logo

ఆరేళ్ల బాలికపై అత్యాచారం

గాఢనిద్రలో ఉన్న ఆరేళ్ల బాలికను తల్లిదండ్రుల కన్నుగప్పి ఎత్తుకెళ్లిన దుండగులు ఆమెపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.

Published : 12 Jun 2024 02:44 IST

పాడేరు, న్యూస్‌టుడే: గాఢనిద్రలో ఉన్న ఆరేళ్ల బాలికను తల్లిదండ్రుల కన్నుగప్పి ఎత్తుకెళ్లిన దుండగులు ఆమెపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరులో రెండు రోజులుగా మోదకొండమ్మ జాతర జరుగుతోంది. కొంతమంది పట్టణంలోని జూనియర్‌ కళాశాల సమీపంలోని చర్చి పరిసరాల్లో గలాటా చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలోని ఓ నివాసితుడు ఇంటి ముందు అల్లరి చేయడం తగదని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కేకలేశారు. కాసేపటికి దుండగులు ఈ ఇంట్లో ప్రవేశించి గాఢనిద్రలో ఉన్న ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. సీబీఎం చర్చి పరిసరాల్లో పెద్ద కేకలు వినిపించడంతో ఇంట్లో ఉన్న బాలిక నానమ్మ బయటకు వచ్చి సంఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో దుండగులు బాలికను తుప్పల్లో వదిలి పరారయ్యారు. బాలిక కన్నీరుపెడుతూ నానమ్మకు జరిగిన సంఘటన చెప్పింది. వెంటనే బాలికను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యులు పరీక్షించి రక్తస్రావం అధికంగా అవుతోందని గుర్తించి మెరుగైన వైద్యసేవల నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక కేజీహెచ్‌లో వైద్యం పొందుతోందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు, బంధువులు పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


హత్య కేసులో పదేళ్ల జైలు

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10లక్షల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌ మంగళవారం తీర్పునిచ్చారు. న్యాయస్థానం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కాండ్రేగుల జగదీశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అనకాపల్లి జిల్లా నాతవరం పోలీసుస్టేషన్‌ పరిధిలోని శృంగవరం గ్రామానికి చెందిన పైల రమణ వ్యవసాయదారుడు. అదే ప్రాంతానికి చెందిన సుర్ల వెంకటరమణ ఆయనకు వరసకు మేనల్లుడు అవుతాడు. వారి మధ్య భూ తగాదాలు ఉన్నాయి. ఈ విషయమై ఇద్దరు పలుమార్లు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో 2014 అక్టోబరు 25న సుర్ల వెంకటరమణ గ్రామంలో జరిగిన సంతకు వెళ్లాడు. అక్కడ పైల రమణ ఎదురుపడి మళ్లీ తగవుకు దిగాడు. రాయితో వెంకటరమణ తల, ముఖంపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు నాతవరం పోలీసులు నిందితుడ్ని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని