logo

విద్యాసామగ్రి వచ్చేసింది

పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు బడికి రావడానికి సిద్ధమవుతున్నారు. విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి జిల్లాలకు చేరుకుంటోంది.

Published : 12 Jun 2024 03:02 IST

రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం
నక్కపల్లి, న్యూస్‌టుడే

మండలాలకు చేరిన పాఠ్యపుస్తకాలు

పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు బడికి రావడానికి సిద్ధమవుతున్నారు. విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి జిల్లాలకు చేరుకుంటోంది.

జిల్లాలో 1475 పాఠశాలలుండగా, గత విద్యాసంవత్సరంలో సుమారు 1.55 లక్షల మంది విద్యనభ్యసించారు. ఇదే ప్రాతిపదికన ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యా సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల హడావుడితో అనుకున్నదానికంటే సామగ్రి కాస్త తక్కువగా వచ్చింది. వచ్చినదాన్ని ప్రస్తుతం మండలాలకు పంపించారు. ఏటా పాఠ్యపుస్తకాలు, షూ, బెల్టులు, రాత పుస్తకాలు, బ్యాగులు ఇస్తున్నారు. ప్రస్తుతం 1,07,122 షూలు, 7,41,980 రాత పుస్తకాలు, సుమారు 30 వేల వరకు బ్యాగులు రాగా బెల్టులు ఇంతవరకు చేరుకోలేదు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 4.61 లక్షల పాఠ్య పుస్తకాలు రావల్సి ఉండగా, ఈ నెల ఒకటో తేదీకి 2.25 లక్షల వరకు వచ్చాయి. 8, 9, 10 తరగతులకు సంబంధించి మూడొంతుల వరకు చేరుకున్నాయి. బడులు ప్రారంభం తర్వాత వీటిని ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విద్యార్థులకు అందించే అవకాశం ఉంది. దీనికితోడు నూతన ప్రభుత్వం రాకతో విద్యావ్యవస్థలో మరిన్ని సత్ఫలితాలు వస్తాయని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ తీస్తామని ప్రకటించడం నిరుద్యోగుల్లో ఆనందం నింపుతుండగా, పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులుంటే బోధన వ్యవస్థ పటిష్ఠమవుతుందని చూస్తున్నారు.

ఇటీవల మండల కేంద్రాలకు చేరుకుంటున్న బ్యాగులు, షూలు


బడులు తెరవగానే సరఫరా..

జిల్లాలకు అవసరమైన విద్యాసామగ్రి చాలా మేర చేరుకుంది. రాత పుస్తకాలు, షూ పూర్తిగా చేరాయి. వచ్చిన వాటిని మండల కేంద్రాలకు పంపించాం. పాఠ్య పుస్తకాలు మూడొంతులు వచ్చాయి. మిగిలినవి వచ్చేస్తున్నాయి. బడులు తెరవగానే పాఠశాలలకు పంపిస్తారు. అక్కడి నుంచి ఉన్నతాధికారుల సూచనలు, ఆదేశాల ప్రకారం వీటి పంపిణీ ఉంటుంది. ఇప్పటికే మండలాల అధికారులతో మాట్లాడి, ఎక్కడెక్కడ ఎంతంత సామగ్రి రావల్సి ఉందో తెలుసుకుంటున్నాం.

ఎం.వెంకటలక్ష్మమ్మ, డీఈఓ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని