logo

ఆ అధికారుల్లో గుబులు.. తప్పులపై దండన తప్పదు!!

వైకాపా ప్రభుత్వ హయాంలో చట్టాలు, నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించిన అధికారుల జాబితాను కూటమి నాయకులు తయారు చేస్తున్నారు.

Updated : 14 Jun 2024 07:21 IST

వైకాపా పెద్దల అక్రమాలకు వంతపాడిన ఫలితం 
పలువురు జీవీఎంసీ అధికారులపై నివేదిక సిద్ధం

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌: రాష్ట్రంలో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారుల్లో గుబులు మొదలైంది. వైకాపా నాయకుల అక్రమాలకు వంతపాడిన కొందరు అధికారులపై బదిలీ వేటు వేయడంతోపాటు విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి.

వైకాపా ప్రభుత్వ హయాంలో చట్టాలు, నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించిన అధికారుల జాబితాను కూటమి నాయకులు తయారు చేస్తున్నారు. దీంతో ఆయా అధికారులు బదిలీ కావడానికి సిద్ధమవుతుండగా, ఇతర ప్రాంతాల నుంచి జీవీఎంసీకి రావడానికి కొంత మంది ఇప్పటికే పైరవీలు ప్రారంభించారు.

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన..

వైకాపా ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించిన నేతలు నిబంధనలకు విరుద్ధమైన ఆదేశాలిచ్చినా అధికారులు అమలు చేశారు. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన టైకూన్‌ కూడలి మూసివేతలో జీవీఎంసీ అధికారులు కీలకంగా వ్యవహరించారు. హైకోర్టులో కేసులుండగా సీబీసీఎన్‌సీ స్థలంలో నిర్మాణానికి ప్లాను మంజూరు చేయడం, మధురవాడలో స్థలాలకుగాను కొందరు వైకాపా పెద్దలకు రూ.208కోట్ల టీడీఆర్‌ ఇవ్వడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ఓ ప్రాజెక్టు నిర్వాహకులకు లబ్ధి చేకూరేలా కేవలం ఏడాది వీఎల్టీ విధించడం, రామానాయుడు ఫిల్మ్‌ స్టూడియోలో భూ వినియోగ మార్పిడి చేయడం వంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటిపై నాడు తెదేపా, జనసేన నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

ఉక్కిరిబిక్కిరి:  జీవీఎంసీలో అక్రమాలపై తెదేపా, జనసేన నాయకులు గత కౌన్సిల్‌ సమావేశాల్లో నిలదీశారు. కొందరు అధికారులు వారి వాదనను పట్టించుకోకుండా వైకాపా నాయకుల నిర్ణయాలను అమలు చేశారు. తమకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని, కమిషనర్‌ క్షేత్రస్థాయి పర్యటనల్లోనూ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన వైకాపా నాయకులకు ప్రాధాన్యమిస్తున్నారని తెదేపా, జనసేన, భాజపా కార్పొరేటర్లు వాపోయినా స్పందన కరవైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో వైకాపా నాయకులతో అంటకాగిన అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మున్ముందు ఏ చర్యలు తీసుకుంటారోనని ఆందోళన పడుతున్నారు.

  • యూసీడీలో ఓ కీలక అధికారిపై లెక్కకు మిక్కిలి ఫిర్యాదులు వచ్చాయి. వైకాపా పెద్దల అండ చూసుకుని ఆయన చేసిన అరాచకాలు అన్నీఇన్నీకావు. ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు ఓట్లు వేయించడానికి ఆర్పీలు, ఏపీడీలను వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిగినా ఆయనపై ఈగ కూడా వాలలేదు.

‘పట్టణ ప్రణాళిక’పై భారీగా ఆరోపణలు

జీవీఎంసీలో పలువురు అదనపు కమిషనర్లు వైకాపా నాయకులకు అనుకూలంగా వ్యవహరించి టెండర్లు, ఇతర పనులలో వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారు. వైకాపా నాయకులు చెప్పిన గుత్తేదారులకు మాత్రమే బిల్లులు చెల్లించారు. ఆయా అంశాలన్నింటిపైనా విచారణ జరపాల్సి ఉంది. జీవీఎంసీలో ఎన్నడూలేని విధంగా ఓ అధికారి చెప్పిన గుత్తేదారులకే టెండర్లు ఇవ్వడం గమనార్హం. వైకాపా నాయకులు గెలిచిన వార్డుల్లో అభివృద్ధి పనులను నామినేషన్‌ పద్ధతిపై అప్పగించడం, పని జరిగిన తరువాత టెండర్లు పిలవడం వంటి చర్యల వెనుక భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

  • గత ఐదేళ్లలో నగరంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగాయి. ఈ వ్యవహారంలో వైకాపా ప్రజాప్రతినిధులు భారీగా లబ్ధి పొందారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలోని పలువురు అధికారులు వారి అడుగులకు మడుగులొత్తుతూ కీలకమైన ప్లాన్లకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో అక్రమాలు, అవినీతికి పాల్పడిన అధికారులపై వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని