logo

Vangalapudi Anitha: సమర్థత+విధేయత = అనిత.. అవమానాలు భరించి.. అంచెలంచెలుగా ఎదిగి..

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంగలపూడి అనిత తాజా కేబినెట్‌లో ఉమ్మడి విశాఖ నుంచి ఏకైక మంత్రిగా ఘనత వహించారు. పదేళ్ల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని సాధించిన విజయానికి ఇది నిదర్శనం.

Updated : 13 Jun 2024 10:04 IST

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంగలపూడి అనిత తాజా కేబినెట్‌లో ఉమ్మడి విశాఖ నుంచి ఏకైక మంత్రిగా ఘనత వహించారు. పదేళ్ల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని సాధించిన విజయానికి ఇది నిదర్శనం. ఆరంభంలో ఓ ఎమ్మెల్యేగా మాత్రమే జిల్లాకు పరిచయం ఉన్న అనిత ఈ పదేళ్ల కాలంలో ఏకంగా రాష్ట్రస్థాయిలో ఓ కీలకనేతగా ఎదగడం వెనుక ఆమె సమర్ధత.. పార్టీ పట్ల విధేయత దాగున్నాయి

ఈనాడు, అనకాపల్లి,న్యూస్‌టుడే, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల: జిల్లాలో సీనియర్‌ నేతలున్నా, వారిని కాదని అనితకు మాత్రమే మంత్రి పదవి కేటాయించడం చంద్రబాబు ఆమెపై కనబరిచిన నమ్మకానికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

పదేళ్ల క్రితం రాజకీయంగా అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు అనిత పేటలో అడుగుపెట్టారు. కష్టాన్ని నమ్ముకుని విజయ బావుటా ఎగురవేశారు. అయితే ఆమె రాజకీయ ప్రస్థానం నల్లేరు మీదు నడకలా సాగలేదు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులతోపాటు, ఐటీ మంత్రి లోకేశ్, సీఎం చంద్రబాబు వద్ద తన విజ్ఞతను ప్రదర్శించి నిధులు రాబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనా ఆమె పనితీరును గుర్తించిన చంద్రబాబు తెదేపా మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమెను నియమించారు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ అయిదేళ్ల కాలంలో వైకాపా చేసిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు చేశారు. లోకేశ్‌ సాగించిన యువగళం పాదయాత్రను నియోజకవర్గంలో విజయవంతం చేసి, ఆయన వద్ద మంచిపేరు సంపాదించారు. 


అనిత ఉపాధ్యాయురాలుగా పనిచేయడం కలిసొచ్చిన అంశం. ప్రతి విషయంపైనా సమగ్రమైన అవగాహన ఉండటం. వాగ్దాటి, సూటిగా మాట్లాడటంలో దిట్ట. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయరు. ఇవన్నీ గుర్తించిన అధిష్ఠానం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది. 

2019లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించి పోటీ చేశారు. వైకాపా ప్రభంజనంలో అనిత అక్కడ ఓటమి పాలయ్యారు. అనంతరం నియంతలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై అలుపెరగని పోరాటమే చేశారు. కేసులు పెడుతున్నా వెనుకంజ వేయలేదు. విచిత్రమేమిటంటే ఎస్సీ మహిళపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అన్ని అడ్డంకులు అధిగమించి వైకాపా ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు. కష్టకాలంలో శ్రమించినందుకు ఫలితం దక్కిందనే ఆనందాన్ని అనిత వ్యక్తం చేశారు.


ఎన్నాళ్లకెన్నేళ్లకు..

పాయకరావుపేట నియోజకవర్గాన్ని ఇన్నేళ్లూ ఊరిస్తూ వచ్చిన మంత్రి పదవి ఎట్టకేలకు వరించింది. నియోజకవర్గం ఏర్పడి 62 ఏళ్ల తర్వాత వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పేట వాసుల కలను సాకారం చేశారు.  

మెను నియోజకవర్గంలోని కూటమి నాయకులు అభినందనలతో ముంచెత్తారు. విజయవాడలో ఆమెను కలిసిన పెదిరెడ్డి చిట్టిబాబు, దేవవరపు రాజబాబు, కొప్పిశెట్టి వెంకటేష్, గూటూరు శ్రీనివాస్, బి.కాశీవిశ్వనాథ్, లాలం కాశీనాయుడు, జానకీ శ్రీను, వేచలపు జనార్దన్, సుంకర బాబ్జీ, ప్రకాశ్, శ్రీనువాస్, తిరుమలరావు,  తోట నగేష్, గెడ్డం బుజ్జి తదితరులు పుష్ఫగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. మంత్రి హోదాలో ఆమె శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు పేటకు వస్తున్నారని తెదేపా మండల శాఖ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు తెలిపారు. స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని