logo

సీఆర్‌ఎస్‌ విచారణలో రైల్వే ఉద్యోగులు?

ఒడిశా బాలాసోర్‌ సమీపంలోని బహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషన్‌ (సీఆర్‌ఎస్‌) ఇప్పటికే రంగంలోకి దిగింది.

Published : 06 Jun 2023 04:59 IST

టీటీఈలు, ఇతర సిబ్బంది నుంచి వివరాల సేకరణ

ఈనాడు, విశాఖపట్నం : ఒడిశా బాలాసోర్‌ సమీపంలోని బహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషన్‌ (సీఆర్‌ఎస్‌) ఇప్పటికే రంగంలోకి దిగింది. ఆ ఘటనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న రైల్వే ఉద్యోగులను విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పలువురు ఉద్యోగులను పిలిపించి వారి నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ రైలు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన ఉద్యోగుల నుంచి ప్రాథమిక వివరాలు తీసుకున్నారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో మొత్తం అయిదుగురు టిక్కెట్‌ తనిఖీ అధికారు(టీటీఈ)లు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగానే ఉన్నారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు కుర్దా డివిజన్‌కు చెందిన వారవగా యశ్వంత్‌పూర్‌-హవ్‌డాలో ఉన్న ఇద్దరు టీటీఈలు ఖరగ్‌పూర్‌కు చెందినవారు. వీరు చిన్నపాటి గాయాలతో బయటపడినప్పటికీ ఆ షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నట్లు తెలిసింది. ఈ నెల 2న జరిగిన దుర్ఘటనలో ఖరగ్‌పూర్‌ కంట్రోల్‌రూంకు టీటీఈనే మొదటిగా సమాచారం చేరవేసినట్లు తెలిసింది. రైళ్లు ఢీకొన్నాయి.. అధిక సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారన్న సమాచారాన్ని చెప్పారు. ప్రస్తుతం వీరంతా సీఆర్‌ఎస్‌ విచారణలో ఉన్నారు. ఈ సందర్భంగా వారి నుంచి.. ప్రమాదం జరగడానికి కొంత సమయం ముందు నుంచి, జరిగిన తరువాత వరకు చోటుచేసుకున్న వివిధ పరిణామాలు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగినపుడు ఏ కోచ్‌లో ఉన్నారు? అందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? వంటి వివరాలతో పాటు కొన్ని అనుమానాలకు సంబంధించిన విశ్వసనీయ ప్రశ్నలు వారిని అడిగినట్లు తెలుస్తోంది. వీరే కాకుండా స్టేషన్‌ సిబ్బంది, ఇతర సాంకేతిక విభాగాల ఉద్యోగులను విచారిస్తున్నట్లు సమాచారం.

అందుకే పక్కా లెక్క

తీవ్ర ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌-హవ్‌డా రైళ్లలో రిజర్వేషన్‌ బోగీల ప్రయాణికుల విషయంలో ఎటువంటి గందరగోళం ఏర్పడలేదు. ఈ రైళ్లు ఏఏ స్టేషన్ల వద్ద ఆగింది, అక్కడ ఎంతమంది ఎక్కారు, ఎంతమంది దిగారు వంటి వివరాలు స్పష్టంగా దొరికాయి. దీంతో చాలా వరకు ఆ సమాచారం ఇతర రాష్ట్రాల ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడానికి చాలా దోహదపడింది. ఈ వివరాలు ఇంత స్పష్టంగా రావడం వెనుక టీటీఈలకు ఇచ్చిన ట్యాబ్‌లే కారణమని సీనియర్‌ టీటీఈలు పేర్కొంటున్నారు. అంతకుముందు చార్టుల్లో వివరాలు నమోదు చేసేవారు. అప్పట్లో రైలు బోగీల్లో టీటీఈల వద్ద ఉండే రిజర్వేషన్‌ చార్టులే అత్యంత కీలకం. ఎక్కిన వారి వద్ద రౌండ్‌ చేసుకునేవారు. ఏ రిజర్వేషన్‌ బోగీలో ఎంతమంది ఎక్కారు, ఎక్కడెక్కడ ఎక్కారు, రిజర్వేషన్‌ చేసుకొని ఎక్కని వారు ఎందరు? వారికి బదులుగా ఎక్కిన వారి వివరాలు నమోదు చేసుకునేవారు. పెద్ద ప్రమాదాలపుడు ఆ చార్టులు ధ్వంసమయ్యేవి. చిరిగి కనిపించకుండా పోయేవి. ఆ సమయంలో వాటిని వెతకడమూ ఇబ్బందే. ఇన్ని ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకొని ట్యాబ్‌లు ఇవ్వడం వల్ల ఎప్పటికప్పుడు ఆ వివరాలు నమోదు చేయడంతో ఆ సమాచారం అంతా కంట్రోల్‌రూంకు చేరి నిక్షిప్తం అవుతుంది. ఒడిశా ఘటనలో ఇది చాలా ఉపయోగపడిందంటున్నారు. ఈ కారణంగానే యశ్వంత్‌పూర్‌లో ఏపీ వాసులు ఏ స్టేషన్ల వద్ద ఎంతమంది ఎక్కారు, కోరమాండల్‌లో ఎక్కడెక్కడ ఎంతమంది దిగుతారో అన్న వివరాలు ఉన్నాయంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని