logo

పేదల కళ్లల్లో వెలుగు

దేశంలోనే ఒకే ప్రాంగణంలో 22 వేల మందికి ఉపాధిని చూపిస్తూ రికార్డుకెక్కిన బ్రాండిక్స్‌ సంస్థ ఇప్పుడు పేద ప్రజలకు కంటిచూపును అందిస్తూ ఆదర్శనీయమైన సేవలు అందిస్తోంది.

Updated : 31 Mar 2023 05:43 IST

40,234 మందికి ఉచిత వైద్య సేవలు

వంద వారాలు దాటిన బ్రాండిక్స్‌ శిబిరాలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

శిబిరంలో కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు

దేశంలోనే ఒకే ప్రాంగణంలో 22 వేల మందికి ఉపాధిని చూపిస్తూ రికార్డుకెక్కిన బ్రాండిక్స్‌ సంస్థ ఇప్పుడు పేద ప్రజలకు కంటిచూపును అందిస్తూ ఆదర్శనీయమైన సేవలు అందిస్తోంది. ఇక్కడి కంటి శిబిరానికి వచ్చే వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ.. పైసా ఖర్చులేకుండా నమ్మకమైన సేవలు అందివ్వడంతో కంటి వైద్యశిబిరానికి వచ్చే ప్రజల సంఖ్య తగ్గడం లేదు. నెలలో రెండు, నాలుగు ఆదివారాలు క్రమం తప్పకుండా నిర్వహించే శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి 800 మంది వరకు హాజరవుతున్నారు. 2017లో జనవరి 22న అచ్యుతాపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభమైన కంటి వైద్య శిబిరానికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిపోవడంతో బ్రాండిక్స్‌ ఆవరణలో రూ.కోటిన్నరతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇలా ప్రజల నమ్మకాన్ని చూరగొన్న బ్రాండిక్స్‌ ఇప్పటివరకు 103 వారాల పాటు విజయవంతంగా శిబిరాలు నిర్వహించింది. ఈ శిబిరాల ద్వారా 40,234 మందికి వైద్య సేవలు అందివ్వగా, వీరిలో 4 వేల మందికి మందికి శస్త్రచికిత్సలు చేయగా 25,736 మందికి కళ్లద్దాలు అందించారు. శిబిరాలకు హాజరయ్యే వారికి మజ్జిగ, అల్పాహారం, భోజనాలు కూడా అందిస్తున్నారు.


ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు గొర్లె గంగ. రాంబిల్లి మండలానికి చెందిన ఈ వృద్ధురాలి భర్త అనారోగ్యంతో మంచానపడ్డాడు. పిల్లలు లేరు. ఇలా పుట్టెడు కష్టంలో ఉన్న ఈమె కంటిచూపు నాలుగేళ్లగా మసమసకగా కనిపిస్తున్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మంచానపడ్డ భర్తను గుర్తుకు తెచ్చుకుని కంటి శస్త్రచికిత్స చేయించుకోలేకపోయింది. చుట్టుపక్కలవాళ్లు బ్రాండిక్స్‌ కంటి వైద్యశిబిరం గురించి చెప్పడంతో పాటు దగ్గరుండి శస్త్రచికిత్స చేయించడానికి ముందుకొచ్చారు. దీంతో గంగకు కంటిచూపు తిరిగి వచ్చింది.


ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు కె.సత్యవతి. విశాఖలో పేరున్న కంటి ఆసుపత్రులు, క్లినిక్‌లు ఎన్నో ఉన్నా బ్రాండిక్స్‌ కంటి వైద్యశిబిరం అందిస్తున్న నమ్మకమైన సేవలు ఈమెను విశాఖ నుంచి అచ్యుతాపురం రప్పించాయి. వైద్య శిబిరానికి హాజరై సేవలు పొందింది. వేలాది రూపాయలు ఫీజు చెల్లించి ప్రైవేటు కంటి ఆసుపత్రులకు వెళ్లినా అందని సేవలు బ్రాండిక్స్‌ కంటి వైద్యశిబిరం ద్వారా పొందానని మహిళ ఆనందంగా చెబుతోంది.

..ఇది ఏదో ఒకరిద్దరు మహిళలు చెప్పిన మాటలు కాదు. బ్రాండిక్స్‌ కంటి వైద్యశిబిరంపై ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలకు ఉన్న నమ్మకానికి రెండు సాక్ష్యాలు.


మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు

- కొల్లి వరలక్ష్మి, వాలంటీర్‌, కంటివైద్యశిబిరం

బ్రాండిక్స్‌లో ఉచిత కంటి వైద్య శిబిరాల్లో వాలంటీర్‌గా పనిచేస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన 103 శిబిరాలకు హాజరై రోగులకు నా వంతు సాయం చేస్తున్నాను. ఇక్కడ చికిత్సలు పొందిన వేలాది మంది ఆప్యాయంగా పలకరించడంతో పాటు మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు.


ఆత్మసంతృప్తి కల్గింది

- కేవీ.వేణుగోపాల్‌, ఏజీఎం, శంకర్‌ ఫౌండేషన్‌

కంటివైద్య శిబిరాలకు హాజరై రోగులకు అవసరమైన మార్గనిర్దేశం చేయడం ద్వారా ఎంతో గుర్తింపు వచ్చింది. శంకర్‌ ఫౌండేషన్‌ ద్వారా వేలాది మందికి వైద్యసేవలు అందించినా బ్రాండిక్స్‌ కంటి వైద్యశిబిరం ద్వారా అందిస్తున్న సేవలు ఒక వ్యక్తిగా ఎంతో ఆత్మ సంతృప్తి పొందాను. సామాన్య ప్రజలకు ఇక్కడ అందుతున్న సేవలు ఆదర్శనీయం.


ఆ వృద్ధుడి బాధే కదిలించింది..

- దొరస్వామి, బ్రాండిక్స్‌ భారతీయ భాగస్వామి, అచ్యుతాపురం

విశాఖ నుంచి కంపెనీకి వస్తుండగా కళ్లు కనిపించని ఓ వృద్ధుడు అచ్యుతాపురం కూడలి దాటలేక ఇబ్బందిపడుతున్నాడు. అతన్ని రోడ్డు దాటించి కంటిచూపుపై ప్రశ్నిస్తే అందరూ ఉన్నా శస్త్రచికిత్స చేయించడంలేదని దీనంగా చెప్పాడు. అప్పుడే ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటుచేయాలనే ఆలోచన కల్గింది. శ్రీకిరణ్‌ కంటి ఆసుపత్రి ద్వారా లక్షలాది మందికి పద్మశ్రీ అవార్డు గ్రహీత చంద్రశేఖర్‌ అందిస్తున్న సేవలను తెలుసుకుని వారి ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించాం. ఆదాయం సంపాదిస్తేనే కుటుంబసభ్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. వయసు మీదపడి కళ్లు కనిపించకపోయినా పట్టించుకోవడం లేదు. ఇటువంటి వారికి కంటిచూపును అందివ్వడమే లక్ష్యంగా శిబిరాలు నిర్వహిస్తున్నాం.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు