logo

TRS: హుజూరాబాద్‌ తెరాసలో ఏం జరుగుతోంది..?

నివురుగప్పిన నిప్పులా.. దాగిన అసంతృప్తి హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని తెరాసలో ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. ఏక పక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఓ వర్గం నాయకులంతా

Updated : 01 Apr 2022 04:36 IST

ఆరా తీస్తున్న గులాబీ పార్టీ అధిష్ఠానం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

వీణవంకలో తెరాస నాయకుల సమావేశం

నివురుగప్పిన నిప్పులా.. దాగిన అసంతృప్తి హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని తెరాసలో ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. ఏక పక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఓ వర్గం నాయకులంతా రహస్య సమావేశాల నిర్వహణతో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతుంటుంటే.. మరో వర్గం నేతలు కూడా తమకున్న పట్టును చూపించుకునేందుకు రాజధానిలో భేటీలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా పదవిని దక్కించుకున్న పాడి కౌశిక్‌రెడ్డికి.. ఇటీవల హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన పార్టీ నియోజకవర్గ బాధ్యుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు ఉన్న పొరపొచ్చలు ప్రస్తుత పరిణామాలతో క్రమంగా బయటపడుతున్నాయి. ఉప ఎన్నికల తరువాత నుంచే ఈ నియోజవర్గంలో ఈ ఇద్దరు కీలక నేతల వ్యవహారం ఎవరికి వారే అనేలా ఉందనేది సొంతపార్టీ నేతలే పలు సందర్భాల్లో బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఈ నియోజకవర్గంలోని కీలకమైన ఇల్లందకుంట సీతారామాలయ కమిటీలో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి కేవలం తనకు అనుకూలంగా ఉన్న నాయకులకే చోటు కల్పించారనే విమర్శలు సొంతపార్టీ నుంచే వ్యక్తమవుతున్నాయి. జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్‌ మండలాలకు చెందిన కొందరు నాయకులు కౌశిక్‌రెడ్డి ఏక పక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని చేకూరుస్తున్నాయనేలా రహస్య సమావేశాల్ని ఎక్కడికక్కడ నిర్వహించారు. గురువారం కూడా వీణవంక మండలంలో ఓ వర్గం నాయకులు సమావేశమై పార్టీలోని తాజా పరిస్థితిపై చర్చించుకున్నారు. ఇలా సమావేశాల్ని నిర్వహించిన వారంతా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు అనుకూలంగా ఉన్న వర్గమనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డి కూడా తనకు అనుకూలమనుకున్న నాయకులు, ప్రజాప్రతినిధులను హైద్రాబాద్‌కు పిలిపించుకుని పార్టీ ముఖ్యులతో సమావేశమై తనకున్న మద్దతును కూడా తెలియజేసే ప్రయత్నాన్ని చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో గులాబీపార్టీ పెద్దలు కూడా ఇక్కడ జరుగున్న వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. నాయకుల మధ్య సమన్వయాన్ని కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని