘటన నగరవ్యాప్తంగా సంచలనం రేపింది. కుక్కల యజమానిని అరెస్టు చేశారు.


గుంపుగా వచ్చి..

ఆలందూరులో ఈ ఏడాది మే 7న 9ఏళ్ల అశ్వంత్‌ అనే బాలుడిపై కుక్కలు ప్రతాపం చూపాయి. పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. పరిగెత్తి కిందపడినప్పుడు కుక్కలు గుమికూడి మూకుమ్మడిగా కరిచాయని అంటున్నారు. ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని