logo

ప్రతిభావంతులు

ఏపీ ఈఏపీసెట-2024 ఫలితాలలో నగర విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరిలో పలువురు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో కూడా ప్రతిభ చూపారు. ఆయా విద్యార్థుల మనోగతం  ఇలా..

Published : 12 Jun 2024 03:27 IST

న్యూస్‌టుడే - కార్పొరేషన్, మురళీనగర్, పెందుర్తి, గాజువాక, కూర్మన్నపాలెం, గోపాలపట్నం

ఏపీ ఈఏపీసెట-2024 ఫలితాలలో నగర విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరిలో పలువురు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో కూడా ప్రతిభ చూపారు. ఆయా విద్యార్థుల మనోగతం  ఇలా..


ఇంజినీరింగ్‌

విదేశాల్లోవిద్యాభ్యాసం: పట్టాభిరెడ్డితోటకు చెందిన ఎం.బాల ఆదిత్య ఇంజినీరింగ్‌లో 13వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు శివప్రసాద్, సుజాతలు ప్రోత్సహించారు. ప్రతీరోజు 12 గంటలు సమయం వెచ్చించి ఈ ర్యాంకు తెచ్చుకున్నట్లు బాల ఆదిత్య తెలిపాడు. ముంబయి ఐఐటీలో సీఎస్‌సీ చదివి ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లాలని ఉందన్నాడు.


సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరవుతా..: జీవీఎంసీ 92వ వార్డు నరసింహనగర్‌లో నివాసం ఉంటున్న రెడ్డి అనిల్‌కు 34వ ర్యాంకు వచ్చింది. తండ్రి వెంకట సత్యసాయినాయుడు డిఫెన్స్‌ సివిలియన్‌గా పని చేస్తున్నారు. తల్లి పద్మ గృహిణి. ముఖ్యమైన అంశాలపై నిత్యం నోట్స్‌ రాసుకుని చదవడంతో మంచి ర్యాంకు వచ్చిందని, భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడతానని అనిల్‌ చెప్పాడు.


మద్రాస్‌ ఐఐటీలో చేరుతా..: కూర్మన్నపాలెం వుడానగర్‌ ఫేజ్‌-7 ద్వారకాపురి కాలనీలో నివాసం ఉంటున్న తోట ధీరజేశ్వర్‌కు ఇంజినీరింగ్‌లో 43వ ర్యాంకు వచ్చింది. ఆయన తండ్రి ఎల్‌వీ సూర్యనారాయణ ఫార్మా ఉద్యోగి. తల్లి నళిణి గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షలో 693వ ర్యాంకు రావడంతో మద్రాసు ఐఐటీలో చేరి.. సీఎస్‌ఈ చదువుతానని ధీరజేశ్వర్‌ తెలిపాడు.


ర్యాంకుల సాధనలో సత్తా: జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ శ్రమశక్తినగర్‌ దరి నాగేంద్రకాలనీకి చెందిన ఇనపకుర్తి రాజేశ్‌ వరుస ర్యాంకులతో సత్తాచాటాడు. మంగళవారం విడుదలైన ఏపీఈఏపీ సెట్లో 60వ ర్యాంకు సాధించాడు. దీంతో పాటు జేఈఈ మెయిన్స్‌లో 213, అడ్వాన్స్‌డ్‌లో 206, తెలంగాణ ఎంసెట్లో 70వ ర్యాంకు సాధించాడు. తండ్రి శంకరరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి భాగ్యలక్ష్మి గృహిణి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావడమే లక్ష్యంగా చదివినట్లు రాజేశ్‌ పేర్కొన్నాడు.


ప్రత్యేక కార్యాచరణతో విజయం: మజ్జి రిషివర్ధన్‌ ఇంజినీరింగ్‌లో 63వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు తిరుపతిరావు, సంతోషికుమారి. ‘పరీక్షలకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేశా. ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా సమయం నిర్దేశించుకుని చదివా. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో కూడా మంచి ర్యాంకులు వచ్చాయి.ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తాన’ని రిషివర్ధన్‌ తెలిపారు.


పరిశోధకుడిగా స్థిరపడతా..: జీవీఎంసీ 92వ వార్డు శ్రీసాయినగర్‌లో నివాసం ఉంటున్న బుద్ధ తన్మయ్‌కు ఏపీ ఈఏపీ సెట్‌లో 70వ ర్యాంకు వచ్చింది. అతని తల్లిదండ్రులు గోవిందరావు, భూదేవి అధ్యాపకులుగా పని చేస్తున్నారు. నిత్యం సమయం వృథా కాకుండా, అన్ని అంశాలు చదవడంతోనే మంచి ర్యాంకు వచ్చిందని, భవిష్యత్తులో పరిశోధకునిగా స్థిరపడతానని తన్మయ్‌ తెలిపారు.


ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలు ఉపయోగపడ్డాయి: చింతు సతీష్‌ కుమార్‌ ఇంజినీరింగ్‌లో 81వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు బుచ్చన్న, రమాదేవి. ‘ఎన్‌సీఆర్‌టీ పాఠ్యపుస్తకాలపై ఎక్కువ దృష్టి సారించా. కళాశాలలో ఇచ్చిన మెటీరియల్‌ను బాగా చదివా. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తాన’ని సతీష్‌కుమార్‌ చెప్పారు.


సబ్జెక్టులపై పట్టు సాధించి..: అల్లు హేమంత్‌ ఇంజినీరింగ్‌లో 82వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు ఏవీఎస్‌ నాయుడు, ఆర్‌.రాజేశ్వరి. ‘భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో వచ్చే సందేహాల నివృత్తికి అధిక సమయం కేటాయించా. తద్వారా సబ్జెక్టులపై పట్టు సాధించి మంచి మార్కులు తెచ్చుకున్నా. ఐఐటీ ముంబయి లేదా చెన్నైలో కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తాన’ని హేమంత్‌ తెలిపారు.


అగ్రికల్చర్, ఫార్మసీ

కార్డియాలజిస్టుగా స్థిరపడతా.. : కూర్మన్నపాలెం సమీప వడ్లపూడి నిర్వాసిత కాలనీలో నివాసం ఉంటున్న మనో అభిరామ్‌కు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 8వ ర్యాంకు వచ్చింది. అతడి తండ్రి నాగభూషణరావు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. తల్లి ద్రాక్షాయణి గృహిణి. నీట్‌లో ఆల్‌ ఇండియా స్థాయి 5187 ర్యాంకు రావడంతో ఎంబీబీఎస్‌లో చేరి, కార్డియాలజిస్టుగా స్థిరపడతానని అభిరామ్‌ తెలిపారు.


వైద్య రంగంలో రాణిస్తా..: గాజువాక బీసీరోడ్డు భానోజీతోటలో నివాసం ఉంటున్న శరగడం పావనీకి అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 9వ ర్యాంకు వచ్చింది. ఆమె తండ్రి నాగ గంగారామ్‌ అదానీ గంగవరం పోర్టులో ఉద్యోగి. తల్లి లావణ్య గృహిణి. నిత్యం 12 నుంచి 14 గంటల పాటు చదివి, అన్ని అంశాలపై పట్టు సాధించడంతో మెరుగైన ర్యాంకు వచ్చిందని, భవిష్యత్తులో వైద్య రంగంలో రాణిస్తానని పావనీ పేర్కొన్నారు.'


సర్జన్‌ అవుతా..: సాయిసూర్య పవన్‌కుమార్‌కు అగ్రికల్చరల్‌ ఫార్మసీ అండ్‌ బీఎస్సీ నర్సింగ్‌లో 32వ ర్యాంకు వచ్చింది. అయితే నీట్‌ పరీక్షలో జాతీయస్థాయిలో 3354 ర్యాంకు రావడంతో దానిని ఎంచుకుని సర్జన్‌గా సేవలందిస్తానని పవన్‌కుమార్‌ తెలిపాడు. తండ్రి వెంకటసాయి సుబ్రహ్మణ్యం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సీనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరు మురళీనగర్‌ సెక్టార్‌-9లో నివాసం ఉంటున్నారు.


ప్రతి సబ్జెక్టుకు ప్రణాళిక రూపొందించుకున్నా..: సూర్యచరణ్‌ దేసిన అగ్రికల్చర్, ఫార్మసీలో 49వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు ప్రసాద్, రాణి. ‘ఏపీ ఈఏపీసెట కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకున్నా. ప్రతిరోజు 9 గంటలపాటు చదివా. అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యమిచ్చి సాధన చేయడంతో మంచి ర్యాంకు వచ్చింద’ని సూర్యచరణ్‌ తెలిపారు.


ఎంబీబీఎస్‌ చదువుతా....: అనకాపల్లి జిల్లా మునగపాక మండలం మెలిపాక గ్రామానికి చెందిన గుర్రం వీర వెంకట శరణ్య కుటుంబం వడ్లపూడిలో నివాసం ఉంటుంది. ఆమెకు అగ్రికల్చర్, ఫార్మసీలో 94వ ర్యాంకు వచ్చింది.  తండ్రి శ్రీనివాసరావు మునగపాక సమీప చూచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విస్తరణాధికారిగా పని చేస్తున్నారు. తల్లి జ్యోతి గృహిణి. నీట్‌లో ఆల్‌ ఇండియా స్థాయి 8,412వ ర్యాంకు రావడంతో ఎంబీబీఎస్‌ చదువుతానని శరణ్య పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని