logo

AP News: ఇసుక రేవులు..ఆగని వసూళ్లు!

అవసరమున్న వారికి సకాలంలో ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థకు స్వస్తి పలికి, ఆఫ్‌లైన్‌లో రేవు దగ్గరకు వాహనంతో వెళ్లి డబ్బులు చెల్లించి ఇసుక తీసుకెళ్లేలా నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

Updated : 22 Jul 2021 08:47 IST

 పాలసీ మారినా కష్టాలే 
 వినియోగదారులకు ఎదురుచూపులు 


రేవులో ఇసుకను నింపుతున్న ప్రొక్లయినర్‌

ఆజాద్‌నగర్‌(అనంతపురం), న్యూస్‌టుడే: అవసరమున్న వారికి సకాలంలో ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థకు స్వస్తి పలికి, ఆఫ్‌లైన్‌లో రేవు దగ్గరకు వాహనంతో వెళ్లి డబ్బులు చెల్లించి ఇసుక తీసుకెళ్లేలా నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వాహనంతో నేరుగా రీచ్‌లోకి వెళ్లిన వినియోగదారులు రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. రేవు నిర్వాహకులు, స్థానిక అధికార పార్టీ నేతలు, మధ్యవర్తులతో కుమ్మక్కై ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. వీరు చెప్పిన వారికే లోడ్‌ చేస్తుండటంతో వివాదాలు రేగుతున్నాయి. 
14 చోట్ల తవ్వుతున్నా..
నూతన పాలసీ అనుసరించి రాష్ట్రంలో కాంట్రాక్టు దక్కించుకున్న జేపీ వెంచర్స్‌ సంస్థకు జిల్లా అధికారులు (ఏపీ ఎండీసీ) 17 రేవులు అప్పగించారు. ఇందులో 14 చోట్ల తవ్వకాలు జరుగుతున్నా.. ఏడుచోట్ల మాత్రమే పూర్తి స్థాయిలో ఇసుక అందుతోంది. అన్ని రేవుల్లో తవ్వకాలు జరగక పోవడంతో వినియోగదారులు వరుస కడుతున్నారు. దీనికితోడు స్థానికులు తమ వాహనాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చి ఇసుక అందించాలని పట్టుబడుతున్నారు. ప్రతి రేవులో కనీసం 20 వాహనాలు అందుబాటులో ఉంచుతామని ప్రైవేటు సంస్థ ఇచ్చిన మాట కూడా అమల్లోకి రాలేదు. వినియోగదారులే సమకూర్చుకోవాల్సి వస్తోంది.
మధ్యవర్తులదే హవా
రేవుల్లో మధ్యవర్తులు హల్‌చల్‌ చేస్తున్నారు. ఎవరికైనా త్వరగా ఇసుక కావాలంటే వీరిని ప్రసన్నం చేసుకుని, డిమాండ్‌ మేరకు డబ్బు చెల్లిస్తే వెంటనే వాహనం రేవులోకి వెళ్లి, వీలైనంత వేగంగా ఇసుక నింపుకొని బయటకు వెళ్లిపోతోంది. కనగానపల్లి మండలంలోని కోనేటిపాళ్యం రేవులో ఇటీవల లారీకి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ జేపీ ప్రతినిధులతో ట్రాక్టరు, లారీ డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. ఇక్కడ స్థానిక అధికార పార్టీ నాయకుడు ఒకరు కొన్ని వాహనాలను లీజుకు తీసుకుని ఇసుకను తరలిస్తున్నారు. కంపెనీ మేనేజరుతో కుమ్మక్కై జిల్లా కేంద్రానికి ఇసుకను తరలిస్తున్నట్లు తెలిసింది.
ఒక పర్మిట్‌పై రెండు ట్రిప్పులు
రేవుల్లో జేపీ వెంచర్‌ కంపెనీ ప్రతినిధులు పర్మిట్లు అందజేస్తారు. పర్మిట్లలో సదరు వాహనం ఇసుకను డెలివరీ చేయడానికి మూడు నుంచి నాలుగు గంటల వ్యవధిని అనుమతి ఇస్తున్నారు. ఈ సమయాన్ని పలువురు టిప్పరు యజమానులు ఆసరాగా తీసుకుని పర్మిట్టులో అనుమతించిన సమయంలో రెండుసార్లు ఇసుక తరలిస్తున్నారు. రెండోదఫా నింపుకొనే క్రమంలో కంపెనీ ప్రతినిధులు వాహన యాజమాన్యాలతో అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 
నిబంధనలకు పాతర
నిబంధనల ప్రకారం రేవుల్లో ఇసుక తవ్వకాలు సాయంత్రం ఆరు గంటల వరకు జరపాలి. అయితే కోనేటిపాళ్యం రేవు నుంచి జిల్లా కేంద్రంతో పాటు, బెంగళూరు ప్రాంతానికి రాత్రి సమయాల్లో టిప్పర్లలో తరలుతున్నట్లు సమాచారం. ఈ రేవులో రాత్రి వేళల్లో కూడా తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసింది. తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు తన టిప్పర్లలో రేవు నుంచి ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నట్లు ఆరోపణలున్నాయి. రేవుల్లో బరువు తూచే యంత్రాలు లేవు. దీంతో ఎంత పరిమాణంలో ఇసుకను తరలిస్తున్నారో తెలుసుకోవడం కష్టంగా మారింది. 
గాడిలో పెడతాం: రమణారావు, 
డీడీ, గనులు భూగర్భశాఖ
రేవుల్లో ఇసుక నిర్వహణపై నిఘాకు మైనింగ్, రెవెన్యూ, పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వారిని అప్రమత్తం చేస్తాం. క్షేత్రస్థాయి పరిస్థితులను మరోసారి పరిశీలిస్తాం. రేవులకు వచ్చిన వినియోగదారులకు వీలైనంత త్వరగా ఇసుక లోడ్‌ చేసేలా చర్యలు తీసుకుంటాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని