logo

అట్టహాసంగా శ్రీభరత్‌ నామినేషన్‌

తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్‌ సోమవారం అట్టహాసంగా నామినేషన్‌ వేశారు.

Published : 23 Apr 2024 04:48 IST

మండు టెండలో భారీ ర్యాలీ
తరలివచ్చిన కూటమి నేతలు, శ్రేణులు

కలెక్టరేట్‌ వద్ద ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, కూటమి నాయకులు

వన్‌టౌన్‌, ఎంవీపీకాలనీ, న్యూస్‌టుడే: తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్‌ సోమవారం అట్టహాసంగా నామినేషన్‌ వేశారు. మండుటెండలో భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చిన ఆయన రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. ఉదయం 10గంటల సమయంలో ఎంవీపీకాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. శ్రీభరత్‌ తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సతీమణి తేజస్విని, కుమారుడు ఆర్యవీర్‌ వెంట రాగా ర్యాలీగా ముందుకు సాగారు. ఎంవీపీ రైతుబజార్‌, మద్దిలపాలెం, గురుద్వారా, డాబాగార్డెన్స్‌, జగదాంబ కూడలి, కేజీహెచ్‌ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

ర్యాలీలో మాట్లాడుతున్న తేజస్విని

ర్యాలీలో దారి పొడవునా ఎక్కడికక్కడ ప్రజలు శ్రీభరత్‌కు ఘనంగా ఆహ్వానం పలికారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో నగరంలోని పలు ప్రాంతాలు జన జాతరను తలపింపజేశాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. తూర్పు, గాజువాక, పశ్చిమ, భీమిలి, ఎస్‌.కోట, ఉత్తరం, దక్షిణం కూటమి అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గణబాబు, గంటా శ్రీనివాసరావు, కోళ్ల లలితకుమారి, పి.విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, ఇతర నేతలు గండి బాబ్జీ, కోన తాతారావు, రవీంద్రరెడ్డి, పీవీఎన్‌ మాధవ్‌, పసుపులేటి ఉషాకిరణ్‌, ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో శ్రీభరత్‌ సతీమణి తేజస్విని ప్రజలకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు.

ప్రశాంత వాతావరణానికి తూట్లు: శ్రీభరత్‌

నామినేషన్‌ అనంతరం శ్రీభరత్‌ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అరాచక పాలనలో విశాఖలో ప్రశాంత వాతావరణానికి తూట్లు పడ్డాయన్నారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. విశాఖ లాంటి నగరం నుంచి యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పోలవరం నుంచి సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని తరలిస్తామని చెప్పారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

ఎంవీపీ రోడ్‌లో వాహనాలపై ర్యాలీగా వచ్చిన అభిమానులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని